Read more!

జైలు శిక్ష పడినా బీజేపీ ఎమ్మెల్యేలు సేఫ్.. వారికి అనర్హత అంటదు!

మోడీ ఇండిపేరు పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇలా జైలు శిక్ష విధించిందో లేదో అలా ఆయనపై లోక్ సభ సెక్రటేరియెట్ అనర్హత వేటు వేసింది. అయితే ఈ చర్య.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్వపక్షీయుల విషయంలో ఒకలా, విపక్షీయుల విషయంలో మరోలా వ్యవహరిస్తోందంటూ ఇంత కాలంగా వస్తున్న విమర్శలకు బలం చేకూర్చింది. బీజేపీ పాలిత రాష్ట్రం అయిన కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కోర్టులు జైలు శిక్షలు విధించినా, అలా విధించి రెండు నెలల దూటుతున్నా.. ఇంత వరకూ వారిపై అనర్హత వేటు పడలేదు. రూ.50లక్షల అవినీతి కేసులో నేరం రుజువై బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

అలాగే మరో బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి చెక్ బౌన్స్ కేసులో ప్రజాప్రతినిథుల ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిద్దరికీ కోర్టుల్లో జైలు శిక్ష పడినప్పటికీ అసెంబ్లీలో వీరి సభ్యత్వం మాత్రం పదిలంగానే ఉంది. అంతే కాదు.. ఏదైనా కేసులో రెండేళ్లు, అంతకు మించి జైలు శిక్షకు గురైన వారు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆటోమేటిగ్గా వారిపై అనర్హత వేటు పడుతుంది. కానీ కర్నాటక బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం అవేమీ వర్తించడం లేదు.  వీరిద్దరికీ జైలు శిక్ష పడినప్పటికీ వారి శాసనసభ సభ్యత్వాలను ఇంతవరకు రద్దు చేయలేదు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న వీరిద్దరూ   కర్నాటక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో పోటీ చేయడానికి వారు అప్పుడే సన్నాహాలు కూడా మొదలెట్టేశారు.

 ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు.  పై కోర్టుకు వెళ్లడానికి కోర్టు అవకాశం  ఇచ్చినా, ఆయన అనర్హుడే అవుతారు. రాహుల్ విషయంలో బీజేపీ చెబుతున్న మాటలివి. మరి ఇవే మాటలు.. రాహుల్ లాగే శిక్ష పడి దర్జాగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న బీజేపీ వారికి వర్తించదా అని కాంగ్రెస్ సహా విపక్షాలు నిలదీస్తున్నాయి.