Read more!

వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య?

బీఆర్ఎస్ లో వచ్చే లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థుల కరవు తీవ్రంగా కనిపిస్తోంది. ఎంతగా డిమాండ్ వస్తున్నా కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకు సుముఖంగా లేరని తేలిపోయింది. ఆ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారు కూడా పోటీకి నిరాకరించి పక్క పార్టీల్లోకి జంప్ కొట్టేస్తున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలో కేసీఆర్ అభ్యర్థుల కోసం వేట మొదలెట్టారు. అందులో భాగంగానే మాజీ మంత్రి, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందుగా పార్టీతో విభేదించి, అభ్యర్థుల ఎంపికలో పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రాజయ్యను కేసీఆర్ మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ లోక్ సభ స్థానం ఆఫర్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శుక్రవారం (ఏప్రిల్ 12) కేసీఆర్ పిలుపు మేరకు తాటికొండ రాజయ్య హుటాహుటిన కేసీఆర్ ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు.  మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తెకు కేసీఆర్ వరంగల్ బీఆర్ఎస్ సీటు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పోటీకి నిరాకరించి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. దీంతో కంగుతిన్న కేసీఆర్ చూపు రాజయ్యపై పడింది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కడియం శ్రీహరితో విభేధించి, ఆయనకు కేసీఆర్ స్టేషన్ ఘనపూర్ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు కడియం శ్రీహరి కుమార్తె హాండివ్వడంతో కేసీఆర్ రాజయ్యను ఆ స్థానంలో పార్టీ అభ్యర్థిగా నిలిపేందుకు నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. రాజయ్య కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలివ్వడంతో కేసీఆర్ ఆయనను ఫామ్ హౌస్ కు ఆహ్వానించారు. ఇప్పుడో ఇహనో కేసీఆర్ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య పేరును ప్రకటించే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.