విభీషణుడి గురించి హనుమంతుడి అభిప్రాయం?


విభీషణుడి అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పాక రాముడు హనుమంతుడి వైపు చూసాడు.

"రాముడు నా అభిప్రాయం అడుగుతున్నాడు" అనుకుని హనుమంతుడు పైకి  లేచి "మహానుభావా మూడు లోకములలో జెరిగే సమస్త విషయాలని తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడవి నువ్వు, నీకు వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెబుతున్నాననో, తర్కం చేయడానికి చెబుతున్నాననో, వేరొకరు చెప్పిన అభిప్రాయాలని ఖండించి సంఘర్షణ పడాలనుకొని చెబుతున్నాననో మీరు మాత్రం భావించకూడదు. మీరు నామీద గౌరవముంచి అడిగారు. కాబట్టి నేను మీమీద గౌరవముంచి నాకు యుక్తము అనిపించిన మాటలు చెబుతాను. ఆ తరువాత మీరు ఆలోచన చేసి సరైన విధంగా నిర్ణయించుకోండి" అన్నాడు.

"సరే హనుమా!! నువ్వు నీ అభిప్రాయం చెప్పు" అని అన్నాడు రాముడు.

"రామా ఇక్కడ కొంతమంది విభీషణుడిని నమ్మకూడదు అన్నారు, విభీషణుడు కామరూపాన్ని పొందగలిగినవాడైతే, మన సైన్యంలోకి వచ్చి గూఢచర్యం చెయ్యవలసినవాడైతే, తన స్వరూపంతో వచ్చి ఆకాశంలో నిలబడి "నేను రాముడిని శరణు వేడుకుంటున్నాను" అని అతను చెప్పవలసిన అవసరం లేదు.

ఇక్కడ  కొంతమంది  వారివైపుకి గూఢచారులని పంపమన్నారు, మనకి తెలీకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవాడి మీదకి గూఢచారులని పంపి నిర్ణయించుకోవచ్చు. కాని ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీదకి గూఢచారిని ఎలా పంపిస్తారు??. 

కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వలన సమాధానాలు రాబట్టమన్నారు, మనం అతనిని ఏమని ప్రశ్నిస్తాము? జవాబు చెప్పేవాడికన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వెయ్యవచ్చు. కొన్నిసార్లు తెలివి తక్కువ ప్రశ్న వలన మిత్రుడిగా ఉండవలసినవాడు. అమిత్రత్వంతో అక్కడినుండి వెళ్ళిపోవచ్చు, దానివలన మనం నష్టపోతాము. అందుకని అన్నివేళలా ప్రశ్నలు వేసి నిర్ణయించడం సాధ్యం కాదు. 

కొంతమంది గుణములు ఉంటే స్వీకరిద్దాము అన్నారు. వేరొకరి విషయంలో సరికానిది మనవిషయంలో సరైనది కావచ్చు, మన విషయంలో సరికానిది వేరే వారి విషయంలో సరైనది కావచ్చు.  కాబట్టి గుణం అనేది ఒక విషయంతో నిర్ణయించేది కాదు. కొంతమంది దేశము, కాలము విషయాల గురించి మాట్లాడారు. నిజానికి దేశ, కాల పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఇది వాస్తవమైన పరిస్థితి.  ఇక్కడ గతానికి, భవిష్యత్తుకు కాదు కేవలం ప్రస్తుతానికి సంబంధించిన చర్చ మాత్రమే నడుస్తోంది..

ఇవతలవారికి అపకారము చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడినవాడైతే ఆయన ముఖం అంత తేజోవంతంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండదు, అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషం కాని, శరుడికి ఉండే బుద్ధికాని నాకు కనపడడంలేదు. ఆయన మాట్లాడిన మాటలలో దోషం పట్టుకోడానికి నాకు ఏమి కనపడలేదు. ఇటువంటప్పుడు మనం ఆయన మీద వేరే ఉద్దేశాన్ని ఏర్పరుచుకుని  శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవడం లేదు.

 నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణుడికి మీ పౌరుష పరాక్రమాల గురించి, మీ ధర్మము గురించి తెలుసు, ఆయనకి తంఆ అన్న రావణుడి పౌరుషము తెలుసు, మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. అలాగే, మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు. అధర్మాత్ముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకం చేస్తారు అని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను' అన్నాడు.

                                       ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories