సకల సంతాన సమస్యలకు పరిష్కారం పోలాల అమావాస్య వ్రతం!!

ప్రతి ఒక్కరికి సాదారణంగా నిత్యజీవితంలో ఎన్నో నమ్మకాలు ఉంటాయి. అలాంటి నమ్మకాల్లో అమావాస్య, పౌర్ణమి, పండుగ, గ్రహణం, చావు, పుట్టుక, మడి, మైల ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి నమ్మకాలలో చాలా శక్తివంతమైనది అమావాస్య. అమావాస్య అనగానే చాలామంది మనసులో ఒకానొక నెగిటివ్ ఆలోచన వస్తుంది. అయితే శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్య మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. 

ఏమిటి దీని ప్రత్యేకం??

శ్రావణ మాసంలో వచ్చే బహుళ  అమావాస్య ను పోలాల అమావాస్య అని కూడా అంటారు. పెళ్లి అయ్యి చాలా కాలం గడిచినా పిల్లలు పుట్టని వాళ్ళు ఈ పోలాల అమావాస్య రోజున వ్రతం చేసుకుంటారు. కేవలం పిల్లలు పుట్టని వాళ్లే కాదు, పిల్లల ఆరోగ్యం, జీవితం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. 

అసలు వ్రతం ఎందుకు ప్రాచుర్యం పొందింది?? దీని కథ ఏమిటి??

పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో ఒక పండితుడు ఉండేవాడు. అతడు స్మార్త తెగకు చెందినవాడు. అతనికి ఏడుగురు కొడుకులు ఉండేవారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారిలో చివరి కొడలుకు తప్ప మిగిలిన ఆరు మంది కొడళ్లకు పిల్లలు పుట్టారు. చివరి కోడలు గర్భవతి కావడం, ప్రసవంలో బిడ్డ చనిపోవడం జరిగేది. అలా ఆమె ఆరు సార్లు గర్భవతి అయ్యి, పిల్లలను పోగొట్టుకుంటూ ఉండేది. అయితే ఆమె అలా వరుసగా పిల్లలను కోల్పోతుండటం వల్ల ఆ ఇంట్లో మిగిలిన కోడళ్లకు చివరి కోడలు మీద చాలా కోపం ఉండేది. ఆమె వల్ల తాము ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య వ్రతం చేసుకోలేక పోతున్నాం అనే కోపం వాళ్ళ మనసులో బాగా పెరిగిపోయింది. 

చివరి కోడలు మళ్ళీ గర్భవతి అయ్యింది. అయితే ఈసారి ఏమైనా బిడ్డ చనిపోవడం లాంటివి జరిగితే తమకు పూజ చేసుకోవడం కుదరదు అని ఆరుమంది కొడళ్లు కలసి చివరి కొడలికి దూరంగా ఉండి వ్రతం చేసుకోవాలని అనుకున్నారు. అయితే చివరి కోడలు సరిగ్గా అమావాస్య రోజు బిడ్డను కనింది కానీ ఆ బిడ్డ పుట్టగానే చనిపోయాడు. ఆమె ఏమి చేయలేక, అలా బిడ్డ చనిపోయిన విషయం తెలిస్తే తన తొడికోడళ్లు తనని తిడతారనే భయంతో విషయం చెప్పకుండా చనిపోయిన బిడ్డను గదిలో దాచిపెట్టి, చీరను ఒక మూటగా చుట్టి దాన్ని తన కడుపు భాగంలో పెట్టుకుని, నిండు గర్భవతిలా తన తొడికోడళ్ల దగ్గరకు వెళ్లి తాంబూలం తీసుకుని తిరిగి బిడ్డను దాచిన గదికి వచ్చింది. తరువాత చనిపోయిన బిడ్డను తీసుకుని గతంలో చనిపోయిన తన బిడ్డలను పూడ్చిపెట్టిన చోటుకు వెళ్లి అక్కడే ఆ బిడ్డను పూడ్చి పెట్టి, అక్కడే ఏడుస్తూ కూర్చుంది.

ఆ సమయంలో గ్రామ దేవత పొలాలమ్మ అటుగా వెళ్తూ ఏడుస్తున్న ఆమె దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది.  ఆమె పొలాలమ్మ దేవతతో జరిగిన విషయాలు అన్ని చెప్పుకుని ఎంతో బాధపడింది. అంతా విన్న పొలాలమ్మ దేవత ఆమెతో "ఏడవకు నీ బద్దలు చనిపోగానే నువ్వు ఎక్కడ పూడ్చి పెట్టావో అక్కడికెళ్లి వాళ్లకు నువ్వు పెట్టాలని అనుకున్న పేర్లతో పిలువు" అని చెప్పి మాయమైపోయింది. 

వెంటనే ఆమె తన బిడ్డల సమాధుల దగ్గరకు వెళ్లి పేర్లు పెట్టి పిలవగానే సమధులలో ఉన్న పిల్లలు లేచి ఆమె దగ్గరకు వచ్చారు. వాళ్ళను అలా చూడగానే ఆమె ఎంతో సంతోషపడి వాళ్ళను ప్రేమగా హత్తుకుని తరువాత వాళ్ళను వెంట బెట్టుకుని తన తొడికోడళ్ల దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పగా వాళ్ళందరూ సంతోషించి, పొలాలమ్మ దేవత శక్తిని గుర్తు చేసుకొని  అప్పటి నుండి మరింత భక్తిగా పూజ చేసుకోవడం మొదలు పెట్టారు. 

ఎవరు చేసుకోవాలి ఈ వ్రతాన్ని??

పెళ్లయి చాలా కాలం గడిచినా పిల్లలు పుట్టని వాళ్ళు, పిల్లలు ఉండి వాళ్ళ ఆరోగ్యం మరియు జీవితం ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.

◆వ్రత విధానం:-

పూజా ప్రాంతాన్ని శుభ్రంగా అలికి, ముగ్గులు పెట్టి ఆ ప్రదేశంలో కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టి, ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుడికి విధిగా పూజ చేయాలి. 

తరువాత మంగళ గౌరీ దేవిని లేదా పిల్లల కోసం పూజిస్తారు కాబట్టి సంతాన లక్ష్మీ ని కానీ కంద మొక్క లోకి ఆ దేవతలను ఆవాహన చెయ్యాలి. తరువాత షోడశోపచార పూజ చేయాలి.

ఈ పూజలో తొమ్మిది సంఖ్యకు విశిష్టమైన స్థానం ఉంది. అందువల్ల తొమ్మిది పూర్ణం బూరెలు, తొమ్మిది గారెలు, తొమ్మిది రకాల కూరగాయలతో చేసిన పులుసును అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. 

తరువాత అక్షింతలు చేతిలో పట్టుకుని,  పోలాల అమావాస్య వ్రత కథను చదువుకుని చేతిలో అక్షింతలు తలమీద వేసుకోవాలి.

తరువాత చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలో ఒక పెద్ద ముత్తైదువును పిలిచి దేవుడి దగ్గర పెట్టని పూర్ణం బూరెలులో తొమ్మిదింటిని ఆ పెద్ద ముత్తైదువును తాంబూలంలో ఇచ్చి, కంద మొక్కకు దగ్గర తోరాల్లో ఒకదాన్ని కండమొక్కకు కట్టి, మరొక దాన్ని  ముత్తైదువుకు ఇచ్చి, మరొకదాన్ని వ్రతం చేసుకున్న మహిళ మెడలో వేసుకోవాలి. 

ఈ వ్రతాన్ని పూర్తి చేసుకుంటే సకల సంతాన సమస్యలు తీరిపోతాయి.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories