సుఖాలలో ఉంటే మూర్ఖత్వం కమ్మేస్తుందా?

ఒకసారి ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి అనిపించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? పరివారాన్ని పంపించి లోకంలో బ్రహ్మ జ్ఞాని ఎవరో కనుక్కుని రమ్మన్నాడు. పరివారం అన్ని లోకాలు తిరిగారు. చివరకు భూలోకంలో "దధ్యుడు" అనే మహర్షి బ్రహ్మజ్ఞాని అని తెలుసుకున్నారు. అదే విషయాన్ని దేవరాజయిన ఇంద్రుడికి నివేదించాడు. సరే ఇంద్రుడు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవటానికి దధ్యుడి దగ్గరకు బయల్దేరాడు. ఒక మహారణ్యం మధ్యలో చిన్న పర్ణశాల నిర్మించుకుని నివశిస్తున్నాడు దధ్యుడు. అతని ఆశ్రమానికి వచ్చాడు ఇంద్రుడు. 

సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుడు తన ఆశ్రమానికి వచ్చాడు అని తెలియగానే దధ్యుడు ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు ఇంద్రుణ్ణి. కుశల ప్రశ్నలయిన తరువాత "దేవేంద్రా ! నువ్వు చాలా పెద్దవాడివి. దేవతలకు రాజువు. అటువంటి నీకు నాతో పని ఏమిటి? నా ఆశ్రమానికి విచ్చేసిన కారణం ఏమిటి? నేను నీకు ఏమి చెయ్యగలనో చెప్పవలసింది” అన్నాడు.

ఆ మాటలు విన్న ఇంద్రుడు "మహర్షీ! నేను నీ దగ్గర కొద్దిగా పని ఉండి వచ్చాను. అది నీవల్లనే కావాలి. 'నువ్వు తప్పకుండా ఆ పని చేస్తాను' అని మాట ఇస్తే, నేను వచ్చిన పని చెబుతాను" అన్నాడు. 

దానికి దధ్యుడు. "దేవేంద్రా! నువ్వు అడగటము, నేను కాదనటమా ? తప్పకుండా చేస్తాను. నీకేం కావాలో చెప్పు” అన్నాడు. 

అప్పుడు ఇంద్రుడు మెల్లిగా తాను వచ్చిన పని బయట పెట్టాడు.  "నాకు బ్రహ్మజ్ఞానం కావాలి. అది నువ్వే చెప్పాలి” అన్నాడు. 

ఆ మాటలువిన్న దధ్యుడు ఒక్కసారిగా గతుక్కుమన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడు. అపరిమితమైన భోగలాలసుడు. నిరంతరము అప్సరాంగనలతో క్రీడిస్తూ ఉంటాడు. ఇతడు అడిగేది సర్వసంగ పరిత్యాగులు కోరుకునే బ్రహ్మజ్ఞానం.

యత్రాపి భోగోనచ తత్రమోక్షః |
యత్రాపి మోక్షో నచ తత్ర భోగః 

ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. ఈ రెండింటికీ లంకె కుదరదు. ఇంద్రుడు పూర్తిగా భోగి. అలాంటి వాడికి మోక్షకారకమైన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించటం ఎలా?

నదేయం పరశిష్యేభ్యో నాస్తికేభ్యో నచేశ్వరీ

పరశిష్యులు అంటే తనమీద నమ్మకం లేనివారు. అంతేకాని ఇతరుల శిష్యులు అని అర్ధం కాదు. అలాగే నాస్తికులు అంటే వేదమునందు నమ్మకం లేనివారు. వీరికి వేదంగాని, మంత్రశాస్త్రంగాని, బ్రహ్మజ్ఞానంగాని చెప్పకూడదు అని శాస్త్రం చెబుతోంది. ఇక్కడ ఇంద్రుడికి వేదం అంటే నమ్మకముంది కానీ భోగలాలసుడైన అతడికి, ఆ భోగాలు కేవలము క్షణికములని, అశాశ్వతములని చెప్పటం ఎలా? ఒకవేళ చెబితే అతడు వింటాడా? ఇంద్రుడు వచ్చిన పని ఏమిటో తెలుసుకోకుండానే అతని కోరిక తీరుస్తానని మాట ఇచ్చాడు తాను. ఇప్పుడతనికి బ్రహ్మజ్ఞానాన్ని వివరిస్తే అపాత్ర దానమవుతుంది. చెప్పకపోతే అసత్యదోషం అవుతుంది. ఏం చెయ్యాలి? ఏది దారి?" ఈ రకంగా ఆలోచిస్తున్నాడు. 

మళ్ళీ అడిగాడు ఇంద్రుడు "ఏం మహర్షీ! నాకు బ్రహ్మజ్ఞానం కావాలి. చెబుతావా? చెప్పవా?" ఈ సారి కూడా ఏం మాట్లాడలేదు దధ్యుడు. అలాగే మౌనంగా ఆలోచిస్తున్నాడు. 

మళ్ళీ ఇంద్రుడే అన్నాడు. "మహర్షీ! ఇందాక నా కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చావు. మరి ఇప్పుడు ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇంతకీ నాకు బ్రహ్మజ్ఞానం బోధిస్తావా? లేదా?" అన్నాడు.

 తాను ఇచ్చిన మాటను పట్టుకుని ఇంద్రుడు వత్తిడి చేస్తున్నాడు. చేయగలిగింది. లేదు. అందుకని "సరే! అలాగే చెబుతాను. రేపు ఉదయం నా శిష్యులతోబాటుగా రా !" అన్నాడు.

మరునాడు తెల్లవారింది. దైనందిన కార్యక్రమాలు ముగించుకుని కూర్చున్నాడు. మహర్షి శిష్యులు ఒక్కొక్కరే వచ్చి గురువుగారికి అభివాదం చేసి, ఆయనకు అభిముఖంగా కూర్చుంటున్నారు. వాళ్ళలో చివరగా ఇంద్రుడు వంటి మీద వస్త్రాలు, ఆభరణాలు అన్నీ తీసివేసి, గోచీ పెట్టుకుని, చేతితో దర్భలు పట్టుకుని వచ్చాడు. మహర్షికి నమస్కరించి, మిగిలినవారితో పాటుగా తనూ కూర్చున్నాడు. చెప్పటం మొదలుపెట్టాడు మహర్షి "నాయనలారా! ఈ జగత్తు అంతా మిధ్య. కంటికి కనిపించేది ఏదీ సత్యం కాదు. ఇదంతా అశాశ్వతమైనది. అంతా నశించేదే. ఈ జగత్తంతా ఒక భ్రమ. పదవులు, అధికారము, రాజ్యము అంతా భ్రమ, ఇక్కడ రాజ్యమూ లేదు అధికారము లేదు.” ఇలా సాగిపోతోంది మహర్షి యొక్క బోధ. 

ఒక్కసారిగా కోపం వచ్చింది ఇంద్రుడికి. ఇతడు చెప్పేదంతా తన గురించే. తాను ఇక్కడికి వచ్చాడని ఎద్దేవా చేస్తున్నాడు అనుకొని వెంటనే లేచి "మహర్షీ! నువ్వు కావాలనే నన్ను అవమానిస్తున్నావు. కంటికి కనిపించేదంతా నిజం కాదు. అంటున్నావు. రాజ్యం లేదు, అధికారం లేదు అంటున్నావు. ఈ మాటలన్నీ నన్ను ఉద్దేశించే చెబుతున్నావు ఇక్కడ లేనిది ఏమిటి? నా రాజ్యమా? నా అధికారమా ? ఆ రెండూ ఉన్నాయే. నా అప్సరసలు, భోగాలు ఇవన్నీ నిజమే కదా! అయినా నువ్వు కావాలని ఇలా అబద్ధాలు చెబుతున్నావు. బ్రహ్మజ్ఞానం అంటూ మళ్ళీ ఇలాంటి తప్పుడు మాటలు ఇంకెవరికైనా చెప్పావంటే నా వజ్రాయుధంతో నీ తల నరికి వేస్తాను జాగ్రత్త" అని హెచ్చరించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సుఖంలో ఉంటే మూర్ఖత్వం కమ్మేస్తుందని ఇందుకే అంటారు.

                                     ◆నిశ్శబ్ద.

 


More Purana Patralu - Mythological Stories