అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం... భాషను కాపాడుకోవాలిప్పుడు..
posted on Feb 21, 2023 @ 9:30AM
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం…అనగానే...
తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం..
తెలుగు వీర లేవరా..
దీక్షబూని సాగరా…
దేశమాత స్వేచ్చకోరి తిరుగుబాటు చేయరా..
నా పాట తేట తెలుగు పాట
నా పాట తేనెలొలుకు పాట
పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట…
అబ్బా . ఎన్నెన్ని మంచి పాటలు కదా… మాతృభాషా దినోత్సవమంటే సభలూ సమావేశాలు పెట్టేసి.. పాటలు, ఉపన్యాసాలు దంచి కొట్టేసి.. హమ్మయ్య మనం తెలుగు భాష కోసం పాటుపడుతున్నాం అనుకుని సభల్లో బాగా మెక్కి ఇంటికెళ్లిపోవడం. ఆ తరువాత ఎక్కడ చూసినా ఇంగ్లీషులో మాట్లాడుతూ, ఇంగ్లీషులో మునిగి తేలుతూ.. తమ పిల్లలను అచ్చంగా ఇంగ్లీషు భాషలోనే పెంచుతూ తెలుగుకు మంగళం పాడేస్తుంటారు. ఇదేనా తెలుగు భాషకు పాటు పడటం.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఒక దేశానికి ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించినది కాదు. ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించినది. అసలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసా..
1947 లో భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ భౌగోళికంగా రెండు భాగాలుగా ఏర్పడింది. వాటిలో ఒకటి తూర్పు పాకిస్తాన్ కాగా రెండవది పశ్చిమ పాకిస్తాన్. తూర్పు పాకిస్తాన్ ను ప్రస్తుతం బంగ్లాదేశ్ అంటున్నాం. రెండవ భాగం పాకిస్తాన్ గా ఉంది. అయితే అప్పటికి రెండు భాగాలలో భాష, సంస్కృతి వేరువేరుగా ఉండేది. భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం తమ జాతీయ భాషగా ఉర్ధూను ప్రకటించింది. ఇది బంగ్లా ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. తూర్పు పాకిస్తాన్ లో ఎక్కువ శాతం ప్రజలు బంగ్లా మాట్లాడతారు. అందుకే వారికి పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం నచ్చలేదు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయభాషగా ఉండాలని డిమాండ్ చేశారు.
తూర్పు బంగ్లా ప్రజలు అదే విషయాన్ని పాకిస్తాన్ రాజ్యాంగ సభలో లేవనెత్తారు. నిరసన చేపట్టారు. దీన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం 144 సెక్షన్, ఇంకా అనేక నిబంధనలు విధించింది. దానికి వ్యతిరేకంగా డాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. 1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. దీనికి నిరసనగా పాకిస్తాన్ లీగ్ అదే రోజు పార్లమెంటర్ పార్టీకి రాజీనామా చేశారు. 1956 లో పాకిస్తాన్ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆర్టికల్ 214 లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్ రాష్ట్ర భాషలుగా పేర్కొంది. 1971 లో బంగ్లాదేశ్ స్వతంత్రమైనప్పుడు, బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడింది. యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21, న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది.
ఇలా ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద భాషలు అన్నిటినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది.
దీన్ని బట్టి చూస్తే.. మనకు అవసరం కోసం, పై చదువుల కోసం ఎన్ని భాషలు అవసరమైన అవన్నీ అక్కరకు మాత్రమే.. మాతృభాష అనేది తప్పక ప్రతిఒక్కరి జీవితంలో ఉండాలి. మాతృ అనే పదంలోనే అది అమ్మ భాష అనే అర్థం ఉంది. మాతృ భాషను వదులుకుంటే అమ్మను కాలదాన్నినట్టే.. కాబట్టి పరభాషను గౌరవించాలి, ఆదరించాలి, మన భాషను ప్రేమించాలి, పోషించాలి, ఎప్పటికీ నిలుపుకోవాలి.. అంతేకానీ ఒకరోజు ముచ్చటగా ముగించకూడదు.
ఏ దేశమేగినా..ఎందుకాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. ఇందులోనే ఈ జాతిలోనూ.. ఈ భూమిలోనూ మన తెలుగు భాష ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలి.
◆నిశ్శబ్ద.