బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం
posted on Feb 22, 2015 @ 9:22PM
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ త్రిపాఠీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నితీష్ కుమార్‌తోపాటు 22 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 20 మంది గతంలో మాంఝీ మంత్రివర్గంలో పనిచేసినవారే. ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో పెళ్ళి బాజా మోగుతున్నందున ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. కాగా, కొత్తగా మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినందుకు అలిగే గతంలో నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి మాంఝీని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన విషయం తెలిసిందే.