పూజల్లోనూ, ధ్యానం చేసేటప్పుడు ఆసనాన్ని ఇందుకే వాడతారు!!


మనం ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నా సరే, మన శారీరక భంగిమ, మన శ్రద్ధాసక్తులు మనకు తెలియకుండానే ఆ పని మీద ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా, పూజ, జపం, ధ్యానం లాంటివి చేస్తున్నప్పుడు మనం ఎలా కూర్చున్నాం, దేని మీద కూర్చున్నామనేది గమనించాల్సిన విషయం. ఎందుకంటే, మనంచేసే ఆ జప ధ్యానాలు నిర్విఘ్నంగా పూర్తి అయి, సత్ఫలితాలు ఇవ్వడానికి అవి కీలకం.


ఆసనం అంటే?


సర్వసాధారణంగా ఏదైనా ప్రార్థనచేస్తున్న ఎప్పుడు, ఏదైనా వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడూ కాళ్ళు మడత పెట్టి, పద్మాసనంలో కూర్చోవడం హిందువుల సంప్రదాయం. ఆ పద్మాసన భంగిమలో కూడా వట్టి నేల మీద కాకుండా ఏదైనా ఆసనం పరుచుకొని, దాని మీద కూర్చోవడం ఆచారం. సరైన ఆసనం మీద కూర్చొని, వైదిక కర్మకాండ నిర్వహిస్తే పూర్తి ఫలితం సిద్ధిస్తుంది. ఆసనం వాడడం వెనుక ఇలా ఎంతో ప్రాధాన్యం ఉంది. 


ఆత్మ సిద్ధి ప్రధానాచ్చ సర్వ రోగ నివారణమ్ | 

నవ సిద్ధి ప్రధానాచ్చ ఆసనం పరికీర్తితమ్ ॥


'ఆత్మ జ్ఞానం కలిగించడానికి, సర్వ రోగాలనూ నివారించడానికి, నవ సిద్ధులనూ ప్రాప్తింపజేయడానికీ 'ఆసనం' ఎంతో అవసరం'.


'ఆసనం' అనే మాటకు ఓ విశేష వివరణ కూడా పెద్దలు చెప్పారు. 'ఆసనం'లోని 'ఆ' అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. 'స' అంటే సర్వరోగాలనూ హరించేది. 'నం' అంటే నవ సిద్ధులనూ ఇచ్చేది అని విశేష అర్థం. అందుకే, పూజా పునస్కారాలకూ, జపతపాలకూ ఆసనం ముఖ్యమైన అవసరం.


ఆసనంగా వేటిని ఉపయోగిస్తారంటే - పులిచర్మం, కృష్ణాజినం (నల్ల జింక చర్మం), కంబళి, చిత్రాసనం, దర్భాసనం, దావళి, పట్టు వస్త్రం, నూలు వస్త్రాలను ఆసనాలుగా ఉపయోగించవచ్చు.


ఆసనం వాడడం ఎందుకు?


ఇంతకీ అసలెందుకు ఆసనం వినియోగించాలి, వినియోగిస్తే తక్షణ ప్రయోజనం ఏమిటని ఎవరికైనా సందేహం రావచ్చు. దీనికి మన పెద్దవాళ్ళు శాస్త్రీయమైన ఓ వివరణ ఇచ్చారు. కఠోర జపతపాలుచేస్తున్నప్పుడు సాధకుడిలో గణనీయమైన  స్థాయిలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ అంతర్గత శక్తి అతని ముఖవర్చస్సులో ద్యోతకమవుతూ ఉంటుంది. వట్టి నేల మీద కూర్చొని జపతపాలు నిర్వహించడం వల్ల ఓ ఇబ్బంది ఉంది. మన శక్తిని భూమి ఆకర్షించే ప్రమాదం ఉంది. కాబట్టి, దర్భాసనం పరచుకొని, దాని మీద కూర్చొని, జపతపాలుచేస్తే ఆ ఆసనం భూమ్యాకర్షణ శక్తిని నిరోధిస్తుంది. ఆ రకంగా జపతాపాల వల్ల సాధకుడిలో ఉత్పన్నమైన శక్తి వృథా కాకుండా కాపాడుతుంది.


                                  ◆నిశ్శబ్ద.
 


More Purana Patralu - Mythological Stories