అందాల పోటీలతో గ్లోబల్ అటెన్షన్ .. తెలంగాణ లక్ష్యం ఇదే!
posted on May 6, 2025 @ 3:07PM
సింగిల్ ఈవెంట్... 120కి పైగా దేశాల్లో బ్రాండింగ్.. ఇదే తెలంగాణ సర్కార్ ప్లానింగ్. అవును 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ గ్లోబల్ అటెన్షన్ సాధించేందుకు సిద్ధమైంది. సిటీలో సందడి షురు అయిపోయింది. విదేశాల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా వచ్చేస్తున్నారు. జస్ట్ అందాల పోటీలంటే పోటీలు పెట్టేసి కథ ముగించడం కాదు. ఇందుకోసం ఖర్చుపెట్టే ప్రతి పైసాకు భారీ లాభం వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసి పెట్టింది. ఎందుకంటే 120కి పైగా దేశాల నుంచి కంటెస్టెంట్లు.. వారి వెంట మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు వస్తారు. వారి ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను హైలెట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లు తెలంగాణవైపే ఉండేలా చేయడం కీలకం.
అందుకే మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది రేవంత్ సర్కార్. తొలిసారి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. దాన్ని పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునేలా రేవంత్ సర్కార్ ప్లాన్ రెడీ చేసేసింది. హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు కనీవినీ ఎరుగని విధంగా జరిపేలా డిజైన్ చేసింది. ఈనెల 10 నుంచి జరిగే ఈవెంట్స్ కు హైదరాబాద్ రెడీ అయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ ఉండబోతోంది. అటు అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు.
ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తెలంగాణ జరూర్ ఆనా నినాదాలు కనిపించేలా, వినిపించేలా టూరిజం శాఖ ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ విమా నాశ్రయం వస్తున్న సుందరీమణులకు టూరిజంశాఖ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతోంది. గ్లోబల్ సెలబ్రిటీల సందడితో శంషాబాద్ పరిసరాల్లో జోష్ పెరిగింది. వీరి కోసం నగరంలోని పలు ఫైవ్ స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్‌లో ముందస్తు బుకింగ్ చేశారు. అంతే కాదు.. టూరిజం శాఖ తరఫున పోటీదారులకు అందించేందుకు ఫుల్ డిటైల్స్ ఉన్న బుక్‌లెట్‌ను రెడీ చేస్తున్నారు. అతిథులు, పోటీల్లో పాల్గొనేవారు సందర్శించే అన్ని ప్రదేశాల్లో బ్యూటిఫికేషన్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది.
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి.. దగ్గరుండి పర్యవే క్షిస్తున్నారు. ఏప్రిల్ 29న సీఎం సమీక్ష నిర్వహించారు. అక్కడితో ఆగకుండా.. నిరంతరం పనులు సాగుతున్న తీరును, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మే 10 తేదీ నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలూ, సలహాలూ ఇస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్లు కేవలం కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ కు పరిమతమయ్యేలా కాకుండా, షెడ్యూల్ ప్రకారం వారిని తెలంగాణలోని అన్ని టూరిజం స్పాట్లకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మే 12న హైదరాబాద్ చారిత్రక, వారసత్వ గొప్పదనం చెప్పేలా చార్మినార్ ప్రాంతంలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. అదే రోజు నాగార్జునసాగర్ లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిస్ట్ థీమ్ పార్కును ప్రపంచానికి తెలిపేలా ఆధ్యాత్మిక పర్యటనకు తీసుకెళ్తారు. ఈనెల 13న హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న చౌమహల్లా ప్యాలెస్ తీసుకెళ్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఉంది.
ఇక మే 14న వరంగల్ లోని థౌజండ్ పిల్లర్ టెంపుల్, వరంగల్ పోర్ట్ కు తీసుకెళ్తారు. అదే రోజు రామప్ప ఆలయ సందర్శన కు కూడా తీసుకువెడతారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రత్యేకతలను వివరిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన అరుదైన పేరిణి నృత్యాన్ని తిలకిస్తారు. మే 15న యాదగిరి గుట్ట ఆలయ సందర్శన ఉండనుంది. డివోషనల్ టూరిజంలో భాగంగా ఈ చోట్లకు తీసుకెళ్తారు. అదే రోజు గ్రూప్ 2లోని కంటెస్టెంట్లను పోచంపల్లికి తీసుకెళ్లి అక్కడ చేనేత తయారీ విధానాన్ని చూపుతారు. అలాగే చేనేత వస్త్రాలతో వారు ర్యాంప్ వాక్ నిర్వహించేలా ప్లాన్ చేశారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకే ఈ షో ఏర్పాటు చేశారు.
మే 16న వివిధ దేశాల నుండి చికిత్సల కోసం వచ్చే వారిని ఆకర్షించేలా మెడికల్ టూరిజం ప్రోగ్రామ్ రెడీ చేశారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు గ్రూప్ 1 మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు హాజరవుతారు. తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక వైద్య చికిత్సలు అందించే పరిస్థితిని వివరిస్తారు. 16న పిల్లల మర్రి, అదే రోజు ఎక్స్ పీరియం ఎకో పార్క్ సందర్శన, 17న రామోజీ ఫిలిం సిటీ సందర్శన, 18న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సేఫ్టీ టూరిజంపై డెమో ఇస్తారు. జ అదే రోజు సచివాలయం తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధి, తెలంగాణ చరిత్ర గురించి వివరించనున్నారు. 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులతో నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్ కు తీసుకువెడతారు. చివరగా ఈనెల 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించడంతో ఈ మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా ముగిస్తారు. తద్వారా తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ తెలంగాణ సర్కార్ చేసింది.