కోతి.. కోతీశ్వరుడు

 

కోతీశ్వరుడు.. ఇది అచ్చుతప్పు కాదు.. కోతిగనుక కోటీశ్వరుడు అయితే ఇలా పిలవటం బెటరేమో అనేది కవి హృదయం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో ఓ కోతి.. సారీ.. ఓ కోతిగారు (డబ్బున్నవాళ్ళని గౌరవిస్తే మంచిది కదా) కోట్లకు అధిపతి కాబోతోంది. యూపీలో సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలీలో సబిష్ట అనే మహిళా న్యాయవాది వున్నారు. ఆమె భర్త శ్రీవాస్తవ. ఆమె న్యాయవాదిగా రెండు చేతులతో సంపాదిస్తుంటే, ఆమె భర్త వ్యాపారాలు చేస్తూ నాలుగు చేతులతో సంపాదిస్తున్నాడు. వీళ్ళకి కోట్ల ఆస్తి వుందిగానీ, వాటిని అనుభవించే వారసులు మాత్రం లేరు. అందుకే వీళ్ళు పదేళ్ళ క్రితం నుంచి ఒక కోతి పిల్లను పెంచుకోవడం మొదలుపెట్టారు. దానికి ‘చున్‌మున్’ అని పేరు పెట్టారు. దాన్ని అల్లారుముద్దుగా పెంచుతున్నారు. దాని వైభవం చూడాలంటే రెండు కళ్ళు చాలవు. కొంతకాలం తర్వాత తాము చనిపోతే, ఆ కోతిని ఎవరు చూసుకుంటారని వాళ్ళకి సందేహం వచ్చింది. అందుకే తమకున్న ఆస్తి మొత్తాన్నీ ఆ కోతి పేరిట రాసేయాలని డిసైడ్ అయ్యారు. తాము ఉన్నంతవరకూ తామే చున్‌మున్‌ని చక్కగా చూసుకుంటామని, ఒకవేళ తమకు ఏదైనా అయితే ఆస్తి మొత్తం తనకే దక్కేట్టుగా ఏర్పాట్లు చేశామని వాళ్ళు చెబుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు కూడా తమ చున్‌మున్ ‘కోతీశ్వరుడే’నని అంటున్నారు.

Teluguone gnews banner