వివాహం కావాలి అంటే చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయాన్ని దర్శించండి

 

 

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట మండలం, నెల్లూరుకు సుమారు 98 కి. మీ., దూరంలో సూళ్లూరుపేట కళిందీనదీ తీరాన  బంగాళాఖాతానికి పులికాట్ సరస్సులకు పశ్చిమ దిశలో ఉన్న గ్రామములో చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఉన్నది. ముందుగా ఈమె 'టెంకాళి మాతగా అవతరించి చెంగాలంమ్మగా ప్రాచుర్యం పొందింది తెలియచున్నది. పూర్వం ఈ ప్రాంతాన్ని శుభగిరి అని పిలిచేవారు. సూళ్లూరుపేటకు ఈ పేరు రావడానికి చెంగాలమ్మ వారి ఆలయ పాత్ర ఉంది. ఆది ఎలాగంటే ఈ చెంగాలమ్మ ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు ఒక మేకని కట్టి మూడుసార్లు గాలిలో కర్రను గిర గిరా తిప్పడాన్ని ''సుళ్ళు  ఉత్సవం ''అంటారు. ఆవిధంగా ఈ ఊరికి సూళ్లూరుపేట అని పేరు వచ్చింది. ఈ మందిరాన్నే టెంకాళి స్వయం భూదేవి పేరుతో కూడా పిలుస్తారు. అమ్మవారి శిరస్సు పై ఆలయంలోని మర్రిచెట్టు జడలు తగులుతునట్లుగా కనిపిస్తాయి. ఇక్కడన్న పురాతన ఆలయం 4,5 శతాబ్దల్లో నిర్మించినట్లు చరిత్ర తెలియజేస్తుంది.

సూళ్లూరుపేట గ్రామంలో ప్రవహించు పవిత్ర కాలంగి నదిలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు ఇసుకలో కప్పబడియున్న విగ్రహమును పశువుల కాపరులు చూసి గ్రామ పెద్దలకు చెప్పగా,వెంటనే వారు గ్రామస్తులతో కలసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ అమ్మవారి విగ్రహము చూసి సంతోషంతో పైకి లేపుటకు ప్రయత్నుంచుగా అది సాధ్యం కాలేదు. వారు గ్రామమునకు వెళ్ళి , మర్నాడు మరికొంతమందితో వచ్చి చూడగా అమ్మవారి విగ్రహము దక్షినాది ముఖంగా నిటారుగా నిలువబడి మహిషాసురమర్ధినిగా స్వయంభువుగా వెలసియున్న దృశ్యాన్ని చూసి  అందరూ ఆశ్చర్యపోయారు.వెంటనే ఆ గ్రామస్తులు అమ్మవారికి ఒక  ఆలయాన్ని కట్టించి, తలుపులు పెట్టుటకు ప్రయత్నించగా, గ్రామ పెద్దకు అమ్మవారు కలలో కనబడి నా ఆలయానికి తలుపులు పెట్టవద్దని, భక్తులకు 24 గంటలూ తన దర్శనభాగ్యము కల్పించవలసిందిగా తెలియజేయుగా, గ్రామ పెద్ద తలుపులు  చేయించటకు తెచ్చిన చెక్కను గర్భగుడి వెనుక భాగములో ఉంచారు. తెల్లవారేసరికి ఆ చెక్క మొక్కగా చిగురించి, కొన్నాళ్ళకు అది మహావృక్షం మద్దిచెట్టుగా మారింది.నాటినుండి ఆ చెట్టు నందీశ్వరుని శిరస్సుగా, అమ్మవారి ప్రతిమగా, ఐదు  శిరస్సుల  న
నాగేంద్రస్వామిగా ఇలా వివిధ ఆకృతులతో, అనేక మంది భక్తులకు వివిధ ఆకారాలతో  మహిమాన్వితంగా దర్శనమిస్తూ, భక్తుల పూజలు అందుకుంటోంది.

అమ్మవారి దర్శించుకొని చెట్టుచుట్టు మూడు ప్రదక్షిణలు చేసినచో, వివాహము కానివారికి వివాహము, సంతానం లేనివారికి సంతానం, కాలసర్పదోషాలు నుండి విముక్తులై, వారి కోరికలు సింద్దిస్తాయని భక్తుల  తిరుగులేని నమ్మకం. ఈ అమ్మవారికి ప్రతిరోజు భక్తుల ఎక్కువ సంఖ్యలో దర్శిస్తుంటారు. చెంగలమ్మ జాతర ఇక్కడ అతి వైభవంగా జరుగుతుంది. జాతరలో భక్తులు  అమ్మవారి దర్శించుకొని మొక్కలు తీర్చుకొంటారు. ఈ జాతరకు మన  రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తరలివస్తారు.

ఈ ఆలయంలో ఉగాదిరోజు లక్షకుంకుమార్చన, మహాలక్ష్మి యాగాలు, ఆషాఢమాసంలో లాలితామహోత్సవం, లలితా హోమాలు, దేవీ శరన్నవరాత్రులతో అష్టదుర్గ హోమాలు, దీపావళి అమావాస్య ఘడియాల్లో ధనలక్ష్మి శతనామ కుంకుమార్చన, మాఘశుద్ద పౌర్ణమి రోజు ఉదయం 6 గంటలకు 108 గోక్షీర కలశాలతో గ్రామోత్సవం జరిపి శ్రీ అమ్మవారి క్షీరాభిషేకం తరువాత మహాచండీయాగం చేస్తారు. ఈ ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు.

◆ వెంకటేష్ పువ్వాడ

 


More Purana Patralu - Mythological Stories