Read more!

ఈ పీకుడు గోలేంటి కేటీఆర్?

అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడారు... చివరికి ఏమైంది? అహంకారాన్ని అస్సలు క్షమించని తెలంగాణా ప్రజలు కుర్చీలోంచి కిందకి లాగేసి పాతాళంలో పడేశారు. మన వాగుడు వల్లే అధికారం పోయిందనే విషయాన్ని అర్థం చేసుకుని ఇప్పుడైనా పద్ధతిగా  మాట్లాడ్డం ప్రాక్టీసు చేయాలి కదా? బీఆర్ఎస్ నాయకులకు ఇంకా ఈ సోయి కలగలేదు. మరీ ముఖ్యంగా చిన్నదొర కేటీఆర్‌కి అయితే ఇప్పటికీ నోటి మీద కంట్రోల్ రాలేదు.

అధికారంలో ఉన్నప్పటికంటే డబుల్ అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అప్పుడు అధికారంలో వున్న అహంకారం ఆయన మాటల్లో వినిపించేది. ఇప్పుడు అధికారం పోయిన ఆక్రోశంతో కూడిన అహంకారం వినిపిస్తోంది... అప్పుడైనా ఇప్పుడైనా కేటీఆర్ నోట కామన్‌గా, కామన్‌సెన్స్ లేకుండా వినిపిస్తున్న రెండు పీకుడు పదాలేంటంటే, ‘మా వెంట్రుక కూడా పీకలేరు’, ‘ఏం పీక్కుంటారో పీక్కోండి’.తెలంగాణ ప్రజలు ఎంతో పద్ధతిగా, సంస్కారంతో మాట్లాడతారు. పండితుడైనా, పామరుడైనా మాటలో మర్యాద వుంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అండ్ కో తమకు ఇష్టమొచ్చినట్టుగా, నోటికొచ్చినట్టుగా మాట్లాడేసి ‘మా తెలంగాణలో ఇంతే’ అని తమ నోటి దురుసుతనాన్ని మొత్తం తెలంగాణకు ఆపాదించారు. బయటి రాష్ట్రాల వాళ్ళు పొరపాటుగా వీళ్ళ మాటలు వింటే, తెలంగాణ ప్రజలంతా ఇలాగే మాట్లాడతారేమో అనుకునే పరిస్థితి సృష్టించారు. సరే, ఉద్యమ సమయంలో అలా మాట్లాడారులే అనుకుని సరిపెట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అధికారంలో వున్న పదేళ్ళూ తమ నోరు మంచిది కాదనే విషయాన్ని నిరూపించుకుంటూనే వున్నారు.

ముఖ్యంగా కేటీఆర్ గారి ‘పీకుడు’ భాష విషయానికి వస్తే, అధికారంలో వున్నా, అధికారం ఊడిపోయినా ఆయన నోటి వెంట మాత్రం ‘పీకుడు భాష’ వస్తూనే వుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం విషయంలోగానీ, ఈడీ విషయంలో గానీ ‘ఏం పీక్కుంటారో పీక్కోండి’, ‘ఏమీ పీకలేరు’, ‘వెంట్రుక కూడా పీకలేరు’ లాంటి అనేక అద్భుతమైన పదాలు కేటీఆర్  నోటి నుంచి జాలువారాయి. పీకలేరు.. పీకలేరు.. అని పదేపదే అంటే, ఈడీ పీకిమరీ చూపించింది. భవిష్యత్తులో ఇంకా ఏ స్థాయిలో పీకుతారో అర్థంకాకుండా వుంది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా కేటీఆర్ నోటివెంట సేమ్ అదే పీకుడు భాష. ‘రేవంత్ రెడ్డి ఏమీ పీకలేడు’ ఇది ఇప్పుడు ఆయన పీకలోంచి వస్తున్న మాటతీరు.

నిన్నగాక మొన్న తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు జరిగాయి. పంతులుగారు వచ్చి, పూజలు చేసి కొన్ని మంచి మాటలు చెప్పారు. పంతులు గారికి కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నట్టుంది అందుకే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడారు. సదరు పంతులు గారు కేటీఆర్ పక్కనే కూర్చుని, ‘నోరు అదుపులో పెట్టుకోవడం వల్ల మేలు జరుగుతుంది’ అన్నారు. అది విన్న కేటీఆర్, పంతులుగారు తనను ఉద్దేశించే ఆ మాట అన్నారని అర్థం చేసుకుని, చిరునవ్వులు చిందించారు. సిగ్గుపడాల్సిన చోట చిరునవ్వులు చిందించడం ఏంటో మరి.కేటీఆర్ కావచ్చు.. కేసీఆర్ కావచ్చు.. ఇతర బీఆర్ఎస్ బాబులు కావచ్చు.. ఎంత గొంతు చించుకున్నా, ఎంత అసహ్యంగా మాట్లాడినా మరో ఐదేళ్ళ వరకు అధికారం గురించి ఆలోచించే  అవకాశం లేకపోగా, జనం దృష్టిలో మరింత చులకన అయిపోయే ప్రమాదం వుంది. కేసీఆర్ కుటుంబంతోపాటు బీఆర్ఎస్ నేతలు చేసిన అంతులేని అవినీతి కథలు రోజుకొకటి  బయటపడుతూ తెలంగాణ జనం నివ్వెరపోయేలా  చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ అధికారంలో  వున్నవారిని మరింత రెచ్చెగొట్టేలా తమ ‘పీకుడు’ భాషని మాట్లాడకుండా వుంటే మంచిది. లేదు నేను ఇలాగే మాట్లాడతాను అంటే, మీ ఇష్టం.