బాబు బాటలో కేసీఆర్?!
posted on May 5, 2025 @ 2:26PM
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు తెలుగు దేశం అధినేత ,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటలో అడుగులు వేస్తున్నారా? లేదా వేయాలని అనుకుంటున్నారా? ఆయన బాటలోనే సాగుతున్నారా లేదా సాగాలని అనుకుంటున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఆ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల ఘనంగా నిర్వహించిన రజతోత్సవం సంబురాల నేపధ్యంలో పార్టీలో, కుటుంబలో తలెత్తిన అంతర్గత సమస్యల పరిష్కారానికి కేసీఆర్ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజమే. రజతోత్సవం సంబురాలు ఘనంగా జరిగాయి. అందులో సందేహం లేదు. అయితే.. గతంలో ఇక్కడే అనుకున్నట్లుగా.. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అన్నట్లు ఆ కథ ముగిసింది.
జనసమీకరణ ఘనంగా జరిగినా.. గులాబీ బాస్ స్పీచ్ అంతగా రక్తికట్టలేదు. ఉత్సాహంగా వచ్చిన పార్టీ క్యాడర్ నిరుత్సాహంగా తిరిగి వెళ్ళవలసి వచ్చిందని పార్టీ నాయకులే పెదవి విరిచారు. వందల కోట్లు ఖర్చు పెట్టి సంబురాలు చేసుకున్నా చివరకు హళ్లికి హళ్లి సున్నకు సున్నా అన్నట్లుగా ఫలితం శూన్యం అనే ఆవేదన పార్టీలో వ్యక్తమవుతోంది. మరో వంక పార్టీ పునర్వ్యవస్థీకరణ అవసరాన్ని నాయకత్వం గుర్తించిందనీ, ముఖ్యంగా అంతర్గత కలహాలకు అంతకంటే ముఖ్యంగా కుటుంబంలో రగులుతున్న ట్రైయాంగిల్ వార్ కు పార్టీ పునర్వ్యవస్థీకరణ పరిష్కారం చూపుతుందని కేసేఆర్ భావిస్తున్నట్లు చెపుతున్నారు. నేపధ్యంలోనే కేసీఆర్ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారని అంటున్నారు.
ఇక్కడే కేసీఆర్ తెలుగు దేశం అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా బీఆర్ఎస్ కు జాతీయ కార్యవర్గం ఇప్పటికీ ఏర్పడ లేదు. ఆఫ్కోర్స్ పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గం కూడా లేకుండానే, గులాబీ పార్టీ పాతికేళ్ళ ప్రస్థానం సాగించింది. అది వేరే విషయం.
అయితే ఇప్పుడు కేసీఆర్ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పూర్తి స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షులు, జాతీయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఇతర కీలక పదవులతో పార్టీ సంస్థాగత స్వరూపాన్ని పూర్తిగా మార్చే ఆలోచన కేసేఆర్ చేస్తున్నారని అంటున్నారు. అదే జరిగితే, తెలుగు దేశం పార్టీ చంద్రబాబును ఎలా జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకుందో అలాగే.. బీఆర్ఎస్ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటుందని పార్టీ వర్గాల సమాచారం.
అలాగే.. రాష్ట్రంలో ప్రస్తుతం కుల గణన పునాదిగా బీసీ రాజకీయం నడుస్తున్న నేపధ్యంలో బీసీలలో పట్టున్న బలమైన బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించే ఆలోచనలో కేసేఆర్ ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలను బీసీకి అప్పగించింది, బీజేపీ కూడా బీసీకే పట్టం కట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. బీసీకి రాష్ట పార్టీ పగ్గాలు అప్పగించడం, ఉభయతారకంగా ఉంటుదని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బీసీలలో పట్టు సాధించేందుకు చంద్రబాబు నాయుడు, ఇదే వ్యూహాన్ని అనుసరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అయితే.. రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే కుటుంబ త్రయం,(కేటీఆర్, హరీష్ రావు, కవిత) పరిస్థితి ఏమిటి? అనే విషయంలో కేసీఆర్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారని అంటున్నారు. రజతోత్సవ సభ వేదికపై అమర్చిన బ్యానర్ సహా స్వాగత తోరణాలు ఇతరత్రా ఏర్పాటు చసిన కటవుట్లు, బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్ తప్ప మరొకరికి చోటివ్వలేదు. ఇది పార్టీలో పెద్ద దుమారమే రేపినట్లు ప్రచారం జరుగుతోంది. సో.. కుటుంబ త్రయంను సంతృప్తి పరిచే విధంగా ఆ ముగ్గురికి పార్టీ పదవుల పంపకం ఎలా చేయాలన్న విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు.
అయితే.. కేటీఆర్ ను బీఆర్ఎస్ జాతీయ సెక్రటరీ జనరల్ గా నియమించే ఆలోచన ఉందని అంటున్నారు. అలాగే.. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అన్నకేటీఆర్ తో పోటీ పడుతున్న కవితను రాష్ట్ర పార్టీలో సెక్రటరీ జనరల్ గా నియమించి ఇద్దరి మధ్య బాలన్స్ చేసే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. ఇక హరీష్ రావు విషయానికి వస్తే.. పార్టీలో ఆయన భవిష్యత్ భూమిక ఏమిటి అనేది ఇంకా స్పష్టం కాలేదు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతను అప్పగించడమా లేక కోర్ కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించడమా అనే విషయంలో కేసీఆర్ ఇంకా నిర్ణయానికి రాలేదని అంటున్నారు. అలాగే, కేటీఆర్, హరేశ్, కవిత సహా కీలక నేతలు అందరికీ స్థానం కల్పిస్తూ.. పొలిట్ బ్యూరోను పునర్వ్యవస్థీకరించడంతో పాటుగా జిల్లా ఆధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల కార్యవర్గాలను పూర్తి స్థాయిలో పునరుద్దరించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
అయితే.. అన్నిటిని మించి కేసీఆర్ చంద్రబాబు బాటలో, చంద్రబాబు అడుగుఅడుగు జాడల్లో నడవాలనే నిర్ణయానికి వచ్చారని త్వరలోనే కేసీఆర్ సంస్థాగత మార్పులకు ఖాయంగా శ్రీకారం చుడతారని అంటున్నారు. అయితే ఫ్యామిలీ ట్రయో.. కుటుంబ త్రయం మధ్య సఖ్యత, సమన్వయం ఎలా సాధ్యం? ఎంత వరకు సాధ్యం? కే సీఆర్ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుంది? గులాబి పార్టీ భవిష్యత్ కు సంబంధించిన చాలా ప్రశ్నలకు ప్రస్తుతానికి అయితే సమాధానాలు లేవని అంటున్నారు.