Read more!

కేసీఆర్ ‘జాతీయ’ హడావుడికి ఎండ్ కార్డా?.. ఇంట్రవెల్లేనా?

ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కు పడిన చందంగా సాగుతోంది కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం. గత కొన్ని నెలలుగా ఇదిగో..అదిగో అంటూ కేసీఆర్ కూడా తన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పే అంశాన్ని నాన్నా పులి కథలా మార్చేశారు.

ఇప్పుడు  కేసీఆర్ స్వయంగా చెప్పినా కూడా ఎవరూ ఆయన జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తారని ఎవరూ నమ్మరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  అంతెందుకు దసరాకు బీఆర్ఎస్ ప్రకటన తథ్యం అంటూ ఆయనే స్వయంగా చెప్పినా పెద్దగా స్పందన రాలేదు. ఆ తరువాత మళ్లీ ఆయనే తానే పెట్టిన ముహూర్తాన్ని డిసెంబర్ తరువాతకు మార్చేశారు. ఏ ముహూర్తాన కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానన్న ప్రకటన చేశారో అప్పటి నుంచీ ఆయనకు ఏదీ కలిసి రావడం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.

జాతీయ కూటమి అంటూ ఆయన ఎవరెవరిని కలిశారో వారంతా కేసీఆర్ ను మినహాయించి వేరే వేరే పార్టీలతో టచ్ లోకి వెళుతున్నారు. కలిసి వస్తారని ఆయన ఆశించిన వారంతా మొండి చేయి చూపిస్తున్నారు. ఎలాంటి హడావుడీ లేకుండా మోడీషా ద్వయానికి దిమ్మతిరిగేలాంటి షాక్ ఇచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేసీఆర్ కు హ్యాండిచ్చి రాహుల్, సోనియాల పంచన చేరడానికే మొగ్గు చూపుతున్నారు. వారితో కలిసి పని చేసేందుకే తాను సిద్ధమని విస్పష్టంగా తేల్చేశారు. ఆయన కలిసిన వారంతా జట్టుగానే ఉన్నారు కానీ ఆ జట్టులో కేసీఆర్ కు మాత్రం చోటు ఉండటం లేదు. ఇక ప్రధాని మోడీపై కేసీఆర్ కంటే ఎక్కువగా లేదా కేసీఆర్ తో సమానంగా చీటికీ మాటికీ విమర్శలతో విరుచుకు పడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా మోడీకి సానుకూలంగా మాట్లాడటం మొదలు పెట్టారు.

జాతీయ రాజకీయాల ప్రస్తావన ఒకింత తగ్గించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వేదికగా  ప్రధాని మోదీ చాలా మంచి వారని.. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వెనుక ఆయన హస్తం లేదని ఎవరూ కోరకుండానే కితాబిచ్చేశారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన బీజేపీపై యుద్ధంలో కలిసి వచ్చే నాయకుడు కానీ, పార్టీ కానీ మచ్చుకు ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు. తరచుగా కేసీఆర్ ను కలుసి ప్రశంసల వర్షం కురిపిస్తున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వల్ల జాతీయ రాజకీయాలకు కానీ, కేసీఆర్ కు కానీ వీసమెత్తు ప్రయోజనం లేదు. ఎందుకంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ఉనికి కాపాడుకోవాలంటే ఆయన ఏదో ఒక జాతీయ పార్టీని ఆశ్రయించకతప్పని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీపై యుద్ధానికి కేసీఆర్‌తో కలిసి వచ్చే వారు దాదాపుగా లేరు.  ఇక మోడీ స్వరాష్ట్రం గుజరాత్ నుంచి వచ్చి ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సుదీర్ఘ భేటీ జరిపిన శంకర్ సింగ్ వఘేలా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. ఎందుకంటే వఘేలా జాతీయ రాజకీయాల సంగతి పక్కన పెడితే కనీసం గుజరాత్ లో కూడా ఆయన చూపే ప్రభావం ఏమీ లేదు.

కేసీఆర్ తో బేటీ వల్ల ఓ రోజు ఆయన పేరు పేపర్లో రావడం తప్ప కేసీఆర్ తో ఆయన భేటీ వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఒనగూరే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే  దసరాలోపే కొత్త పార్టీ అంటూ హడావుడి చేసిన కేసీఆర్ ఆ ముహూర్తం బాలేదని వాయిదా వేయడమే కాదు.. పూర్తిగా సైలెంట్ అయిపోయారు. జాతీయ రాజకీయాల గురించిన మాటే ఎత్తడం లేదు. హస్తిన వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నా.. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులే లక్ష్యంగా దర్యాప్తు సంస్థల దాడుల నేపథ్యంలో ఆయన హస్తిన ప్రయాణంపైనా అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి.  ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నిశ్శబ్దం పార్టీ వర్గాలలోనే చర్చకు తెరలేపింది. జాతీయ రాజకీయాల ప్రస్తావనను ప్రస్తుతానికి కేసీఆర్ పక్కన పెట్టేసినట్లేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ముందు మునుగోడు పరీక్ష గట్టెక్కితే ఆ తరువాత పరిస్థితిని బట్టి జాతీయ రాజకీయాలపై నిర్ణయం తీసుకోవచ్చన్నది కేసీఆర్ ఆలోచనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.