Read more!

స‌ర్పంచ్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపు!.. భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో క‌ల‌క‌లం..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఏకంగా మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ల‌పైనే ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పెద్దోళ్లే అలా చేస్తుంటే.. చిన్నోళ్లమైన తాము చేస్తే త‌ప్పేముంది? అనుకున్నారేమో అంతా. భూదందా కేసుల్లో అనేక మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తుంటాయి. వీరిలో జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి పేరు అంద‌రికంటే ముందుంటుంద‌ని అంటున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ అంత‌టి నేత సైతం భూక‌బ్జా ఆరోప‌ణ‌ల‌తోనే పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది. ఇక ఈట‌ల‌కు మంచి దోస్త్.. ఆ ప‌క్క నియోజ‌క‌వ‌ర్గానికే చెందిన గులాబీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ పేరు సైతం తాజాగా ఓ భూ ఆక్ర‌మ‌ణ కేసులో వినిపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఎమ్మెల్యే ర‌స‌మ‌యి వేధింపులు భ‌రించ‌లేక ఓ గ్రామ స‌ర్పంచ్ ఏకంగా టీఆర్ఎస్‌కు రాజీనామా చేయ‌డం.. వారిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ ఆడియో వైర‌ల్ కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. 

కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. శంకరపట్నం మండలం కరీంపేట సర్పంచి మల్లయ్య మధ్య జరిగిన ఆడియో టేపు వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుతో విసుగెత్తి స‌ర్పంచ్‌ మల్లయ్య టీఆర్‌ఎస్‌కి రాజీనామా కూడా చేశాడు. మానకొండూర్‌ నియోజకవర్గంలో తన భూమి విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్న తీరుతో మనస్తాపం చెందిన సర్పంచ్ మ‌ల్ల‌య్య‌ పార్టీకి రాజీనామా చేయ‌డం.. ఆ య‌వ్వారంలో ఎమ్మెల్యే, సర్పంచ్ మధ్య జరిగిన ఆడియో కాల్ వైరల్‌గా మారి పార్టీని షేక్ చేస్తోంది.

సర్పంచ్‌ మల్లయ్యకు చెందిన‌ 1.18 గుంటల భూమిని కొందరు ఆక్రమించుకుని ఇళ్లు కడుతుండ‌టంపై వివాదం న‌డుస్తోంది. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోక్యం చేసుకొని.. ఆక్ర‌మ‌ణదారుల‌కు అనుకూలంగా వ‌త్తాసు ప‌లుకుతూ.. త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌నేది స‌ర్పంచ్ ఆరోప‌ణ‌. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే బాలకిషన్ తనను కించపరిచేలా మాట్లాడారంటూ మల్లయ్య ఆడియో రికార్డును మీడియాకు విడుద‌ల చేశారు. ఎమ్మెల్యే తీరుతో మనస్తాపం చెంది తాను టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూదందా.. సొంతపార్టీలోనే చిచ్చు పెడుతోంది.