Read more!

తప్పులు చేయడం.. చంద్రబాబుపై నెపం వేయడం.. జనం నమ్మేస్తారా జగన్?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎస్పీలపై బదిలీ వేటు వేసిన ఈసీ తాజాగా డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిపై కూడా   బదిలీ వేటు వేసింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై సైతం బదిలీ వేటు పడింది. వీరి స్థానంలో కొత్తవారికి ఈసీ బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమయంలో తమకు మేలు చేస్తారని భావించిన అధికారులు ఒక్కొక్కరిపై బదిలీ వేటు పడుతుండటంతో జగన్ తో పాటు ఆయన శిబిరంలో భయం మొదలైంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి విపక్షాలపై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదని తనలోని ఓటమి భయాన్ని జగన్ బయట పెట్టారు. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీకి కార్యకర్తల్లా పనిచేసే అధికారులతో విపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ మోహన్ రెడ్డికి ఈసీ నిర్ణయాలు మింగుడు పడటం లేదు. దీంతో తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ప్రజల ముందు ఏడుపు మోహం పెట్టి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలను జగన్ షురూ చేశారు.

ఎన్నికల నియమావళిలో భాగంగా ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ పథకాల అమలుపై ఈసీ ఆంక్షలు విధించడం సర్వసాధారణం. కోడ్ అమల్లోకి వచ్చేలోపే అధికార పార్టీలు ప్రభుత్వ పథకాల ఫలాలను లబ్ధిదారులకు చేరవేస్తుంటాయి. కానీ జగన్ మోహన్ ప్రభుత్వం కావాలనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఆన్ గోయింగ్ స్కీంలు అంటూ పలు పథకాల డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసేందుకు ప్రయత్నాలు చేసింది. వీటికి ఈసీ అడ్డుకట్ట వేసింది. ప్రభుత్వ పథకాల  నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు డబ్బు జమ చేయొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు నాయుడుపై ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తూ తమ బేల తనాన్ని బయటపెట్టుకుంటున్నారు. పథకాల డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయడం ఆపాలని ఈసీకి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. 

ఆన్ గోయింగ్ పథకాలకు బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో వెళ్లలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి బటన్ ఎప్పుడు నొక్కాడు.. ఎప్పుడు డబ్బులు వెళ్లలేదనేది ప్రజలకు మాత్రం వైసీపీ నేతలు చెప్పడం లేదు. దీనిలో ఓ మతలబు కూడా ఉంది. అదేమిటంటే ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం మార్చి 1వ తేదీన రూ.610 కోట్లకు వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మార్చి 16 వ తేదీన. మార్చి 1వ తేదీన బటన్ నొక్కితే ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు   లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. ఇక్కడ రెండు విధానాలుగా వైసీపీ డ్రామాలను అర్ధం చేసుకోవచ్చు. డబ్బులు లేకపోయినా వైసీపీ ప్రభుత్వం బటన్ నొక్కి లబ్ధిదారులను మోసం చేసింది. అలాకాకుంటే.. డబ్బులు ఉంటే ఉద్దేశపూర్వకంగా అవి లబ్ధిదారుల ఖాతాలలో వేయకుండా  పోలింగ్ కు వారం రోజులు ముందు ఆ  డబ్బులు వేసి  ఓటర్లను ప్రలోభ పెట్టి లబ్ధి పొందాలని చూసింది.  ఇవన్నీ ప్రజలకు తెలియకుండా వైసీపీ అధినేత జగన్, వైసీపీ నేతలు వాళ్లు చేసిన తప్పును చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము డబ్బులు వేశాం.. కావాలనే ఈసీకి ఫిర్యాదు చేసి మీకు రావాల్సిన డబ్బులు రాకుండా చంద్రబాబు ఆపించారని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారిపట్టించి ఓట్లు వేయించుకోవటం జగన్ మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. గత ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య ఘటనలతో ప్రజల్లో సానుభూతి పొంది, ఆ నెపాలను చంద్రబాబు, ఆయన అనుచరులపైకి నెట్టేసి జగన్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తరువాత జగన్ చెప్పినవన్నీ అబద్ధాలని ప్రజలకు స్పష్టత వచ్చింది. మళ్లీ తాను చేసిన తప్పులన్నీ చంద్రబాబుపైకి నెట్టేసి ప్రజల్లో చంద్రబాబును విలన్ గా చిత్రీకరించాలన్నది వైసీపీ కుట్రగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ అనుకూల అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాలకు కూడా విలువ నివ్వకుండా పింఛన్ల పంపిణీని క్లిష్టతరం చేశారు. తద్వారా పలువురు  వృద్ధులు ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యారు.

పెన్షన్లు పంపిణీ చేయడంలో అధికారులు వైఫల్యాన్ని సైతం  చంద్రబాబుపైకి నెట్టే ప్రయత్నం జగన్ చేశారు. తాజాగా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను గుర్తించి ఈసీ బదిలీ వేటు వేస్తుంటే వారి బదిలీ చంద్రబాబు కుట్రలో భాగమని జగన్ చెబుతుండటం గమనార్హం. తాజాగా ఇన్ ఫుట్ సబ్సిడీ, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల పంపిణీ నిలిపివేతలోనూ ఈసీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని జగన్ అండ్ వైసీపీ నేతలు, ఆ నెపాన్ని సైతం చంద్రబాబుపై నెట్టి ఎన్నికల్లో పబ్బంగడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పులు చేసేది జగన్.. ఆ నెపాన్ని చంద్రబాబుపైకి నెట్టడం జగన్ మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. అయితే, గత  ఎన్నికల్లో జగన్ కుట్రలను తెలుసుకోలేక మోసపోయిన ప్రజలు.. ఈసారి జగన్ కుట్రలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఓటు ద్వారా బుద్ది చెప్పేందుకు సిద్ధమయ్యారు.