హిందూ ధార్మిక సంస్థలకు దేవాలయాల భూములు..ఐవైఆర్ అభ్యంతరం ఎందుకు? ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలకు. రాజులు, జమీందార్లు, భక్తులు దానంగా ఇచ్చిన భూములు విస్తారంగా ఉన్నాయి.  ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేవాలయాల నిర్వహణకు వాడుతుంటారు.  అయితే దేవాలయాలకు చెందిన భూములు ఎక్కవ భాగం ఆక్రమణలకు గురయ్యాయి. ఇందులో  రహస్యం ఏమీ లేదు.  ఈ ఆక్రమణలకు ప్రధాన కారణం ప్రభుత్వం, ఎండోమెంట్స్ శాఖ ఈ భూముల పట్టించుకోకపోవడం, ఖాళీగా వదిలేయడమే కారణం. ఈ భూములను వేలం ద్వారా లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ.. జనం ముందుకు రాని పరిస్థితి ఉంది. 

ఇప్పుడు ఈ భూములను వినియోగంలోకి తీసుకురావడానీ, దేవాలయాల నిర్వహణకు అవసరమైన ఆదాయం సమకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దేవాలయాలకు చెందిన  వ్యవసాయేతర భూములను లాభాపేక్షలేని హిందూ సంస్థలకు లీజుకు ఇవ్వలని నిర్ణయించింది. అలా లీజుకు తీసుకునే హిందూ ధార్మిక సంస్ఠలకు కనీసం రెండు దశాబ్దాల ఛారిటీ ట్రాక్ రికార్డు కలిగి ఉండాలని నిబంధన పెట్టింది. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న హిందూ ధార్మిక సంస్థలకు దేవాలయాలకు చెందిన నిరుపయోగ భూములను నామమాత్రపు ధరకు లీజుకు ఇవ్వాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇలా కేటాయించడం వల్ల..  దేవాలయాల భూములు ఆక్రమణదారుల కబంధ హస్తాలలోకి వెళ్లకుండా నిరోధించడమే కాకుండా.. హిందూ ధార్మిక సంస్థలకు కూటాయించడం ద్వారా సమాజానికి ఉపయుక్తంగా మారుతాయి. దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం సహజంగా అయితే ఉండకూడదు. కానీ ఒక మాజీ ఐఏఎస్ అధికారి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా కూడా పని చేశారు. ఆయనే ఐవైఆర్.

విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి సీఎస్ గా పని చేసిన ఆయన.. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ హోదాలలో హోదాలలో పని చేశారు. అప్పట్లో ఆయన సర్వీసులో ఉండగా ఆలయ భూముల పరిరక్షణకు తీసుకున్న చర్యలేవీ లేవు. అటువంటి ఐవైఆర్ దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వస్తే అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నిటికీ మించి స్వయం ప్రకటిత హిందూ పరిరక్షకుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అటువంటి ఐవైఆర్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్టిన పోస్టుపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  వేలం లేకుండా భూముల కేటాయింపు సరికాదు. అలా చేయడం వల్ల అవి దుర్వినియోగమౌతాయి. చట్టబద్ధంగా దీనిని అడ్డుకోవాలంటూ ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు.

 

ఐవైఆర్ కు దేవాలయాల భూములు నిరుప యోగంగా ఉన్న సంగతి తెలుసు. వేలం ద్వారా వాటిని లీజుకు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడానికి గల కారణాలూ తెలియవని అనుకోలేం. హిందూ ధార్మిక సంస్థలకు వీటిని కేటాయించడం వల్ల ఆలయ భూములను కాపాడి, హిందువులకు, హిదూ ధార్మిక సంస్థలకు సహాయం చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి, వ్యతిరేకించడం వెనుక ఐవైఆర్ ఉద్దేశమేంటన్నది అర్ధం కాదు. పదవీ విరమణ చేసిన నాటి నుంచీ ఐవైఆర్ తీరు  అనుమానాస్పదంగానే ఉంది. హిందూ పరిరక్షణ పేర ఆయన వ్యవహరిస్తున్న తీరు వెనుక రాజకీయ కారణాలున్నాయన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు నిర్ణయాలను తప్పుపట్టడం వినా ఆయన హిందూ వాదిగా చేసిందేమీ లేదని అంటున్నారు.  

Teluguone gnews banner