Read more!

కాంగ్రెస్- టీఆర్ఎస్ డిష్యుం డిష్యుం- కేసీఆర్- పీకే అలయ్ భలయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పీకే విషయంలో తన సహజ స్వభావానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనిపిస్తున్నది.  రాష్ట్రంలో తెరాసను మరోసారి అధికారంలోనికి తీసుకు రావడానికి కేసీఆర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు జరిపారు. ప్రశాంత్ కిషోర్ బృందం రాష్ట్రంలో చేసిన సర్వేలను బట్టే తను ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా కొంత ట్రావెల్ కూడా ఇరువురి మధ్యా జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పీకే, కేసీఆర్ రెండు మూడు సార్లు భేటీ అయ్యారన్న వార్తలు కూడా విశ్వసనీయంగా వినవచ్చాయి.
ఇంత దాకా బానే ఉంది...కానీ  పీకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు చేరువ అయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోనికి తీసుకురావడమే ధ్యేయంగా పని చేయడానికి ఉద్యుక్తుడయ్యారు. ఇక్కడ రాష్ట్రంలో తెరాస కు పని చేస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలహీనం చేయాలన్న కేసీఆర్ వ్యూహాలను అనుగుణంగా పని చేస్తారా? ఒక వేళ అలా చేసేందుకు ఆయన సిద్ధమైనా కేసీఆర్ అందుకు అంగీకరిస్తారనీ, పీకేతో కలసి ముందుకు నడుస్తారనీ ఆయన నైజం తెలిసిన వారెవరూ నమ్మరు. కానీ కేసీఆర్ తన సహజ సిద్ధ స్వభావానికి విరుద్ధంగా శనివారం పీకేతో భేటీ అయ్యారు. ఆయన బృందం సర్వేలపై కూలంకషంగా చర్చించారు. ఈ సారి ఫామ్ హౌస్ లో కాకుండా తన అధికార నివాసం ప్రగతి భవన్ లోనే పీకే- కేసీఆర్ భేటీ జరిగింది. రాష్ట్రంలో తెరాస మరింత బలోపేతం కావాలంటే ఏం చేయాలన్నదానిపై పీకే కేసీఆర్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సర్వే నివేదికలు సమర్పించారు. ఒక వైపు హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి పని చేస్తూ తెలంగాణ దగ్గరకు వచ్చే సరికి తెరాసతో కలిసి పని చేస్తానంటూ పీకే ముందుకు వచ్చినా కేసీఆర్ ఆయనను ఎలా దరి చేరనిస్తున్నారన్న విషయంలో తెరాస శ్రేణులనే ఆశ్చర్య పరుస్తున్నది.  కాంగ్రెస్ ను కేంద్రంలో అధికార పీఠంపై కూర్చో పెట్టడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా తిరిగి పని చేస్తానంటూ స్పష్టంగా ప్రకటించిన పీకే...తెలంగాణలో మాత్రం తెరాస కోసం పని చేస్తానంటే కేసీఆర్ ఎందుకు నమ్మారు. ఎందుకు అంగీకరించారు? అన్న ప్రశ్నలకు బదులు లభించక తెరాస శ్రేణులే తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోనికి తీసుకురావాలంటే రాష్ట్రాలలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి. ఆ వ్యూహంతో ముందుకు సాగేతున్న పీకే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన వ్యూహాన్ని ఎలా అమలు చేస్తారు? ఒక వేళ ఆయన చెబుతున్నా..ఒక రాజకీయ పార్టీ అధినేతగా. ప్రత్యర్థి పార్టీ తరఫున పని చేస్తున్న వ్యక్తిని ఎలా చేరతీస్తారు? పరిశీలకులు మాత్రం కేసీఆర్ పూర్తిగా పీకే మాయలో పడిపోయారని విశ్లేషిస్తున్నారు. ఎంత ముందుగా చేసుకున్న ఒప్పందమైనా....ఆ తరువాత కాంగ్రెస్ తో జట్టుకట్టిన తరువాతైనా పీకేను కేసీఆర్ దూరం పెట్టి ఉండాల్సింది. 
అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవలసినదేమిటంటే...తెలంగాణ రాష్ట్రంలో విజయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ బలీయమైన శక్తే. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి. అటువంటి రాష్ట్రంలో పీకే కాంగ్రెస్ ను బలహీనపరి చే వ్యూహాలు రచిస్తారంటే ఎవరైనా సరే నమ్మడానికి సందేహిస్తారు. అలాంటిది రాజకీయ దురంధరుడిగా పేరొందిన కేసీఆర్ మాత్రం పూర్తిగా నమ్మేసినట్లు కనిపిస్తున్నారు. 
అయితే బీజేపీని అధికారం నుంచి దూరంగా ఉంచే వ్యూహంలో భాగంగానే కేసీఆర్, పీకే జట్టు కట్టారన్న వాదన కూడా వినిపిస్తున్నది. ఏది ఏమైనా ప్రశాంత్ కిశోర్ అటు కాంగ్రెస్ కు, ఇటు తెరాసకు పని చేస్తారంటే తెలంగాణలో మాత్రం  కాంగ్రెస్, తెరాసలు రెండూ వ్యతిరేకిస్తున్నాయి. అయినా పార్టీల అధిష్టానాల ఆదేశాలను ధిక్కరించడం వీలు కాదు కనుక జరుగుతున్న రాజకీయ తంతును, లేదా తంత్రాన్ని మౌనంగా గమనిస్తున్నాయి.