Read more!

బీజేపీపై కేసీఆర్ పోరు.....కమలానికే మేలు

కల్వకుంట్ల చంద్రశేఖరరావు...బీజేపై పోరాటంలో తానే చాంపియన్ అని రుజువు చేసుకుని బీజేపీ యేతర కూటమికి సారథ్యం వహించాలని కలలు కంటున్నారు. అయితే కాంగ్రెసేతర బీజేపీ యేతర కూటమి పట్ల ఇరత పార్టీలేవీ అంత సుముఖంగా లేకపోవడంతో ఆయన బాటలో ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్నారు. 
ఎవరూ కలిసి రావడం లేదన్న నిర్వేదంతో ఒకో సారి ఆయన ఫ్రంటూ లేదు గింటూ లేదంటూ నిర్వేదం ప్రదర్శించినా...ఏ మూలో ఆయనకు మోడీని దీటుగా ఎదుర్కొనే నేత తానేనన్న విశ్వసం ఇంకా తొలగిపోలేదు.
అయితే మోడీని బలంగా ఢీ కొనాలన్న ఆత్రంతో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు అంతిమంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికే దోహదపడుతుండటం గమనర్హం. 
ఒక విధంగా చెప్పాలంటే...తెలంగాణలో సొంత బలం చాలా పరిమితంగా ఉండే బీజేపీ ఈ రోజున ఈ స్థితిలో ఉందంటే అది కచ్చితంగా కేసీఆర్ పుణ్యమే. 
బండి సంజయ్ ఒక రోజు దీక్ష భగ్నం నుంచి తీసుకుంటే...ఆయన రాష్ట్రంలో కమలం పార్టీని నిలువరిస్తున్నానన్న పేరుతో చేసిన ప్రయత్నం, చేపట్టిన ప్రతీ చర్యా ఆ పార్టీకి బలం చేకూరడానికే దోహదపడింది. 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రోజు దీక్ష భగ్నం కోసం పోలీసుల ప్రయోగం...ఆ పార్టీ పట్ల సానుభూతి పెరగడానికే దోహదపడింది. ఆయన అధికార కార్యాలయం గేట్లను గ్యాస్ కట్టర్ తో తొలగించి మరీ పోలీసులు లోనికి వెళ్లి అరెస్టు చేశారు. ఇది ఆశించిన దానికి ప్రతి కూల ఫలితమే ఇచ్చింది. అలాగే రైతులను పరామర్శించడానికి బండి సంజయ్ వెళ్లిన సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
ఒక వైపు రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ఏ నిరసన కార్యక్రమం సజావుగా సాగేందుకు వీలు లేకుండా అడ్డంకులు కల్పిస్తూ, అనుమతులు నిరాకరిస్తూ వస్తున్న ప్రభుత్వం..అదే అధికార పార్టీ కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా, ఇంకా చెప్పాలంటే యథేచ్ఛగా చేసుకోవడానికి దార్లు బార్లా తెరిచిన పరిస్థితి.
ఈ పరిస్థితే రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళనలు చేసుకునే హక్కు, నిరసనలు తెలిపే హక్కు విపక్షాలకు లేదా అన్న సందేహం జనంలో కలగేలా చేసింది.
అదే విధంగా ధాన్యం కొనుగోలు విషయాన్ని విపరీతమైన రాద్దాంతం చేసి రైతుల్లోనూ బిజెపికి విస్తృత ప్రచారం కలిగేందుకు కేసీఆర్ తీరు దోహదపడింది. అదే సమయంలో ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని బిజెపి సద్వినియోగం చేసుకుని.. తెలంగాణలో క్రమంగా బలపడుతోంది.  కేసీఆర్ బిజెపి అణచివేసేందుకు అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారంటే కమలం పార్టీ ప్రజలలో ప్రచారం చేసుకుంటోంది. ఆ అవకాశాన్ని స్వయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత తమ చర్యలతో పువ్వుల్లో పెట్టి కమలానికి అందించారు.  నిన్న మొన్నటి వరకూ బీజేపీ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించిన కేసీఆర్ ఒక్క సారిగా ఇంత వ్యతిరేకత ప్రదర్శించడం వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగి ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ప్రణాళికా బద్ధంగా బీజేపీ బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.