ఆటో, కార్ డ్రైవర్ లకు ఎపి ప్రభుత్వం శుభవార్త...
posted on Oct 4, 2019 @ 4:13PM
ఏపీలో మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి వైసీపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆటో, కార్ డ్రైవర్ లకు ఏడాదికి పది వేల రూపాయలు సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం జగన్ ఏలూరులో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, అంతకుముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ, సొంత ఆటోలు నడుపుకుంటూ సొంత టాక్సీలు నడుపుకుంటూ బ్రతుకు బండిని ఈడుస్తున్న అన్నదమ్ముల కష్టాలను చూశానని ఆ రోజు ఆయన ఎప్పటికీ మరచిపోలేని రోజు అని, ఆయన దగ్గరకొచ్చి ఆటో తోలుకుంటూ ఉంటున్నామని రోజుకి మూడు వందల రూపాయలు, ఐదు వందల రూపాయల మించి ఏ రోజు రాదని, వాటితోటి బతకడమే కష్టం అనుకుంటే అదికాక ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకపోతే ప్రతిరోజూ యాభై రూపాయలు ఫైన్ వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వాన్ని ఒక్కసారి చూడండని చెప్పిన మాటలను మర్చిపోలేను అన్నారు.
చెప్పిన మాట ప్రకారం అధికారం లోకి వచ్చి నాలుగు నెలలు తిరగక మునుపే ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన అందరి బ్యాంకు అకౌంట్లల్లో బటన్ నొక్కిన వెంటనే కేవలం రెండు గంటల్లోనే డబ్బులొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని గర్వంగా చెప్పారాయన. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందని, ప్రతి సంవత్సరం పది వేల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు ఆటోతో, ట్యాక్సీతో బ్రతుకు బండిని లాగుతున్న ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తామని మాటిచ్చారాయన. పరిస్థితులను మారుస్తూ ప్రతి పేదవాడికీ మంచి చేయాలనే తపనతో ప్రభుత్వం ముందడుగులు వేస్తుందన్నారు.