సుగ్రీవుడికి రాముడు చెప్పిన పావురాల కథ!

హనుమంతుడు వివరంగా చెప్పిన తరువాత "వచ్చినవాడు విభీషణుడే కాని, రావణుడే కానీ, నన్ను శరణు కోరినవాడు ఎవడైనా సరే రక్షిస్తాను. నిజానికి ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. అదే కులంలో జన్మించినవాడు ఎవడు ఉంటాడో వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది, అలాగే పక్కనున్న రాజుకి ఆశ ఉంటుంది. అందుకని ఈ రెండిటి విషయంలో మనం తటస్థులము, కాని ఈ రెండు కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు.

సుగ్రీవా!!  ప్రపంచంలో భరతుడులాంటి సోదరుడు ఉండడు (కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక), నాలాంటి కొడుకు ఉండడు (తండ్రి ప్రేమని అంతలా పొందాడు. కనుక), నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్నీ ఆ కోణంలో పోల్చి చూడకు. వాడు దుష్టుడు కాని, మంచివాడు కాని, నా దగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మండములో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్త పృధ్యలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే, నేను నా చిటికిన వేలి గోటితో చంపేస్తాను.

పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పావురాలు ఉండేవి. అవి ఒక ఆడ పావురము, ఒక మగ పావురము. ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న రెండు పావురములను చూశాడు. అప్పుడాయన బాణం పెట్టి ఆడ పావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కిందపడిన ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు. ఆడ పావురం చనిపోయిందని ఆ మగ పావురం చాలా బాధ పడింది. కొంతకాలానికి ఆ బోయవాడు భోరున వర్షం పడుతుండగా వేటకని వచ్చి, ఏమి కనపడకపోయేసరికి ఒక చెట్టుకింద ఉండిపోయాడు. తరువాత ఆ అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి, పూర్వం తాను ఏ ఆడ పావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు.

అప్పుడా మగ పావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్ళి నాలుగు ఎండు పుల్లలని తీసుకొని వచ్చి, ఎక్కడినుంచో అగ్నిని తీసుకువచ్చి నిప్పు పెట్టింది. అప్పుడా వేడికి ఈ బోయవాడు పైకి లేచి స్వస్తతని పొందాడు. ఆకలితో ఉన్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగ పావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది, తన భార్యను చంపిన బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే, ఒక మగ పావురం ఆతిధ్యం ఇచ్చి, తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది. నేను మనుష్యుడిలా పుట్టి, క్షత్రియ వంశ సంజాతుడనై, దశరథుడి కొడుకునై, నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములను ఎంచి, నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజుని అవుతానా??  క్షత్రియుడని అవుతానా? ఈ భూలోకములో ఉన్న సమస్త భూతములలో ఏదన్నా సరే నన్ను శరణాగతి చేస్తే, వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. శరణాగతి చేసినవాడు బలహీనుడై, శరణు ఇవ్వవలసినవాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతే, వాడు చూస్తుండగా శరణాగతి చేసినవాడు మరణిస్తే, మరణించినవాడు రక్షించనివాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకొని ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాడు. రక్షించనివాడి కీర్తి ప్రతిష్ఠతలు నశించిపోతాయి. అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, ఆయనని తీసుకురండి" అన్నాడు రాముడు.

                                     ◆ నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories