Read more!

పదేళ్లపాటు ఏం చేశారు.. ఇప్పుడు స్టే ఇవ్వలేం! జీహెచ్ఎంసీ ఎన్నికపై హైకోర్టు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. విచారణ జరిపేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆపాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్ పిల్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషన్ లో పెర్కొన్నారు. అత్యవసర పిటిషన్‌గా స్వీకరించి విచారణ జరపాలని శ్రవణ్‌ తరఫు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. దీంతో ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని.. విద్యారంగంలో బీసీల రిజర్వేషన్లు, రాజకీయ బీసీ రిజర్వేషన్లు వేర్వేరని న్యాయవాది వాదించారు. 
  

పిటిషనర్ తరపు లాయర్ వాదలనపై స్పందించిన హైకోర్టు.. పిల్‌ దాఖలు చేసిన శ్రవణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదనని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వబోయే చివరి క్షణంలో ఆ విషయం గుర్తొచ్చిందా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దురుద్దేశంతో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారని.. ఎన్నికలు ఆపే రాజకీయ ప్రణాళికతో పిల్‌ దాఖలు చేశారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్‌ విచారణ చేపడతాం కానీ.. ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.