Read more!

ఏపీలో అధికారం కూటమిదే.. తేల్చేసిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోయేది ఎవరో బీజేపీ తేల్చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడు అయిన సునీల్ బన్సల్ పేర్కొన్నారు. బీజేపీకి అందిన నివేదిక ప్రకారం ఏపీలో తెలుగుదేశం కూటమి 145 అసెంబ్లీ, 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు. కూటమి ప్రభంజనం ముందు వైసీపీ ఫ్యాన్ కొట్టుకు పోతుందని5 పేర్కొన్నారు. 

సునీల్ బన్సల్ చెప్పిన సంఖ్యలు ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వెలువడిన సర్వేలను మించి ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎపీ ఎన్నికలపై దాదాపు 11 సర్వేలు వెలువడ్డాయి. దాదాపు అన్ని సర్వేలూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతున్నదనే చెప్పాయి. ఇప్పుడు తాజాగా సునీల్ బన్సల్ కూడా అదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వైసీపీ కానీ, ఆ పార్టీ అధినేత జగన్ కానీ బీజేపీపై చిన్న పాటి విమర్శకూడా చేయడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ చేసిన ప్రకటనను ఎత్తి చూపుతూ రాష్ట్రంలో చంద్రబాబు ముస్లింలను దగా చేయడానికి రెడీ అయిపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

పొత్తులో భాగంగా ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం 144, బీజేపీ 10. జనసేన 21 స్థానాలలో పోటీ చేస్తున్నాయి. వీటిలో 145 స్దానాలలో కూటమి అభ్యర్థులే జయకేతనం ఎగురవేస్తున్నట్లుగా తమకు నివేదిక అందిందని సునీల్ బన్సల్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. అంటే మిగిలిన 30 స్ఖానాలనూ వైసీపీ కాంగ్రెస్ లు పంచుకుంటాయని భావించాల్సి ఉంటుంది.

అంటే ఎలా చూసుకున్నా వైనాట్ 175 అన్న ధీమా వ్యక్తం చేసిన జగన్ పార్టీకి 30 కంటే తక్కువ స్థానాలే వస్తాయని సునీల్ బన్సల్ చెబుతున్నారు. ఇక  లోక్ సభ స్థానాలైతే మరీ కనాకష్టంగా రెండు కంటే తక్కువ వస్తాయని బీజేపీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. సునీల్ బన్సల్ ప్రకటనపై వైసీపీ స్పందన ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.