Read more!

కాలుష్యంపై పచ్చని మందు!!

పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం చాలా పెరిగిపోయింది, పెరిగిపోతూ ఉంది కూడా. అయినా మనుషులు మాత్రం ఏమీ మారడం లేదు, ప్రకృతికి కలిగించాల్సినంత నష్టం కలిగిస్తూనే ఉన్నారు. కొంతమంది మాత్రం పర్యావరణం గురించి ఆందోళన పడిపోతూ సంరక్షణా చర్యలు చేపడుతూ ఉంటారు. అయితే అదంతా బాగా తాపం పెరిగిపోయిన భూమి మీద చెంబుడు నీళ్లు చల్లినట్టే అవుతోంది. క్షీణిస్తున్న పర్యావరణానికి ఆ కొద్ది సంరక్షణా చర్యలు ఏ మూలకు సరిపోవడం లేదు. ఫలితంగా నష్టం పెరుగుతూ పోతోంది. 


ఎలా పెరుగుతోంది ఈ కాలుష్యం!!


ఆలోచించాల్సిన అవసరం లేకుండా అందరికీ ఈ పర్యావరణం కాలుష్యం అవుతున్నందుకు కారణాలు ఏంటి అనేది తెలుస్తూనే ఉంటుంది. ఒకటో ఎక్కం అప్పజెప్పినంత వేగంగా పర్యావరణం కాలుష్యం అవ్వడానికి గల కారణాలను వివరించి చెప్పగలరు ఈ మనుషులు. కానీ మనిషిలో ఉన్న స్వార్థపు బీజాలు మెల్లిగా పెరుగుతూ ఇంకా ఇంకా నష్టాన్ని పెంచుతూ పోతారు. 


నివారణే కాదు సరిచేయడమూ తెలియాలి.


నిజం చెప్పాలంటే కొంతమంది పర్యావరణ స్పృహతో మొక్కలు నాటడం చేస్తారు అందరికీ మొదట గుర్తొచ్చేది కూడా మొక్కలు నాటడమనే ప్రక్రియనే. అయితే ఇందులో చాలామంది మొక్కను నాటడం చేస్తారు కానీ దాన్ని చెట్టుగా మార్చే అంత ఓపిక తెచ్చిపెట్టుకోరు. అంతా తాత్కాలిక ఉద్ధరించడాలు. దారెంటా వెళ్తున్నప్పుడు ఏ చెట్టుకో ఒక పండు కనబడితే దాన్ని కోసుకోవడానికి చూపించినంత ఆసక్తి అదే దారిలో ఎండిపోతున్న ఓ మొక్కకు కొన్ని నీళ్లు తెచ్చి పోయాలనే విషయంలో మాత్రం ఉండదు మనిషికి. ఇలా మనిషి ఎన్నో విధాలుగా ఎన్నో కోణాలలో తప్పులు చేస్తూ సమాజం ముందు మాత్రం ఉద్దరిస్తున్నట్టు ఫోజులు కొడతాడు. 


అరికట్టడానికి కట్టుబడి ఉండాలి!!


పర్యావరణ కాలుష్యం అరికట్టడం అంటే ఓ పది స్లోగన్ లు రాసిన బోర్డ్ లు పట్టుకుని, నాలుగు ర్యాలీలు చేసి, గొంతు చించుకుని అరచి, కార్యక్రమం ముగియగానే ఆ సమావేశ ప్రాంగణం అంతా కూల్డ్రింకులు, నీళ్లు తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులతోనూ, పులిహోర, చిరుతిండ్లు తినేసి పడేసిన ప్లాస్టిక్ కవర్లతోనూ నింపేసి చాలా గొప్ప మేలే వెలగబెడుతుంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండకపోగా జరిగే నష్టమే ఎక్కువ. 


భూటాన్ దేశంలో ప్రజలు వీధుల గుండా ఇంకా దారిలో   పోతున్నప్పుడు గమనిస్తే వాళ్ళు 99% నడుచుకుంటూ వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు పర్యావరణానికి హాని కలిగించే పనులు ఏమి చెయ్యరు. కాలుష్యాన్ని తన్ని తరిమేశారు.  వాళ్ళ రాజ్యాంగంలో పర్యావరణాన్ని రక్షించడం అనేది చాలా ముఖ్యమైన విషయం కూడా. ఇక ఇంకో విషయం ఏమిటంటే వాళ్లు తమదేశంలో ఉన్న విహారాయాత్రకు ప్రముఖమైన ప్రాంతాలలో కొన్ని నియమాలు విధించుకున్నారు. పర్యాటకుల వల్ల ఆయా ప్రాంతాల నుండి ఆదాయం వస్తోంది కదా అని ఎలా పడితే అలా అనుమతులు ఇవ్వలేదు. ఆ విధంగా తమ ప్రాంత సహజత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. 


పైవన్నీ గమనిస్తే మన దేశంలో కాలుష్యానికి, పర్యావరణం కలుషితం అవ్వడానికి కారణం ముమ్మాటికీ సాంకేతిక మరియు పారిశ్రామిక అభివృద్ధి. వాటి ముసుగులో కావలసినట్టు ప్రకృతిని నాశనం చేస్తూ పోతున్నారు. వాటి ఫలితమే ఆకారణ భీభత్సాలు. 


మన ప్రకృతిని మనం బాగుచేసుకోవాలి అంటే కృతిమ జీవితానికి దూరంగా ఉండాలి, సంపాదనల వెంట పరిగెత్తకుండా తృప్తితో బతకడం నేర్చుకోవాలి. పచ్చదనాన్ని సృష్టించాలి, ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోవాలి. నష్టం కలిగించే పనులు మానేయాలి. ఇలా చేస్తుంటేనే అందరూ కాసింత స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతారు. లేకపోతే నగరాలలో ఎగురుతూ కనిపించే నల్లని గాలి కెరటాలే మనుషుల శ్వాస కేంద్రకాలు అవుతాయి. 


                                                                                                                              ◆వెంకటేష్ పువ్వాడ.