Read more!

కొత్త జిల్లాల ఆశలపై కేంద్రం నీళ్లు

అనుకున్నదొకటి.. అయిందొకటి అన్నట్టుగా తయారైంది ఏపీ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ. జగన్ ను పట్టిపీడిస్తున్న సమస్యల నుంచి కాసింతైనా ఉపశమనం పొందుదామనుకున్న జగన్ అండ కో ఆశలపై కేంద్ర సర్కారు నీళ్లు చల్లింది. దీంతో తాత్కాలికంగా జిల్లా ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతోంది. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఆంధ్రా ప్రజలకు కాస్త ఉగాది పచ్చడి లాంటి తీపి, చేదు వార్తలను కలిపి పంచుదామనుకున్నారు జగన్. అయితే జూన్ నాటికి ఆ అవకాశాలు లేకుండా తయారైంది. ఇప్పుడున్న జిల్లాల సరిహద్దులను జూన్ వరకు మార్చవద్దని, కేంద్ర జనగణన డిప్యూటీ డైరెక్టర్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. రాష్ట్రాల ప్రయారిటీల కన్నా కేంద్ర ప్రభుత్వ ప్రయారిటీనే ఎక్కువ కాబట్టి సెన్సస్ విభాగం ఆదేశాలను శిరసావహించడం మినహా జగన్ బాబు చేయగలిగిందేమీ లేకుండాపోయింది. దేశమంతట నూతన గణాంకాల కోసం కోసం కేంద్ర సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగానే ఓటర్ లిస్టులు, నియోజకవర్గాల విభజనలు, బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే 2011 తరువాత జనాభాలో విపరీతమైన పెరుగుదల సంభవించింది. ఆయా క్లస్టర్స్ లో వివిధవర్గాల జనాభా సాంద్రతలోనూ అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించి తాజా సమాచారంతో పూర్తిస్థాయి జనాభా గణాంకాలు నిర్వహించేందుకు కేంద్రం రంగంలోకి దిగుతోంది. 

అయితే ఈ లోపు గనక ఏ రాష్ట్రమైనా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తేగనక ఆయా జిల్లాల సరిహద్దుల్లో మార్పులు వస్తాయి. దీంతో లెక్కల్లో గందరగోళం సంభవిస్తుంది. అలాంటివాటికి తావు లేకుండా వచ్చే జూన్ నాటికి ఏ రాష్ట్రం కూడా కొత్త జిల్లాల జోలికి వెళ్లరాదంటూ ఆంక్షలు విధించింది. దీంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు మరో 3 నెలలు వాయిదా పడక తప్పని పరిస్థితి తలెత్తింది. 

ప్రస్తుతం 13 జిల్లాల ఏపీని.. ప్రభుత్వం 26 జిల్లాలుగా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటవుతున్న 13 జిల్లాలు వాటి పేర్లు.. అలాగే 12 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంగళవారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికికేషన్‌ విడుదల చేసింది. అయితే వీటిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. 30 రోజుల సమయం ఇచ్చింది. కొత్త జిల్లాలపై వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఉగాది నాటికి కొత్త నోటిఫికేషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం సూచనలతో ఆ నిర్ణయం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.