వైభవ గోదావరి - 1

గోదావరి విశేషాలు

 

ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా, ఏ ఛానల్ చూసినా ఈ నెల 14న ప్రారంభం కాబోయే గోదావరి పుష్కర విశేషాలే. మరి మనంకూడా ఆ విశేషాలు తెలుసుకోవాలి కదా! పుష్కరాలు ఎలా వస్తాయో క్లుప్తంగా చెబుతాను. ఎందుకంటే నేను చెప్పబోయేది గోదావరి నదిగురించి, ఆ నదీ తీరాన వున్న కొన్ని ముఖ్యమైన శైవ, వైష్ణవ పుణ్యక్షేత్రాల గురించి.నవ గ్రహాలలో ఒకటైన బృహస్పతి (గురువు) ఏడాదికో రాశి చొప్పున అన్ని రాసులలోనూ తిరుగుతూ వుంటాడు. ఆయన ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరం వస్తుంది. అంటే బృహస్పతి ఏడాదికో రాశి చొప్పున ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. అంటే మొత్తం 12 రాశులలో ప్రవేశించినప్పుడు 12 నదులకు పుష్కరాలు వస్తాయి. ఈ లెక్కన ఒక్కో నదికీ 12 సంవత్సరాలకి ఒకసారి పుష్కరం వస్తుందన్నమాట. ఏ నదికైనా పుష్కర సమయం బృహస్పతి ఆ రాశిలో ప్రవేశించిన మొదటి పన్నెండు రోజులు మాత్రమే. ఎందుకంటే పుష్కరుడు బృహస్పతితో కలసి వుండేది ఈ పన్నెండు రోజులే. అయితే గోదావరీనదికి మాత్రం అంత్య పుష్కరం కూడా వున్నది. అంటే బృహస్పతి సింహ రాశినుంచి వెళ్ళే ముందు 12 రోజులు అంత్య పుష్కరాలు. బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశించిన రోజునుంచీ 12 రోజులు గోదావరికి పుష్కర సమయం. ఈ నెల 14వ తారీకున గోదావరికి ఆది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఈ పుష్కర సమయంలో త్రిమూర్తుల దగ్గరనుంచీ సకల దేవతలేకాక పితృ దేవతలుకూడా పుష్కరాలు జరుగుతున్న నదీ జలాలలో వుండటంవలన, దేవతలంతా కొలువైన ఆ జలాలలో స్నానం చెయ్యటం, ఆ తీరాలలో దానాలు, పితృ కార్యక్రమాలు చెయ్యటం మంచి ఫలితాలనిస్తాయంటారు.

 ఏ నదికీ లేనిదీ, గోదావరీ నదీ పుష్కరాలలో మాత్రమే వున్న విశేషమేమిటంటే ఈ నదికి ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు రెండూ వుంటాయి. అంటే, బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినదగ్గరనుంచీ పన్నెండు రోజులేకాక, ఏడాది చివరిలో ఆ రాశిలోంచి వెళ్ళిపోయే ముందు పన్నెండు రోజులుకూడా పుష్కరుడు, సకల దేవతలు ఆ నదీ జలాలలో వుంటారుకనుక భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.ఈ మారు పుష్కరాలలో ఇంకొక విశేషమేముటంటే 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహా పుష్కరం ఈమారు వచ్చింది. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేది పుష్కరమైతే, 12 పుష్కరాలకు ఒకసారి వచ్చేది మహా పుష్కరం. ఈ మహా పుష్కర స్నానం వగైరాలు ఇంకా ఎక్కువ ఫలితాలనిస్తాయంటారు. అయితే వీటికీ కొన్ని విధి విధానాలున్నాయిగనుక, వాటిని పాటించి, సత్ఫలితాలను పొందండి.

మరి ఈ పుష్కరాల సమయంలో మనం గోదావరీనది గురించీ, ఆనది పరీవాహక ప్రదేశాలలో వున్న పుణ్య క్షేత్రాల గురించీ ఈ పన్నెండు రోజులూ చెప్పుకుందామనుకున్నాంకదా? ముందుగా గోదావరి నది వైభవాలు....మనకి జీవనాధారం నదీమతల్లులే. నీరులేని జీవితాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అందుకే మన పూర్వీకులు ఈ జీవ నదులను గౌరవించి, పూజించేవారు. వాటిలో స్నానాలు చేసి తరించేవారు. ఆ నీటితో దేవతలకు అర్ఘ్యాలిచ్చి ఆరాధించేవారు. కానీ మనమేం చేస్తున్నాం వ్యర్ధ పదార్ధాలతో నదులనూ, చెరువులనూ కలుషిత పరుస్తున్నాం. వాటిని పూడ్చి ఇళ్ళు కడుతున్నాం. అంటే జీవనాధారాలని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాము. దీనివల్ల నష్టం మనకీ, మన భావి తరాలకీ. ఇలాంటి సందర్భాలలోనైనా పుణ్యం వస్తుందని నదికి పోయి బుడుంగున మునిగి రాకుండా, ఆ నదీమ తల్లుల చల్లని దీవెనలు పొందటానికి మనమేం చెయ్యాలో కూడా కొంచెం ఆలోచించండి. ఇంక అసలు విషయానికి వస్తే.....గోదావరి నది గురించి కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకుందాము.

గోదావరి నది పుట్టింది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ దగ్గర పశ్చిమ కనుమల్లో. ఆ ప్రదేశం అరేబియా సముద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలోనే వున్నా గోదావరి తల్లి తన బిడ్డలమీద ప్రేమతో వారిని చల్లగా చూడాలని, సముద్రునివైపు పరుగులెత్తకుండా మహారాష్ట్రనుంచి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలవైపు ప్రవహించింది. ఈ నదీమతల్లి 1465 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతంలో అనేక లక్షల హెక్టార్ల భూమి సస్యశ్యామలమవుతోంది. ఈ నదీ జలాలు ప్రజలకి జీవనాధారలవుతున్నాయి. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి ఆ రాష్ట్రంలో ఆరు జిల్లాలలో ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో రెంజల్ మండలం కందకుర్తి దగ్గర తెలంగాణా రాష్ట్రంలో ప్రవేశించి, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలను దాటుకుని ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తోంది.మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, పాండిచేరి లలో ప్రవహించే గోదావరి ఉపనదులు ఒడిస్సా, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలలో కూడా ప్రవహిస్తున్నాయి. ఒకే ప్రవాహంగా ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రిదాకా సాగిన గోదావరి రాజమండ్రి దాటగానే ఏడుపాయలుగా చీలి సప్తఋషుల పేర్లతో ఏడుచోట్ల సముద్రంలో కలుస్తుంది.వెయిన్ గంగా, పెన్ గంగ, వార్ధా, మంజీరా, ఇంద్రావతి, బిందుసార, శబరి, ప్రవర, పూర్ణా, ప్రాణహిత, సీలేరు, కిన్నెరసాని, మానేరులు గోదావరికి ప్రధాన ఉపనదులు...

భారత దేశంలో గోదావరీ పరీవాహక ప్రాంతంలో వుండే ప్రదేశాలలో పంటలు బాగా పండుతాయి. అంతేకాదు. దేశంలోని నదులన్నింటిలోకీ అత్యధిక సంఖ్యలో డ్యామ్ లున్న నది గోదావరే. దేశంలో పురాతనమైన బ్యారేజీల్లో గోదావరి మీద ధవళేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్ట ఒకటి.అలాగే మాహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో నిర్మించిన విష్ణుపురి ప్రకల్ప్ ఆసియాలోనే అతి పెద్ద ఎత్తిపోతల పధకం.నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడులో నిర్మించబడిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఐదు జిల్లాలలో తాగునీరు, వ్యవసాయ, విద్యుత్ అవసరాలు తీరుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరున, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రినీ కలుపుతూ నిర్మించిన గోదావరి బ్రిడ్జి ఆసియాలో నీటిమీద కట్టిన రెండో పొడవైన రైల్-రోడ్ వంతెన. దీని పొడవు 4.2 కిలోమీటర్లు. అదిలాబాద్ జిల్లాలో, బాసరలోవున్న సరస్వతీ ఆలయం దేశంలోని పురాతన సరస్వతీ ఆలయాలలో రెండవదిగా చెప్పబడుతున్నది.గోదావరి నదిలో అనేక రకాల చేపలు దొరుకుతాయి. వీటిలో, వర్షాలు, వరదల సమయంలో వచ్చే ఎఱ్ఱ నీటితో వచ్చే పొలస చేపలు చాలా రుచిగా వుండటేకాదు, చాలా ఖరీదైనవి అని కూడా అంటారు. పొలస కోసం ఆస్తులు తాకట్టు పెట్టేవాళ్ళు కూడా వుంటారుట.

గోదావరి పరీవాహక ప్రదేశమంతా చాలా అందంగా వుంటుంది. ఈ నదీ ప్రవాహ అందాలు చూడాలంటే పాపికొండల యాత్ర చెయ్యాల్సిందే.ఇన్ని విశేషాలతో అలరారే గోదావరి నదీ పుష్కరాలలో స్నానం చెయ్యాలని తపించేవారు ఎందరో వుంటారు. స్నానానికి వెళ్ళేవారంతా పెద్దలు చేసిన సూచనలను పాటించి సంతోషంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిద్దాము. అందరికీ ఒక విన్నపం. ఎక్కడ చూసినా నీరు చాలా కలుషితమవుతున్నది. మీరు జీవ జలాలని ఇంకా కలుషితం చెయ్యద్దు. అలాగే మీ సమీపంలో ఎవరైనా కలుషితం చేస్తున్నా సున్నితంగా నీటి విలువ తెలియజెయ్యండి. దానికోసం ఎవరో ఎక్కడనుంచో రానక్కరలేదు. మనకి కూడా బాధ్యత వున్నది. నదులు జీవనాధారాలేకాదు, ఆధ్యాత్మికతను పెంపొందింపచేసే ఆలవాలాలుకూడా. నదులు ప్రవహించే ప్రాంతాలలో అనేక దేవతలు వెలిసిన పుణ్య క్షేత్రాలుకూడా వుంటాయి. మరి మన గోదావరి తీరంలో కూడా అనేక పుణ్య క్షేత్రాలు వున్నాయి. వాటి గురించి పుష్కరాల సమయంలో మనం రోజూ తెలుసుకుందాము. ముందుగా రేపు గోదావరి ఉద్భవించిన త్రయంబకం గురించి.

- పి.యస్.యమ్.లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

 

 

Godavari Movie Songs - Back To Back


More Purana Patralu - Mythological Stories