Read more!

OTSపై వృద్ధురాలు ఆగ్ర‌హం.. జ‌గ‌న‌న్న‌కు శాప‌నార్థాలు..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం పేదల రక్తం తాగేందుకు ఓటీఎస్ ప‌థ‌కం తీసుకొచ్చింద‌నే విమ‌ర్శ ఉంది. మీ ఇల్లు మీకే సొంతం కావాలంటే.. డబ్బుకట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో బ‌ల‌వంతం ఏమీ లేదంటూ ఓవైపు చెబుతూనే.. అధికారులకు టార్గెట్లు పెట్టి మ‌రీ, పేద‌ల ముక్కుపిండి మ‌రీ.. ఓటీఎస్ క‌ట్టించుకుంటున్నారు. అయితే, ఓటీఎస్‌పై ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ తిరుగబ‌డుతున్నారు. క‌ట్టేదేలే.. పోపో.. అంటూ జ‌గ‌న్ స‌ర్కారును, ఉద్యోగుల‌ను చీద‌రించుకుంటున్నారు. 

అడుక్కునే వాళ్ల ద‌గ్గ‌రా అడుక్కుంటున్నారంటూ ఓటీఎస్‌పై పేద‌లంతా మండిప‌డుతున్నారు. జ‌గ‌న్ స‌ర్కారుకు శాప‌నార్థాలు పెడుతున్నారు. ఓటీఎస్‌ కట్టాలని ఒత్తిడి తెచ్చిన సిబ్బందిపై ఓ వృద్ధ మహిళ ఆగ్రహం వ్య‌క్తం చేసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. 
   
‘రోజంతా కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకునేవాడికి డబ్బు విలువ తెలుస్తుంది. ఒకేసారి రూ.10వేలు చెల్లించమని ఒత్తిడి తెస్తే పేదలు ఎలా కట్టగలరు? అడుక్కునేవాళ్ల ద‌గ్గ‌రా అడుక్కుంటున్నారు..’ అంటూ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడకు చెందిన వృద్ధురాలు మన్య సూర్యకాంతం సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

ఓటీఎస్‌లో భాగంగా రూ.10 వేలు కట్టించుకునేందుకు పంచాయతీ కార్యదర్శి శివ, వీఆర్వో నాగేశ్వరరావు, వాలంటీర్లు సూర్య‌కాంతం ఇంటికి వెళ్లారు. డబ్బులు క‌ట్టాల‌ని అడ‌గ్గా.. ఆ అవ్వకు ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. ఇక చూడండి.. జ‌గ‌న్ గురించి.. జ‌గ‌న‌న్న ప‌థ‌కాల గురించి.. ఓటీఎస్ గురించి.. తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టింది.

‘అమ్మఒడి, బాబుఒడి, అక్కఒడి అంటూ ప్రభుత్వం పేదల నోటికాడ కూడు తీసి వాళ్లకు డబ్బు ఇస్తోంద’ని మండిపడ్డారు. ‘15 ఏళ్ల కిందట కట్టుకున్న ఇంటికి ఇప్పుడు రూ.10 వేలు కట్టాలా? ఇలా డబ్బు ఇవ్వాలని అప్పుడు ఎవరూ చెప్పలేదు. ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతుంటే ఒకటికి పదిసార్లు తలుపు బాదేసి వీధిలోకి లాగడం మంచిది కాదు’ అని ఆమె మండిప‌డ్డారు. 

ప్రభుత్వం రుణమిచ్చిందని, తిరిగి చెల్లించాలని, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అని సిబ్బంది భ‌య‌పెట్ట‌బోయారు. ‘మీతోటే కాదు.. ఎవరితోనైనా ఇలాగే మాట్లాడతా’ అంటూ ఘాటుగానే ఆన్స‌ర్ ఇచ్చింది ఆ వృద్ధురాలు. ఇప్పటివరకు పది మంది డబ్బు కట్టారని, ఎప్పుడు కడతావో చెప్పమ‌ని సిబ్బంది ప్రశ్నించగా.. ఆఖరున రండి.. అప్పుడు చూస్తానంటూ ఆవిడ బదులిచ్చారు.   

ఈ ఘ‌ట‌న చిన్న ఎగ్జాంపుల్ మాత్ర‌మే. ఇలాంటి సీన్లు ఏపీవ్యాప్తంగా అనేకం జ‌రుగుతున్నాయి. ఓటీఎస్ కోసం ఇంటికొచ్చిన సిబ్బందిని.. ప్ర‌జ‌లు, పేద‌లు నిల‌దీస్తున్నారు. మా తాత‌ల నాటి ఇంటికి ఇప్పుడు డ‌బ్బులు క‌ట్ట‌మ‌ని అన‌డ‌మేంట‌ని నిల‌దీస్తున్నారు. జ‌గ‌న‌న్న కొత్త పాల‌సీపై ఫైర్ అవుతున్నారు. అయినా, ఉద్యోగులు మాత్రం వ‌ద‌ల‌డం లేదు.

‘మీరు ఎలా కడతారో తెలియదు. మాకు 3 రోజుల్లోగా డబ్బులు కట్టించుకునేలా లక్ష్యాలిచ్చారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా వస్తాం. కచ్చితంగా డబ్బు కట్టాల్సిందే’నని ఉద్యోగులు హుకుం జారీ చేస్తున్నారు. మీరు డబ్బులు కట్టకపోతే మాకు షోకాజ్‌లు, మెమోలు ఇస్తున్నారని వారు చెబుతున్నారు. 

వృద్ధురాలు ఆగ్ర‌హం వీడియో-- https://youtu.be/tEdIXTZDEh8