Read more!

సీఐడీ నోటీసులో ఏముంది.. చంద్రబాబు విచారణ ఎప్పుడు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అమరావతి రాజధానిలో అసైన్డు భూముల కొనుగోలు, అమ్మకాలపై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబుతోపాటు ఎనిమిదిమందిపై కేసులు నమోదయ్యాయి. రాజధాని రైతులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. చంద్రబాబుపై 120బీ, 166, 167, 217 ఐపీసీ సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది.  దేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కోసం పెట్టడం ఇదే తొలిసారని చెబుతున్నారు. 

చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం నారాయణ హైదరాబాద్‌లో లేరు. ఈ నెల 23న విచారణకు రావాలని నారాయణకు ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. రాజధాని ప్రకటనకు ముందే తన అనుచరులకు సమాచారం ఇచ్చి అక్కడ దళితులకు చెందిన అసైన్డు భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలతో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అసైన్డ్‌ రైతులను మోసం చేసి తన అనుచరులకు లబ్ధి కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. రాజధాని ప్రకటన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయని.. అసైన్డ్‌ రైతులు మోసపోయి..అనుచరులకు లబ్ధి కలిగించారన్నది అభియోగం. దీనిపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. ఈ విషయంలో చంద్రబాబుకు సంబంధం లేదంటూ న్యాయస్థానం చెప్పింది. 

చంద్రబాబుకు నోటీసుల వ్యవహారాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.రాజకీయ కక్ష సాధింపుల కోసమే టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. 21 నెలలుగా వైసీపీ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని బోండా ఉమ వెల్లడించారు. తప్పుడు కేసులతో టీడీపీ అధినేత చంద్రబాబును భయపెట్టాలనుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. రెండేళ్లలో ఏమీ చేయలేని జగన్ సర్కార్.. ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండ్రోజుల నుంచి జగన్ క్యాంప్ భయపడుతోందన్నారు. జైలుకు వెళ్లాల్సివస్తుందనే భయంలో సీఎం జగన్ ఉన్నారని విమర్శించారు. ఏ1, ఏ2 బెయిల్ రద్దయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఏపీ సీఎంపై ఉన్న కేసులు దేశంలో ఏ ముఖ్యమంత్రులపై లేవని వర్ల రామయ్య తెలిపారు.