కృష్ణారెడ్డి ఐపీఎస్.. కృషి ఉంటే యువకులు ఐపీఎస్ లు అవుతారు!
posted on Apr 30, 2025 6:28AM
ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితం ప్రారంభించి.. ఐపీఎస్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అందరికీ సాధ్యమయ్యే విషయం అసలే కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఉదయ కృష్ణారెడ్డి. అందుకే, స్వయం కృషికి సజీవ రూపంగా నిలిచే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయ కృష్ణారెడ్డిని అభినందించారు. కన్న కలలను సాకారం చేసుకున్న కృష్ణా రెడ్డి.. కలలు కనండి , కన్న కలలను సాకారం చేసుకోండి, అన్న మరో మహనీయుడు, ప్రాతః స్మరనీయుడు, మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్ కలాంను కూడా గుర్తుకు తెచ్చారు. ఆ విధంగానూ కృష్ణా రెడ్డి అభినందనీయుడు.
అవును. చంద్రబాబు నాయుడు తమ అభినందన సందేంలో అన్నట్లుగా ఒక సాధారణ కానిస్టేబుల్ గా జీవితాని ప్రారంభించి ఐపీఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన కృష్ణా రెడ్డి జీవితం యువతకు ఒక ఆదర్శం. నిరంతర పరిశ్రమతో, కృషి, పట్టుదలను తోడు చేసుకుని ధైర్యంగా ముందుకు సాగితే ఎలాంటి కలైనా సాకారం అవుతుందని.. ఎంతటి అవరోధాలనైనా అతిక్రమించ వచ్చునన్న సత్యాన్ని కృష్ణా రెడ్డి మరోమారు నిరూపించారు. అవును.. ముఖ్యమంత్రి అనంట్లుగా ఓటమిని అంగీకరించని వారిదే భవిష్యత్ అని మరో నిరూపించిన, కృష్ణా రెడ్డి ఐపీఎస్ నిజంగా అభినందనీయుడు. ఎవరీ కృష్ణా రెడ్డి, ఏమా కథ? అంటే..
ప్రకాశం జిల్లాలోని ఉల్లపాలెం గ్రామానికి చెందిన ఎం. ఉదయ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 350 ర్యాంకు సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లో స్థానం సంపాదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అభినందనలు అందుకున్నారు. కలలు కనండి ...కన్న కలలను సాకారం చేసుకోండి అన్న మాజీ రాష్ట్రపతి ఎపీజే అబ్దుల్ కలాం సందేశానికి సజీవ రూపంగా నిలిచిన ఉదయ కృష్ణారెడ్డి 2013లో,ఏపీ పోలీస్ డిపార్టుమెంటులో కానిస్టేబుల్‌గా చేరారు. గుడ్లూరు, రామాయపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. అదే సమయంలో, ఉన్నతాధికారి నుంచి ఎదురైన అవమానాలు అతనిలో ఐపీఎస్ కావాలనే ఆకాంక్షను రగిల్చాయి. ఆ అధికారి చేసిన అవమానమే అతనిలో అశయాన్ని రగిల్చింది.
పేదరికంలో పుట్టి.. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఉదయకృష్ణారెడ్డిని అతని అమ్మమ్మ రమణమ్మ పెంచింది. కూరగాయలు అమ్ముకుని పొట్ట పోసుకునే రమణమ్మ, మనవడిని పెంచి పెద్ద చేసింది. అలాగే, అతని మామ కోటి రెడ్డి చేయూత నిచ్చారు. చేయి పట్టి నడిపించారు. అటు అమ్మమ్మ రమణమ్మ,ఇటు మేన మామ కోటి రెడ్డి ఇచ్చిన చేయూతతో, కృష్ణారెడ్డి 2013లో ఏపీ పోలీస్ డిపార్టుమెంటులో కానిస్టేబుల్‌గా చేరారు. అయితే ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఉన్నతాధికారి చేసిన అవమానాలకు సమాధానంగా ఐఏఎస్ కావాలని సంకల్పం చెప్పుకున్న, కృష్ణారెడ్డి, 2018 లో సివిల్ సర్వీసెస్ పూర్తి సమయం కోసం కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మూడు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, పట్టు వదలని విక్రమార్కునిలా మరో ప్రయత్నం చేశారు. ఈసారి 780 వ ర్యాంక్ వచ్చింది. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ లో ఉద్యోగం వచ్చింది. అయినా, ఐపీస్ కావాలనే, ఆశయాన్ని చంపుకోలేదు. కల అంటే నిద్రలో వచ్చేది కాదు... నిద్ర పోనివ్వకుండా చేసేది కల అన్న కలాం స్పూర్తితో రైల్వే సర్వీస్ శిక్షణ సమయంలో మరోమారు సివిల్స్ రాశారు. 350వ ర్యాంక్ సాధించారు. ఐపీఎస్ కల సాకారం చేసుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
ఇప్పుడు ఉదయ కృష్ణా రెడ్డి. ఐపీఎస్.. భారతీయ యువత లో అపారమైన సామర్ధ్యం ఉందని, ఆత్మ స్థైర్యంతో ఓటమిని అంగీకరించకుండా ముందుకు సాగితే విజయం తధ్యమని విశ్వాసం వ్యక్త పరిస్తున్నారు. అమ్మమమ రమణమ్మ, మామయ్య కోటి రెడ్డి తన జీవితాన్ని తీర్చి దిద్దారని అన్నారు.అలాగే, తన ప్రయాణంలో సహకరించిన మెంటర్స్,కు కృతజ్ఞతలు తెలిపారు. అన్నివిధాల తండ్రిలా ఆడుకున్నఅదనపు డీజీ మహేష్ భగవత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.