Read more!

మళ్ళీ మోగుతున్న వార్నింగ్ బెల్స్... అలర్ట్ అయిన కేంద్రం

కరోనా వైరస్ వ్యాప్తి మొదలవడంతో గతేడాది మార్చి 24 న దేశ వ్యాప్తంగా కేంద్రం మొట్టమొదటిసారి లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసి ప్రజల ప్రాణాలను కాపాడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన సంవత్సరంలో అనేక చర్యలు తీసుకున్నాయి. మరోపక్క ఈ ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇవ్వడంతో ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు తరువాత 60 ఏళ్ల పైబడిన వృద్దులకు కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ ఇస్తున్నారు.


ఇది ఇలా ఉండగా కొంత కాలం క్రితం వరకు తగ్గినట్లుగా కనిపించిన వైరస్ వ్యాప్తి మళ్ళీ ఉధృతమవుతోంది. మరీ ముఖ్యంగా ఐదారు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రెండు వారాల క్రితం వరకు 10 వేలలోపే ఉన్న రోజువారీ కేసులు.. ఉన్నట్టుండి 26 వేలకు చేరడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మళ్ళీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసే పనిలో పడింది   దీంతో ప్రధాని మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించారు. దీనికోసం  బుధవారం నాడు వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రంతో నిమిత్తం లేకుండా తగిన చర్యలను తీసుకుంటున్నాయి. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్, రాత్రి వేళ కర్ఫ్యూను విధిస్తూ కరోనాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో పాటు ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చన్న విషయంపై ఈ సమావేశంలో చర్చలు జరపనున్నారు. కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఏమేం చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. కరోనా విజృంభిస్తున్న రాష్ట్రాలు తాము తీసుకుంటున్న చర్యలను గురించి ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది.