Read more!

ముసలం మొదలైందా.. రాజీనామాలు చేయబోతున్నారా! ఆ లేఖే కొంప ముంచిందా?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో ముసలం పుట్టబోతుందా? జగన్ విధానాలతో తమ కొంప మునుగుతుందని ఆ పార్టీ నేతలే భయపడుతున్నారా? కష్టాలు రాకముందే తప్పుకోవాలని డిసైడవుతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో సంచలనం జరుగబోతుందనే సంకేతాలు వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం మొదలుకానుందని తెలుస్తోంది. 

 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఎం వైఎస్ జగన్ లేఖ దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దేశంలోని న్యాయ నిపుణులు, న్యాయవాదులు జగన్ లేఖపై తీవ్రంగా స్పందిస్తున్నారు. జగన్ పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. జగన్ లేఖలకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. జగన్ రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేస్తుందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి.

 

సీజేఐకి జగన్ లేఖ రాసిన తర్వాత వైసీపీ నేతల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. న్యాయ వ్యవస్థ ఏదో చేస్తుందన్న భయం అధికార పార్టీ నేతలను వెంటాడుతుందని చెబుతున్నారు. జగన్ లేఖ తర్వాత జరుగుతున్న పరిణామాలపై వైసీపీలోని చాలా మందిలో ఒక రకమైన ఆందోళన పెరిగిందంటున్నారు. జగన్ రాజకీయంగా ప్రస్తుతం తనకున్న బలాన్ని ఎక్కువగా ఊహించుకుని తప్పులు చేస్తున్నారు అనే భావన చాలా మంది అధికార పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. ఇదేరకమైన అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. 

 

ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మీడియా ముందు లెక్చర్లు దంచే వైసీపీ నేతలు కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. కోర్టులపై, న్యాయమూర్తుల పై రెచ్చిపోయి మాట్లాడే నాయకులు ఇప్పుడు కనిపించటం లేదు. చాలా మందిలో కేసుల్లో ఇరుక్కుంటాం అనే ఆందోళన ఉందని..అందుకే మీడియాతో మాట్లాడేందుకు జంకుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారులు కూడా మీడియా ముందుకు రావడానికి గాని, సలహాలు ఇవ్వడానికి గాని ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు అయితే అమరావతి రాక రెండు నెలలు అయిందట. అంతే కాదు చాలా మంది సలహాదారులు  మంత్రులతోనే మాట్లాడటం లేదని సమాచారం. ఇక ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఏకపక్ష వార్తలు వడ్డించే జర్నలిస్ట్ లు కూడా కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. 
 

సీజేఐకి జగన్ రాసిన లేఖను ఏ వర్గం మీడియా అయితే హైలెట్ చేసిందో ఆ మీడియా కూడా యూ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరి నుంచో  సూచనలు రావడం వల్లే అందరూ  సైలెంట్ అయ్యారని భావిస్తున్నారు. ఆరుగురు సలహాదారులు రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారనే అంతర్గత సమాచారం. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వంలో సంచలనమే. న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక రాజ్యసభ ఎంపీ చుట్టూ కొన్ని పరిణామాలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో.. సదరు ఎంపీ రాష్ట్రానికి కూడా రావడం లేదని తెలుస్తోంది. 

 

గత కొన్ని రోజులుగా రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు చేస్తున్న వ్యాఖ్యలతో అధికార పార్టీ నాయకుల్లో అలజడి మొదలైందని చెబుతున్నారు. అన్నీ బాగుంటే తరువాత చూసుకోవచ్చు, కొన్ని రోజులు సైలెంట్ అయితేనే మంచిదని వారు భావిస్తున్నారట. అందుకే ఎప్పుడూ హడావుడి చేసే నేతలు కూడా ఏం మాట్లాడటం లేదని, అమరావతి రావడానికి కూడా భయపడుతున్నారని చెబుతున్నారు. మొత్తంగా జగన్ రాసిన లేఖతో ఆయన ఇబ్బందుల్లో పడటంతో పాటు నేతలందరిని ఇరికించేలా ఉన్నారనే చర్చ వైసీపీ నేతల్లోనే అంతర్గతంగా జరుగుతుందని తెలుస్తోంది. పార్టీలో రాజీనామాల పర్వం మొదలైతే మాత్రం అది ఆగకుండా ఉండే అవకాశం ఉందని కొందరు అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు.