Read more!

చావగొడుతున్న భార్య.. చెరువులోకి దిగిన భర్త!

ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన. భర్త భార్యని కొడితే వార్త కాదు.. భార్య భర్తని కొడితే వార్త. అలాంటి వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని కొంపల్లె ప్రాంతానికి చెందిన నగేష్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్ళయింది. (చాలామంది భార్యలు ఆమెని సంప్రదించి, భర్తని కొట్టడం ఎలా అనే పాఠాలు నేర్చుకునే ప్రమాదం వుంది కాబట్టి, సదరు భార్య పేరు గానీ, ఆమె వివరాలు గానీ ఇవ్వడం లేదు.. ఇది భర్తలకు మావంతుగా మేం అందిస్తున్న సహకారం). వీళ్ళ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరో ముగ్గురో పిల్లలు కూడా వున్నారు. పిల్లలు పుట్టేవరకూ బాగానే వుందిగానీ, ఆ తర్వాత ఏం తేడా వచ్చిందో ఏమో, సదరు నగేష్ భార్య భర్తని చావబాదడం ప్రారంభించింది. తనకు ఎప్పుడు కోపమొస్తే అప్పుడు భర్తకి బడితపూజ చేసేది. చేతికి ఏది దొరికితే దానితో చావబాదే పెళ్ళాం ధాటికి తట్టుకోలేక, ఇక జీవించి వృధా అని నగేష్ ఏం చేశాడంటే, తన ఇంటికి దగ్గర్లోనే వున్న చెరువులోకి దిగాడు. ఇది గమనించిన వారు, పెద్దగా అరిచి నగేష్‌ని ఆపారు. చెరువులో ఎందుకు దూకావని అడిగితే, నగేష్ తన కష్టాన్నీ చెప్పుకుని బాధపడ్డాడు. 

తన భార్య తనను ప్రతిరోజూ టైమ్ టేబుల్ తప్పకుండా కొడుతుందని, అప్పుడప్పుడు వాతలు కూడా పెడుతుందని చెప్పుకొచ్చి భోరుమన్నాడు. తన మాటలు జనం నమ్ముతారో లేదోనని చొక్కా విప్పి మరీ తన ఒంటి మీద వున్న వాతలు చూపించాడు. తన పిల్లలని తన దగ్గరకి రానివ్వదని, తన పిల్లల కోసం ఐస్‌క్రీమ్ కొని తీసుకెళ్తే, తన భార్య దాన్ని పిల్లలకు పెట్టకుండా తానే తినేస్తుందని చెప్పి లబోదిబోమన్నాడు. భార్య టార్చర్ భరించలేక తాను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళడం కూడా మానుకుంటానని చెప్పాడు. అలాంటి సందర్భాల్లో తన పిల్లలు డాడీ ఎక్కడకి వెళ్ళాడమ్మా అని తన పిల్లలు అడిగితే, తన భార్య చచ్చిపోయాడు అని కూల్‌గా చెబుతుందని చెప్పి నగేష్ బావురుమన్నాడు. తన భార్య నుంచి తనకు విడాకులు కావాలని వేడుకున్నాడు. విడాకులు ఇప్పించకపోతే చచ్చిపోతానని చెప్పాడు. దాంతో స్థానికులు అతనికి నచ్చజెప్పారు. తాడు వేసి అతన్ని  చెరువులోంచి పైకి లాగాడు. పరిస్థితులు మెల్లగా చక్కబడతాయిలే అని అతనికి చెప్పి ఇంటికి పంపించారు. నగేష్ ఇంటికి వెళ్ళాడు. మరి పరిస్థితులు చక్కబడతాయో... భార్య చేతిలో ఇంకో రౌండ్ కోటా పడుతుందో ఆ పైవాడికే తెలియాలి.