Read more!

ముందస్తు ఎన్నికలకు అటూ ... ఇటూ

ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నుంచి ఎన్నికల వరకు, ఎన్నికల రాజకీయమే నడుస్తున్నది. ఒకప్పుడు కొత్త ప్రభుత్వానికి కొంత హనీమూన్ పీరియడ్ అయినా ఉండేది కానీ, ఇప్పడు అది కూడా లేదు. డే వన్ నుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోతున్నాయి.

మరో వంక రాజకీయాల్లో ఎత్తు పల్లాలు ఎదురైన ప్రతి సందర్భంలోనూ మీడియా మేథావులు రాజకీయ వేడి రగిల్చి ఎప్పటికప్పుడు ముందస్తు ఎన్నికలకు ముహూర్తాలు ఖరారు చేస్తున్నారు. అలాగే, ప్రతిరోజూ రెండు పూటలా పొద్దున సాయత్రం రాజకీయ మేథావుల భాజా భజంత్రీలతో ఎన్నికలు వచ్చేసినట్లే అనే భ్రమల్లోకి ప్రజలను తీసుకు పోతున్నారు. వినోదం పండిస్తున్నాయి.  అయితే ముందస్తు సందడికి, మీడియానే కారణమా అంటే కానే కాదు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ తమ తత్కాల అవసరాలకు అనుగుణంగా ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని సాధ్యమైనంత కాలం సజీవంగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, రాజకీయ విశ్లేషకులు, ‘యూ-ట్యూబ్’ మేథావులు కర్ర విరక్కుండా, పాము చావకుండా, ముందస్తు ఎన్నికలు వస్తే రానూ వచ్చును  రాక పొతే రాక పోనూ వచ్చును. వస్తే ఏమి జరుగుతుంది, రాక పొతే ఏమవుతుంది? అంటూ, ప్రశ్నలు సమాధాలు తామే వినిపిస్తుంటారు. ఇక సోషల్ మీడియా విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా వినిసొంపు విశ్లేషణలు వెల్లువెత్తుతుంటాయి.

ఇప్పుడు తెలంగాణలో అదే కథ నడుస్తోంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు  ఒక సారి ముందస్తు ప్రశ్నే లేదంటారు, మరోమారు వెంటనే ఎన్నికలు జరుతామని కేంద్ర ప్రభుత్వం మాటిస్తే  ఇప్పుడే నిముషంలో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తుకు ఎన్నికలకు పోయేందుకు మేము రెడీగా ఉన్నామని అంటారు. అలాగే  ప్రతిపక్ష పార్టీలు ముందస్తుకు   మేము రెడీ అంటాయి.  మళ్ళీ అదే నోటితో ముందస్తు అవసరం లేదంటాయి.  

అదలా ఉంటే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలే అస్త్రాలుగా బీజేపీ, తెరాసల మధ్య రాజకీయ  యుద్ధం సాగుతున్న నేపధ్యంలో మరో మారు ముందస్తు  చర్చ జోరందుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు చేయడం, ఉద్యోగ నియామకాల ప్రకటలు, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఇలా ప్రతి మాట, ప్రతి ప్రకటన, సర్కార్ వారి ప్రతి అడుగు  ముందస్తు ఎన్నికల సంకేతమేననే ప్రచారం జరుగుతోంది. 

ఇటీవల మునుగోడు ఉపఎన్నికల తర్వాత టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు,పార్టీ నాయకులు, నియోజకవర్గాల్లో ప్రజల మధ్యన ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయిస్తానంటూ చెప్పుకొచ్చారు. నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించనున్నట్లు ప్రకటించారు. దీంతో ముందస్తు ఊహాగానాలు మరింత  ఉపందుకున్నాయి. 

అదలా ఉంటే, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ముందస్తుకు కొత్త డైమెన్షన్ ఇచ్చారు. ఇంకో ఏడెనిమిది నెలల్లో  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉందని అందరూ అనుకుంటున్నారని, కానీ తన దృష్టిలో రాష్ట్రంలో ఏడెనిమిది నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అంటే, అంటే 2023 డిసెంబర్ కు బదులుగా జూన్, జులై నెలల్లో ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు ఇచ్చారు.

రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఏడెనిమిది నెలల్లోనే ఎన్నికలు వస్తాయంటూ వినోద్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, బీఎస్పీ శ్రేణులకు కేవలం 180 రోజులు మాత్రమే సమయం ఉందని చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోవంక, బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ పార్టీ ముందస్తు ఎన్నికలు కోరుకోవడం లేదని, రాష్ట్రాంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని బీజేపీ కోరుకుంటోందని అన్నారు. 

అయితే ఏది జరగాలన్నా ముందు ముఖ్యమంత్రి కేసేఆర్ నిర్ణయం తీసుకుని, అసెంబ్లీ రద్దు చేయాలి, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు అంటే, అప్పడు మళ్ళీ సీన్ మొత్తం మారిపోతుంది.  సో ... ఇప్పడు సాగుతున్న చర్చకు ఒక విధంగా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదని అంటున్నారు. అయితే, ఈ ఊహాగానాలకు   ఇప్పట్లో తెరపడే అవకాశం అయితే కనిపించడం లేదని అంటున్నారు.