ఆత్మకు శరీరానికి మధ్య వ్యత్యాసాన్ని తెలిపే శ్లోకం!!

 

మనిషి తన జీవితంలో అంతిమదశలో అంతా అయిపోయాక అప్పుడు అనుకుంటాడు ఈ శరీరం శాశ్వతం కాదు అన్ని తాత్కాలికాలే అని. కానీ అదే విషయాన్ని జీవితంలో ముందుగానే గ్రహిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుందని అది ప్రతి మనిషికి ఎంతో అవసరమని శ్రీకృష్ణభగవానుడు చెబుతాడు. అందులోనే శరీరానికి ఆత్మకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇలా తెలుపుతాడు.

య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్|
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ॥ 

ఈ ఆత్మ  ఇతరులను చంపుతుంది అని అనుకొనేవాడు, ఈ ఆత్మ ఇతరులచేత చంపబడుతుంది అని అనుకొనేవాడు. ఈ ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చావదు.

ఎవరైతే ఈ ఆత్మే శరీరము అనీ, ఈ శరీరమే అందరినీ చంపుతుంది అని భావిస్తారో, అలాగే ఈ ఆత్మకు శరీరమునకు భేదము లేదు, శరీరముతో పాటు ఆత్మ కూడా చంపబడుతుంది అని భావిస్తారో, వాళ్లు అజ్ఞానులు, అవివేకులు. ఎందుకంటే, ఆత్మ, శరీరం ఒకటి కాదు. ఆత్మ ఎవరినీ చంపదు. తాను ఎవరి చేతిలోనూ చావదు. ఆత్మ ఒక సత్ పదార్థము. ఆత్మకు రూపము, నామము, ఆకారము, కాల పరిమితి లేవు. శరీరము అసత్ పదార్థము. శరీరమునకు ఒక ఆకారము, పేరు, కాల పరిమితి ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి తాను వేరు, తన శరీరం వేరు అని భావించాలి. అలా కాకుండా, చంపడం అనే ప్రక్రియలో నేను చంపుతున్నాను అని కానీ, నేను చంపబడుతున్నాను అని కానీ భావిస్తాడో, అతనిలో ఆత్మజ్ఞానం లేనట్టే. అతడికి ఆత్మ గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను అనే అహంకారము అతనిలోని జ్ఞానాన్ని కప్పివేసి, అన్నీ తానే చేస్తున్నాను అనే భ్రమను కలుగజేస్తుంది. ఆ భ్రమయే అవిద్య. ఆ భ్రమను పోగొట్టుకుంటే, ఆత్మజ్ఞానం దానంతట అదే కలుగుతుంది.

చిన్న ఉదాహరణతో ఇది అర్థం అవుతుంది. ఒక లైట్ వెలుగుతూ ఉంది. ఆ లైటు వెలుగులో మనం మంచి పనులు చేయవచ్చు, చెడ్డ పనులు చేయవచ్చు. మనం చేసే పనులతో లైటుకు గానీ, దాని నుండి వచ్చే ప్రకాశానికి ఎటువంటి సంబంధము లేదు. దాని పాటికి అది వెలుగుతూ ఉంటుంది. అలాగే ఆత్మ కూడా ప్రతిశరీరంలో వెలుగుతూ ఉంటుంది. ఈ శరీరము, మనో బుద్ధి అహంకారాలు, ఇంద్రియములతో చేసే ఏ పనికీ దానికి సంబంధము లేదు, సాక్షిగా చూస్తూ ఉంటుంది. అలాగే రాత్రి నేను బాగా నిద్రపోయాను. సుఖంగా నిద్రపోయాను అని అంటూ ఉంటారు. అంటే నిద్రపోయింది శరీరమా! శరీరం కళ్లుమూసుకుంటుంది. అంతే శరీరంలో ఉన్న మరొకడు సుఖంగా నిద్రపోయాడు. నిద్రలో ఆ సుఖం అనుభవించాడు. మరలా ఆ కళ్లు తెరవగానే శరీరం లేచి కూర్చుంటుంది.

అలాగే సుబ్బారావు చనిపోయాడు అని అంటారు. ఎవడు, ఎక్కడకు పోయాడు. సుబ్బారావు శరీరం చలనం లేకుండా మన ఎదురుగానే ఉంది. మరి పోయింది ఎవరు అని ప్రశ్నించుకుంటే అదే ఆత్మ అని అర్థం అవుతుంది. కాబట్టి శరీరం వేరు, శరీరంలో ఉన్న ఆత్మ వేరు. ఆత్మ ఏ పనీ చేయదు. ఎవరినీ చంపదు. ఎవరిచేతిలోనూ చావదు. అదే ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు.

దీనిని బట్టి చూస్తే మనిషి ఆలోచనను ఎప్పుడైతే మెరుగుపరచుకుని అన్నిటినీ అవగాహన చేసుకుంటాడో అప్పుడే మనిషికి ఒకానొక ప్రశాంతత ఆ ప్రశాంతతే ఆత్మజ్ఞానం. అవేమి లేకుండా నేను, నాది, నా అనే మాటల్లోనే జీవిస్తూ ఉంటే ఎప్పటికి నిజాన్ని తెలుసుకోలేడు. ఎప్పటికి ఈ బంధాల చక్రం దాటలేడు.

◆ వెంకటేష్ పువ్వాడ

 


More Purana Patralu - Mythological Stories