130, 90, 30, 15.. ఇవి ర్యాంకులు కావు.. పడిపోతున్న వైసీపీ సీట్లు!

వైనాట్ 175 ఇదీ కొద్ది కాలం కిందటి  వరకూ ఏపీలో అధికార వైసీపీ నేతలు చేసిన ప్రకటనలు.  స్వయంగా సీఎం జగన్ రెడ్డి ప్రదర్శించిన ధీమా.  ఔను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకూ అంతా వైనాట్ 175 అంటూ  తమ భుజాలు తామే చరుచుకునే వారు. ఒక దశలో వైనాట్ 175 అనేది ఒక నినాదంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని కూడా చూశారు.  కానీ    వైసీపీ  చేయించుకున్న సొంత సర్వేలు, ప్రైవేట్ సంస్థల సర్వేలు, గడప గడపకి వైసీపీ లాంటి కార్యక్రమాలలో ప్రజలలో వ్యతిరేకత చూసిన వైసీపీ నేతలలో సౌండ్ తగ్గిపోయింది. వైనాట్ 175 నినాదాన్ని పక్కన పెట్టిన వైసీపీ నేతలు కాస్త సీట్లు తగ్గినా  మాదే అధికారం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతకు ముందు వైనాట్ 175 అన్న సీఎం జగన్ మోహన్ రెడ్డే మళ్ళీ అదే నోటితో  ‘సంఖ్య త‌గ్గినా.. నేనే సీఎం' అని వ్యాఖ్యానించారు. 

గత ఎన్నికలలో వైసీపీ 151 స్థానాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.  ముందుగా వైనాట్ 175 అన్న వైసీపీ నేతలు ఆ తర్వాత ఈసారి 130కి పైగా స్థానాలతో మాదే విజయం అంటూ ప్రకటించారు. సాక్షాత్తు జగనే సంఖ్య త‌గ్గినా.. నేనే సీఎం అంటూ వ్యాఖ్యానించగా.. 120 స్థానాల‌లో త‌మ పార్టీ గెలుస్తుంద‌ని.. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒక‌రు ఆఫ్‌ది రికార్డుగా వ్యాఖ్యానించారు.  వైసీపీ చేయించుకున్న కొన్ని సర్వే సంస్థలు ఆ మధ్య వైసీపీ 90 స్థానాలకే పరిమితం అవుతుందని నివేదికలు ఇచ్చాయి ఇచ్చాయి. అయితే గత మూడు నెలల కాలంలో  అధికార పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. అంతకంతకూ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు తోడు ప్రభుత్వం నిలకడ లేని నిర్ణయాలు..  కక్షపూరిత రాజకీయాలు ప్రజలలో విసుగుపుట్టిస్తున్నాయి.  ఫలితంగా వైసీపీకి ఈసారి 30 స్థానాలు రావడమే గగనమని ఆఫ్ ది రికార్డ్ గావైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

వైనాట్ 175తో మొదలైన వైసీపీ ప్రకటనల ప్రస్థానం ఇప్పుడు చివరికి 15 స్థానాల స్థాయికి దిగజారింది. నెల్లూరు జిల్లా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మధ్యనే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో టీడీపీ, జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని,  వైసీపీకి ఈసారి 15 సీట్లు దక్కడమే మహా భాగ్యం అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి 57 శాతం ఓట్లు తెచ్చుకుటుందని చెప్పిన కోటం రెడ్డి.. గతంలో తాను చెప్పినవన్నీ జరిగాయని.. ఇప్పుడు కూడా జరగబోయేది ఇదేనని బల్లగుద్ది చెప్పారు.  దీంతో కోటం రెడ్డి వ్యాఖ్యలపై చర్చలు జరుగుతున్నాయి. వైసీపీకి  ఘోర పరాజయం తప్పదన్న కోటం రెడ్డి జోస్యం వెనక ఉన్న బలమైన కారణాలను పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాష్ట్రంలో  వైసీపీ గ్రాఫ్ దాదాపు పాతాళానికి పడిపోయిందన్నది  విశ్లేషకుల మాట. యువత ఉపాధి కోసం తీసుకొచ్చిన స్కిల్ డెవలప్మెంట్ లో వైసీపీ ప్రభుత్వానికి స్కాం కనిపించడం, రిటైర్డ్ అధికారుల నుండి.. మాజీ న్యాయమూర్తుల వరకూ అందరూ చంద్రబాబు అరెస్టును తప్పుబట్టడం, ఏపీ నుండి అమెరికా వరకూ నిరసనలు, జాతీయ స్థాయిలో చంద్రబాబుకు పెరుగుతున్న మద్దతు.. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు మరికొన్ని   కేసులు కూడా బనాయించడం, పీటీ వారెంట్లు, చంద్రబాబును జైలుకే పరిమితం చేస్తామన్న వైసీపీ నేతలు ప్రకటనలు,  లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తామన్న బెదిరింపులు ఇలా ఎన్నో అంశాలపై ప్రజలలో చర్చ జరుగుతుంది. జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్న భావన రోజు రోజుకూ బలపడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రజలలో నెలకొన్న అభిప్రాయాలూ, టీడీపీ,జనసేన పొత్తుతో మారిన సమీకరణాలు.. ఇలా అన్నీ కలిసి ఈసారి టీడీపీకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టడం ఖాయమన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది.   మొత్తం మీద తమ గ్రాఫ్ వేగంగా పతనమౌతోందని స్వయంగా వైసీపీ నేతలే ఓపెన్ గా ప్రకటించడం కొసమెరుపు. 

Teluguone gnews banner