Read more!

వెండి తెరపై ఝాన్సీరాణి.. రాజకీయ రణంలో విదూషకమణి!

కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా  ఆమె నటనకు ప్రతి సందర్భంలోనూ నూటికి నూరు మార్కులు పడ్డాయి. సినీ రంగం నుంచి ఆమె రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అయితే సినిమాలలో బ్రహ్మాండమైన గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ కు రాజకీయ రంగంలోనూ గుర్తింపు వచ్చింది. సినిమా రంగంలో ఆమె ఝాన్సీ లక్ష్మీబాయ్ లా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేస్తే రాజకీయ రంగంలో అందుకు భిన్నంగా ఒక విదూషక మణిగా జనం దృష్టిలో నవ్వుల పాలయ్యారు. అవగాహనా రాహిత్యం, తెలియని విషయాలపై కూడా సమగ్ర పరిజ్ణానం ఉన్నదన్నట్లు చేస్తున్న ప్రసంగాలూ ఆమెను ప్రజల దృష్టిలో నవ్వుల పాలు చేస్తున్నాయి.  ఏదో సినిమాలో లాయర్ తన వాగ్ధాటి నంతా ప్రయోగించి సొంత క్లయింట్ కు శిక్ష పడేలా చేసిన విధంగా కంగనా రనౌత్ తన ప్రసంగాలలో సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాలలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రసంగాలకు ఎలాగైతే అభిమానులు ఉన్నారో.. ఉత్తరాదిలో అలాగే కంగనా రనౌత్ ప్రసంగాలంటే చెవి కోసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభిమానులూ తయారయ్యారు. అయితే ఆమె ప్రసంగాలు విని ఆమె రాజకీయ పరిజ్ణానానికి ముగ్ధలై వారు ఆమెకు అభిమానులుగా మారలేదు. ఆమె అజ్ణానంతో చేస్తున్న తప్పుల తడకల ప్రసంగం విని పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుని ఆమె కు అభిమానులుగా మారిపోయారు. తెలుగు రాష్ట్రాలలో పాల్ ను కూడా జనం ఆయన వినోదం పంచే తీరుతోనే అభిమానులుగా మారిపోయారన్నమాట. సర్కస్ లో జోకర్ ను చూసి ఎంతలా నవ్వు వస్తుందో రాజకీయాలలో కంగనా రనౌత్ ప్రసంగాలు విన్న వారికి అంతకు మించి నవ్వు వస్తుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యకు మద్దతుగా ప్రచారం చేసిన ఆమె పొరపాటున బీజేపీ అభ్యర్థిపైనే విమర్శల వర్షం కురిపించేశారు. సొంత పార్టీ అభ్యర్థి పేరు తేజస్వి సూర్య అయితే.. ఆమె పొరపాటుగా ఆర్జేడీ నేత తేజస్వి ప్రసాద్ గా భావించి విమర్శల వర్షం కురిపించేశారు. స్వయంగా తాను నవ్వుల పాలు కావడమే కాకుండా సొంత పార్టీ బీజేపీనీ, ఆ పార్టీ అభ్యర్థి తేజస్వి సూర్యనూ నవ్వుల పాలు చేసేశారు. 

బీజేపీ కంగనా రనౌత్ ను పార్టీలో చేర్చుకుని పార్టీ టికెట్ ఇచ్చిన నాటి నుంచి ఆమె కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తప్పుల తడకలతో సాగే ఆమె ప్రసంగాలు జనాలను నవ్విస్తూనే ఉన్నాయి. ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేసే నియోజకవర్గం ఎన్నిక చివరి దశలో అంటే ఏడవ దశలో జూన్ 1న జరగనుంది.