నిర్భయ చట్ట రూపకర్త వర్మ మృతి
posted on Apr 23, 2013 8:55AM
నిర్భయ చట్ట రూపకర్త జస్టీస్ వర్మ సోమవారం రాత్రి 9.30 నిముషాలకు మృతి చెందినట్లు గుర్గావ్ లోని మేదాంత మెడిసిటీ వైద్యులు ధృవీకరించారు. శుక్రవారం ఆయన కడుపులో రక్తస్రావంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వర్మను హాస్పిటల్ కు తీసుకువచ్చారని, అప్పటికే ఆయన కాలేయం పూర్తిగా విఫలమైందని మేదాంత మెడిసిటీ వైద్యులు తెలిపారు. న్యూఢిల్లీ లోల నిర్భయపై జరిగిన లైంగిక దాడి తరువాత కేంద్ర ప్రభుత్వం జస్టీస్ వర్మ నేతృత్వంలో తిసభ్య కమిటీని నియమించింది. ఈ ప్యానెల్ అత్యాచార నిరోధానికి ప్రస్తుతం ఉన్న చట్టాలను పరిశీలించి, కొన్ని సిఫారసులతో కేవలం 29 రోజుల్లో నివేదిక సమర్పించింది. అందులోని కొన్ని సూచనల ఆధారంగా రూపొందించిన నిర్భయ చట్టాన్ని పార్లమెంటు ఇటీవల ఆమోదించింది. ఎన్డీటీవీ ఈ నెల 15న ఆయనకు ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో గౌరవించింది. జస్టీస్ వర్మ (80) జనవరి18వ తేదీ 1933 సంవత్సరంలో జన్మించారు. 1955 లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1973లో మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా, 1986 జూన్ లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టీస్ గా నియమితులయ్యారు.1989 సెప్టెంబర్ నుంచి 1989 మధ్య కాలంలో రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టీస్ గా నియమితులైన ఆయన 1997 మార్చి 25 నుంచి 1998 జనవరి 18 దాకా సుప్రీం కోర్టు 27వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించి రిటైరయ్యారు. జాతీయ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ గా కొంతకాలం సేవలు అందించారు. న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారటీ తొలి చైర్ పర్సన్ గా కూడా సేవలందించారు. జస్టీస్ వర్మ మృతిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.