విభీషణుడి విషయంలో రాముడికి అందిన సలహాలేమిటి?

విభీషణుడిని నువ్వు నామంచి కోరేవాడివి కాదు, నాకు శత్రువువి అన్నాడు రావణుడు. ఆ మాటవినగానే "నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి, తండ్రి తరువాత పెద్దన్నగారు తండ్రిలాంటి వారు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివి కనుక, నిన్ను రక్షించుకోవాలనే బుద్ధితో నాకు తోచిన సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాడిని అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నిన్ను పొగుడుతూ గోతుల్లోకి దింపేవారు, తప్పుడు సలహాలు చెప్పేవారు చాలామంది దొరుకుతారు. యదార్ధమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. నేను ఇక్కడ ఉండడం వలన నీకు భయం ఏర్పడుతోందని అన్నావు కాబట్టి, నేను నీకు ప్రమాదకరంగా ఉన్నానన్నావు కాబట్టి, నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నాను అన్నావు కాబట్టి, నేను నీకు ఎప్పటికైనా కంటకుడిని అవుతానని అన్నావు కాబట్టి నేను ఇక్కడినుండి వెళ్ళిపోతాను. ఇప్పటికీ నా కోరిక ఒకటే, నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, నీ బంధువులు, అందరూ సుఖంగా ఉండండి" అని చెప్పి, రావణుడికి నమస్కరించి విభీషణుడు వెళ్ళిపోయాడు. ఆయనతోపాటు మరో నలుగురు రాక్షసులు కూడా ఆయనతో వెళ్ళిపోయారు. ఆ అయిదుగురు ఒకేసారి ఆకాశమండలంలోకి ఎగిరిపోయారు.

విభీషణుడు, మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో ఉన్న విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరాలు "రాక్షసుడు వచ్చాడు, కొట్టెయ్యండి" అని అక్కడున్న చెట్లని, పర్వతాలని పెకలించేశారు. 

ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా "నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెని రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు. దురాత్ముడైన రావణుడికి నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. కాని ఆయన నా మాటలు వినలేదు. ఆయనలో అధర్మము ఉంది కనుక నేను ఆయనని విడిచిపెట్టి రాముడిని శరణు వేడడానికి వచ్చాను. రాముడు నాకే కాదు ఈ లోకములన్నిటికి శరణు ఇవ్వగలిగినవాడు. నేను మీకు శత్రువుని కాదు" అన్నాడు. 

వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దగ్గరికి వెళ్ళి "వచ్చినవాడు మనకి పరమ శత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించేముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయనకి అభయమిచ్చి కిందకి దింపావంటే మన సైన్యంలో ఎటువంటి లోపాలున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢచారి. ఇక్కడి రహస్యాలన్నీ కనిపెట్టి మనలో మనకి బేధాలు కలపిస్తాడు. అందుకని రామ, నువ్వు ఆయనకి శరణాగతి ఇవ్వకు. మాకు అనుమతి ఇవ్వు, వాళ్ళని సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబని కాని కాకులు తమ గూటిలోకి రానిస్తే, కాకి పిల్లలని ఆ గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు." అన్నాడు.

అప్పుడు రాముడన్నాడు "నామీద నీకున్న ప్రేమ ఎటువంటిదో నాకు తెలుసు సుగ్రీవ, నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్తాని కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలను చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా" అని అడిగాడు.

అంగదుడు లేచి అన్నాడు "మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనపడితే స్వీకరిద్దాము. ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే ఆయనని విడిచిపెట్టేద్దాము" అన్నాడు.

తరువాత శరభుడు "మనం కొంతమంది గూఢచారులని పంపిద్దాము. గూఢచారులు ఆయనని పరిశీలించి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢచారులు చెప్పిన మాటలని బట్టి మనం నిర్ణయించుకుందాము" అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు "ఇది వేళ కాని వేళ ఇటువంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకి వచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నది పరుల ప్రదేశంలో దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. అందుకని ఈయనని తీసుకోకపోవడమే మంచిది". అన్నాడు. 

మైందుడు అన్నాడు "మనం ఎవరన్నా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దగ్గరికి పంపిద్దాము. అప్పుడు వారు వేసిన ప్రశ్నలకి విభీషణుడు ఏ సమాధానాలు చెబుతాడో గమనిద్దాము, విభీషణుడు చెప్పిన సమాధానాలు మనకి అనుకూలంగా ఉంటే ఆయనని స్వీకరిద్దాము, లేకపోతే ఆయనని స్వీకరించద్దు" అన్నాడు. ఇలా రాముడికి చాలామంది సలహాలు ఇచ్చారు.

                                       ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories