Read more!

ఆ నిర్ణయం తీసుకుంటే అతనే సీఎం? మరీ ఆ లీడర్ ఆ పని చేస్తారా? 

తెలంగాణ రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్ లీడర్. అధికార పార్టీ నేతల అవినీతి, కేసీఆర్ కుటుంబ కమీషన్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తున్న బాహుబలిగా అతన్ని తెలంగాణ జనాలు భావిస్తున్నారు. నియంతలా పాలిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు వెలుగులోనికి తెస్తున్న నేతగా చెప్పుకుంటున్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నా.. ఇతరత్రా పద్దతుల్లో బెదిరించాలని చూసినా ఏమాత్రం వెనకడుగు వేయని వీరుడిలా అతన్ని చూస్తున్నారు. తన పంచ్ డైలాగులతో కారు పార్టీని షేక్ చేస్తున్నారు ఆ డైనమిక్ లీడర్. కేసీఆర్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అతడే ఒక సైన్యంలా పోరాటం చేస్తున్నారు. 
 

తన పోరాటాలతో  టీఆర్ఎస్ ను ఢీకొట్టే  దమ్మున్న నేతగా ఎదిగిన ఆ నాయకుడు ఎవరో కాదు.. మల్కాజ్ గిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే విపక్ష నేతలు జంకుతున్న సమయంలో.. అన్నింటికి తెగించి ఆయన ఉద్యమించారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో మగధీరగా మారిపోయారు  రేవంత్ రెడ్డి. తెలంగాణ జనాల్లో ఇంతలా  క్రేజ్ సంపాదించిన ఫైర్ బ్రాండ్ రాజకీయ పయనంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. కేసీఆర్ సర్కార్ పై అలుపెరగని పోరాటం చేస్తున్న పీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి.. కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన సహకారం లభించడం లేదని తెలుస్తోంది. 

 

తెలుగుదేశం పార్టీ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన రేవంత్ రెడ్డి.. చంద్రబాబు నాయకత్వంలో తిరుగులేని నేతగా ఎదిగిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ ఉండదనే వాదనలు వచ్చినా... అది తప్పని నిరూపించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ తమ్ముళ్లలో  జోష్ నింపుతూ పార్టీని  బలంగానే ఉంచారు. అయితే 2017లో అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్, కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పోత్తు కుదరడం వేనక రేవండ్ రెడ్డీనే కీ రోల్ పోషించారు. ఎన్నికల ప్రచారంలోనూ తన మార్క్ పంచ్ డైలాగులతో కేడర్ లో జోష్ తెప్పించారు. హెలికాప్టర్ లో సుడిగాలిలా పర్యటించి పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి.

 

కాంగ్రెస్ కోసం ఎంతగా పోరాడుతున్నా ఆయనకు ఆ పార్టీలోనే వ్యతిరేకులు ఎక్కువయ్యారు. దీంతో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పయనం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది.  రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరగగానే.. వ్యతిరేక వర్గం తెరపైకి వస్తూ ఆయనకు పదవి రాకుండా అడ్డుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. వీహెచ్, జగ్గారెడ్డి లాంటి నేతలు బహిరంగగానే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకటన చేశారు. పీసీసీ రేసులో ఉన్న ఇతర నేతలు కూడా రేవంత్ ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలంతా రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలివ్వాలని కోరుతున్నా.. సీనియర్లు మాత్రం కొర్రీలు వేస్తూనే ఉన్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రైతు సభలో వీహెచ్ ప్రసంగాన్ని అడ్డుకుని రేవంత్ రెడ్డి సీఎం అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారంటే రేవంత్ రెడ్డి క్రేజీ ఎలా ఉందో  అర్ధం చేసుకోవచ్చు. 

 

తెలంగాణలో బీజేపీ సోషల్ మీడియా బలంగా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయానికి సోషల్ మీడియానే మఖ్య పాత్ర పోషించిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ కూడా సోషల్ మీడియాలో బలంగానే ఉంది. కాంగ్రెస్ మాత్రం వెనకబడిపోయింది. అయితే రేవంత్ రెడ్డి అభిమానులు మాత్రం రాష్ట్రంలో భారీగా ఉన్నారు. వారే దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ కోసం తీవ్రంగా శ్రమించారు. బీజేపీ, టీఆర్ఎస్ లకు ధీటుగా రేవంత్ సైన్యం ఆన్ లైన్ లో పోరాటం చేసింది. రేవంత్ రెడ్డి ప్రచారం, ఆయన సోషల్ మీడియా టీమ్ కృషి వల్లే కాంగ్రెస్ కు 22 వేల ఓట్లు వచ్చాయని, లేదంటే డిపాజిట్ గల్లంతై పార్టీ పరిస్థితి దారుణంగా ఉండేదని గాంధీభవన్ లో చర్చ జరుగుతోంది. ఇక్కడ మరో అంశం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ సైన్యం కష్టపడుతున్నా కొందరు కాంగ్రెస్ నేతలకు అదికూడా నచ్చడం లేదని తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి టీమ్ కు పోటీగా మరికొందరు నేతల అభిమాన సంఘాలతో సోషల్ మీడియాలో కొత్త దుకాణాలు ప్రారంభమయ్యాయి. 

 

కాంగ్రెస్ లో తన పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలతో రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఫ్రైర్ బ్రాండ్ లీడర్ ను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరినా ఆయన ప్రయోజనం ఉండదనే అభిప్రాయమే రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. సీఎం అభ్యర్థిగా ఉన్న రేవంత్ రెడ్డికి బీజేపీలో అలాంటి అవకాశం రావడం కష్టమే. ఎందుకుంటే ముఖ్యమంత్రి వంటి  పదవుల విషయంలో బీజేపీపై ఆరెస్సెస్ ప్రభావం ఉంటుంది. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి, సంఘ్ తో సంబంధాలున్న నేతలకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎంపికలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. కాబట్టి బీజేపీలో చేరితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల నెరవేరదని చెబుతున్నారు. 

 

కలిసిరాని నేతలతో కాంగ్రెస్ లో ఉండి కష్టాలు పడేకంటే... ముఖ్యమైన పదవి రావడం గగనమయ్యే బీజేపీ గురించి ఆలోచించేకంటే.. తన లక్ష్య సాధనకు రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన తెలుగుదేశం పార్టీనే రేవంత్ రెడ్డికి సరైన వేదికనే చర్చ  జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికి టీడీపీకి బలమైన కేడర్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ బలంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో టీడీపీ ఉంది. ఇటీవల పలు సంస్థలు జరిపిన సర్వేల్లోనూ టీడీపీకి తెలంగాణలో 15 శాతం వరకు ఓటు బ్యాంక్ ఉందని తేలింది. బలమైన నాయకుడు ఉంటే అది మరింత పెరుగుతోంది. ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి  అయితే తెలంగాణలో టీడీపీ పునర్ వైభవం సాధించడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తే టీటీడీపీకి ఈజీగా 25 నుంచి 30 అసెంబ్లీ సీట్లు వస్తాయని, అప్పుడు ఆయనే కింగ్ అవుతారనే చర్చ జరుగుతోంది. గతంలో కర్ణాటకలో కుమారస్వామి, ఇప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ లు ఇలాంటి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని చెబుతున్నారు. 

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రాలో కన్నా తెలంగాణలోనే టీడీపీ బలంగా ఉండేది. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో  టీడీపీకి బలమైన నాయకత్వం ఉండేది. అందుకే టీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్.. మొదటగా టీడీపీనే టార్గెట్ చేశారు. ఆ పార్టీలోని నేతలే ఎక్కువ మందిని తనతో కలిసివచ్చేలా చేసుకున్నారు. తెలంగాణ ఏర్పటయ్యాక కూడా టీడీపీని బలహీనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. అందులో భాగంగానే 2014లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. తన వ్యూహంలో భాగంగా టీడీపీ కేడరంతా టీఆర్ఎస్ వైపు వచ్చేలా చూసుకున్నారు గులాబీ బాస్. అందుకే 2014లో సరైన కేడర్ లేని టీఆర్ఎస్ ఇప్పుడు అన్ని గ్రామాల్లోనూ విస్తరించింది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న నేతల్లో ఎక్కువ మంది గతంలో టీడీపీలో పనిచేసిన వారే. ప్రస్తుత కేసీఆర్ కేబినెట్  కూడా పాత టీడీపీ నేతలతోనే నిండిపోయింది.  

 

రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు తెలంగాణలో టీడీపీ బలంగానే ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు ఏపీపైనే ఫోకస్ చేయడం, ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్న రమణ అసమర్ధంగా ఉండి పార్టీని పట్టించుకోకపోవడంతో తెలంగాణ తమ్ముళ్లంతా ఎవరి దారి వారు చూసుకున్నారు. మెజార్జీ నేతలు, కార్యకర్తలు కారు పార్టీలోకి వెళ్లారు. బలమైన నాయకుడు ఉంటే మళ్లీ టీడీపీ కేడరంతా ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ఉన్నా చాలా మంది పాత టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని, రేవంత్ రెడ్డి వస్తే వాళ్లంతా ఆయనకు మద్దతుగా నిలుస్తారని అంటున్నారు. రేవంత్ రెడ్డి టీటీడీపీ సారథ్య బాధ్యతలు తీసుకుంటే అన్ని పార్టీ్ల్లో ఉన్న టీడీపీ కేడరంతా ఆయనకు మద్దతుగా నిలుస్తుందని చెబుతున్నారు. తటస్టులు, మేధావులు, యూత్, రాష్ట్రవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు తోడేతై.. అధికారం ఆయనకు అందిరావడం పెద్ద కష్టం కాదంటున్నారు  పొలిటికల్ అనలిస్టులు. 

 

రాష్ట్ర విభజన జరిగిన మొదట్లో టీడీపీపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేక భావన ఉండేది. ఆంధ్రా పార్టీ తెలంగాణలో అవసరమా అన్న చర్చ కూడా కొన్ని వర్గాల్లో నడిచింది. కాని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవంటున్నారు. కేసీఆర్ అరేండ్ల పాలనలో విసిగిపోయిన ప్రజలు మంచి లీడర్ కావాలని కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషలుకు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి లాంటి లీడరు వారికి అశాకిరణంలా కనిపిస్తున్నారని కూడా చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ సమయంలో రేవంత్ రెడ్డికి ఇది కలిసి వస్తుందని భావిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు రేవంత్ రెడ్డి టీటీడీపీకి సారథ్యం వహిస్తే అది తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉంది. కాని ఈ దిశగా రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తారా.. లేక కాంగ్రెస్ తోనే తన ప్రయాణం కొనసాగిస్తారా చూడాలి మరీ..