రియల్ ముసుగులో మోసం... వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేసు 

యధా రాజా తథా ప్రజా అన్నట్టు వైసీపీ అధినేత జగన్ అడుగు జాడల్లో  వైసీపీ నేతలు వెళ్తున్నారు  వారు చేసే నేరాలు అన్నీ ఇన్నీ కావు. విశాఖ రాజధాని అని అనౌన్స్ చేసిన క్షణం నుంచే వైసీపీ నేతలు  రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. చట్ట ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఏ ఇబ్బంది లేదు. కానీ వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ ముసుగులో భూ కబ్జాలకు పాల్పడ్డారు. 
 వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతోపాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపై విశాఖపట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు. హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై ఎంవీవీ తనతో సంతకాలు పెట్టించుకున్నారని, విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని జగదీశ్వరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 22న సత్యనారాయణపై పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సత్యనారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

ముళ్ళపూడి వీరవెంకట సత్యనారాయణ అంటే ఠక్కున గుర్తుకురాకపోవచ్చు. అదే ఎంవీవీ సత్యనారాయణ అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తారు. వైసీపీ అభ్యర్ధిగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. వ్యాపారాలు చేసుకుంటూనే, రాజకీయ నాయకుడిగానూ కొనసాగారు. గతేడాది ఎంపీ ఎంవీవీ కుమారుడు శరత్, భార్య జ్యోతి, ఆడిటర్ జీవీలను కిడ్నాప్‌ చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత విశాఖను వదిలి హైదరాబాద్‌కు తన మకాం మార్చాలని సత్యనారాయణ నిర్ణయించుకోవడం అప్పట్లో దుమారం రేపింది. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ ఆయనకు కనీసం టికెట్ సైతం ఇవ్వలేదు.

ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన జరిగి ఏడాది పూర్తవుతోంది. అయినప్పటికీ ఇంకా సస్పెన్స్ మాత్రం వీడలేదు.. ఈ ఘటన ఎంవీవీ ప్రత్యర్ధుల పనేనా, లేక సొంత పార్టీ నేతలే ఆయనను ఇబ్బంది పెట్టారా అంటూ విశాఖ ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని స్థానిక నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు.. రియల్ ఎస్టేట్ బిజినెస్‌తో పాటు సినీ నిర్మాతగానూ ఎంవీవీ సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఎంవీవీ సినిమా బ్యానర్‌పై గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి, లక్కున్నోడు, నీవెవరో, గల్లీ రౌడీ, గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలు తీశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా విడుదలపై పెద్ద వివాదం నడిచింది. ఈ మూవీ రిలీజ్ ఆపాలని నిర్మాత నట్టికుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కూడా. 

Teluguone gnews banner