నేటితో ముగియనున్న వైస్ ఛాన్సలర్స్ పదవి కాలం!

తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. అయితే, పారిపాలనా సౌలభ్యం కోసం ఉన్న వారికే ఇంచార్జీలుగా బాధ్యతలు ఆప్పగిస్తారా ? లేదా ఐఎఎస్‌లను ఇంచార్జీలుగా నియమిస్తారా ? అనే విషయం ఆసక్తికరంగా మారింది.  వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కొత్త వీసీల నియామకానికై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే , ఒక్క కాకతీయ విశ్వవిద్యాలయం తప్ప మిగతా 9 విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకాల కోసం సెర్చ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. 

కొత్త వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచే కసరత్తు చేపట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.  బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 208 దరఖాస్తులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మా గాంధీకి 157, కాకతీయకు 149, తెలంగాణ వర్సిటీకి 135, జేఎన్‌టీయూహెచ్‌కు 106, తెలుగు విశ్వవిద్యాలయానికి 66, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయానికి 51 దరఖాస్తులు వచ్చాయి. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్జీయూ హెచ్‌ విశ్వవిద్యాలయాల వీసీలుగా పని చేసేందుకు ఎక్కువ మంది అసక్తి చూపుతున్నారు. వీసీల నియామకానికి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ మేరకు సిట్టింగ్‌ వీసీలతో పాటు కొత్త వారు కూడా మొత్తం 312 మంది ప్రొఫెసర్లు తమ దరఖాస్తులను ప్రభుత్వానికి సమర్పించారు. అంతేగాక, తమ పేర్లను సిఫార్సు చేయాలని అభ్యర్థిస్తూ మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలపై ఒత్తిడి తెస్తున్నారు.  తమ జిల్లాల పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాల పరిధిలో తమ వారినే నియమించుకోవాలనే ఆసక్తితో పలువురు కాంగ్రెస్‌ ముఖ్యులు, మంత్రులు సీఎం దృషికి తెచ్చారు. కొత్త వీసీల నియామకం కోసం ప్రభుత్వం నియమించిన సెర్చ్‌ కమిటీలు కసరత్తు మొదలుబెట్టాయి.

దరఖాస్తుల స్వీకరణ అనంతరం అభ్యర్థుల గురించి ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది. మార్చిలో కోడ్‌ అమల్లోకి రావడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. వీసీల పదవీకాలం మే 21తో ముగుస్తున్నందువల్ల.. కొత్త వారి నియామకాలకు అనుమతించాలని కోరుతూ ఈనెల ఆరంభంలో ఈసీకి ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా అనుమతి ఇచ్చింది.

వీసీ పదవికి 70 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉంటుందని, ఇప్పటికే ఈ పదవిని రెండు దఫాలు నిర్వహించినవారు మూడోసారి ఎంపికకు అనర్హులవుతారు.  వీసీలుగా నియమితులు కావాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి. వీసీలను మూడేళ్ల కాలపరిమితికి నియమిస్తారు. ఈ వారంలోనే సెర్చ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి, వీసీల ఎంపికకు సిఫారసులు అందించనున్నాయి. 

గత ప్రభుత్వం సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇచ్చిందనీ, తమ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయం నేపథ్యంగా నియామకాలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించినందున ఆ దిశలోనే కొత్త వీసీల నియామకం కోసం చర్యలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.  ఈ నెలాఖరులోగా కొత్త వీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి.. నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

- ఎం.కె. ఫ‌జ‌ల్‌

Teluguone gnews banner