Read more!

హిందూపురం సంగతేంటి? బాలయ్య బాబు ప్లానేంటి?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అనుకున్నదొకటి, అయింది అన్నట్లుగా అడుగడుగునా అనుమానాలు అభ్యంతరాలు వ్యక్త మవుతున్నాయి. ఆందోళనలు పురుడు పోసుకుంటున్నాయి. ఇతర జిల్లాల విషయం ఎలా ఉన్నా,అనంతపూర్ జిల్లా విభజన విషయంలో రాజకీయ రగడ తప్పేలా లేదు. రాష్ట్రాల  విభజన అంటూ జరిగితే అనంతపూర్ హిందూపురం జిల్లా ఏర్పడుతుందని అందరూ గట్టిగా నమ్ముతూ వచ్చారు. నిజానికి వైసీపీ ఎన్నికల ప్రణాళికలోనే, ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఉద్దేశంతోనే, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుండో, హిందూపూర్ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏర్పాటు అవుతుందని, గట్టిగా నమ్ముతూ వచ్చారు.  అయితే బాలయ్య బాబు తలచింది ఒకటైతే, జగన్ రెడ్డి ప్రభుత్వం వేరొకటి చేసింది.

అదే పనిగా మాటను తప్పను మడమ తిప్పను అని చెప్పుకునే జగన్ రెడ్డి ఈ విషయంలోనూ మాట తప్పారు. ఒక్క హిందూపూర్ విషయంలోనే కాకుండ్ ఇంకొన్ని జిల్లాల విషయంలోనూ రాజకీయాలకు ఎత్తు పీట వేశారు.  ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటుచేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన జగన్ రెడ్డి, అందుకు విరుద్ధంగా హిందూపూర్ ను తప్పించి పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించారు. 

దీంతో బాలయ్య బాబు అసంతృప్తికి గురయ్యారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పునరాలోచన చేయాలని హిందూపూర్ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జిల్లాల‌ ఏర్పాటులో రాజ‌కీయం చేయవద్దని బాలయ్య జగన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.  హిందూపురం ప్రజ‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించి వారి చిరికాల కోరికైన హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని బాలకృష్ణ కోరుతున్నారు. అయితే, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడవలసి వుంది. నిజానికి, ఇలాంటి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించి, పరిశీలించేందుకు ప్రభుత్వం నెల రోజులు గడువిచ్చింది. ఆ తర్వాతనే ఫైనల్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈ లోగా ప్రభుతం మనసు మర్చుకుంతుండా లేక రాజకీయమే చేస్తుందా చూడవలసి ఉంటుంది. అలాగే, అప్పటికీ, ప్రభుత్వం స్పందించక పొతే, బాలయ్య బాబు ఏమి చేస్తారు, ఆయన రియాక్షన్ ఎలా  ఉంటుంది అనేది కూడా చూడవలసి వుంది. అయితే, కొత్త జిల్లాల  కథతో ‘హిందూపూర్’  రాజకీయాలు ఆసక్తికరంగా కొత్త మలుపు తిరిగాయని అయితే అనుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.