Read more!

తెలుగుదేశం నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై హత్యాయత్నం

ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. ఎవరికీ రక్షణ లేని వాతావరణం నెలకొని ఉంది. తెలుగుదేశం నాయకుడు, నెల్లూరు సిటీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిపై శనివారం హత్యాయత్నం జరిగింది. నాగ వెంకట రాజశేఖరరెడ్డి అనే వ్యక్తి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని ఉద్దేశ పూర్వకంగా కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో కోటంరెడ్డికి గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారుతో ఢీకొట్టిన యువకుడు పరారయ్యాడు. ఈ దాడికి కారణం తెలియాల్సి ఉంది. ఆ యువకుడు నేరుగా కోటంరెడ్డి నివాసానికి వచ్చి వాగ్వాదానికి దిగాడనీ, తొలుత కోటంరెడ్డి కుమారుడితో గొడవపడ్డాడని చెబుతున్నారు.

అనంతరం సర్ది చెప్పి ఆ యువకుడిని కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి పంపించేశాడని అంటున్నారు. వెళ్లినట్టే వెళ్లిన యువకుడు రివర్స్ లో కారులో వచ్చి కోటంరెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టి పరారయ్యడు.    ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటం రెడ్డిని తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటనకు గల కారణాలను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మాజీ మంత్రి సోమినేని చంద్రమోహన్‌ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

కోటం రెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పిందనీ ....కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇంటికి వచ్చి, వార్నింగ్ ఇచ్చిమరీ కారుతో ఢీ కొట్టడంపై అనుమానాలున్నాయనీ సోమిరెడ్డి అన్నారు. కాగా ఈ ఘటనలో కోటంరెడ్డి కాలు ఫ్రాక్చర్ అయిందనీ, దాడి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

నెల్లూరు జిల్లాను వైసీపీ నేతలు డ్రగ్స్ అడ్డాగా మార్చేశారన్నారు.  రాజశేఖరరెడ్డి కారు వెనుక మరో కారు కూడా ఉందని చెబుతున్నారు. అది ఎవరిదనేది ట్రేస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇంటికి వచ్చి మరీ కారుతో ఢీ కొట్టిన రాజశేఖరరెడ్డి తీరు అనుమానాస్పదంగా ఉందని కోటంరెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్నాడనీ పేర్కొన్నారు.