ధార్మిక గ్రంధం భగవద్గీత

 

మహాభారతంలో ఆరోపర్వమైన భీష్మపర్వంలో వర్ణింపబడ్డ ఒక మహత్తర సంభాషణాస్వరూప వేదాంతస్రవంతి. భీష్మపర్వపు 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న 700 శ్లోకాలకు భగవద్గీత అని పేరు. 18 అధ్యాయాలుగా విభజితమైన ఈ గీతలో సారథియైన శ్రీకృష్ణుడు రథియైన పార్థునికి చేసిన వేద, వేదాంత, యోగ విశేష ప్రబోదాలున్నాయి. భగవంత్తత్వ, ఆత్మ తత్వ, జీవనగమ్య, గమ్యసాధనా యోగాలు చెప్పబడ్డాయి. ఈ భగవద్గీతకు గీత అనే చిన్న పేరు, గీతోపనిషత్తు అనే పర్యాయనామం కూడా ఉన్నాయి.

మహాభారతంలో ఆది పంచకమైన పర్వాలు పాండవుల గాథను కురుక్షేత్ర యుద్ధారంభం వరకు వర్ణించాయి. యుద్ధషట్కము అనే పేరున్న ఆరు యుద్ధపర్వాలలో మొదటిదైన భీష్మపర్వంలో యుద్ధ వర్ణనం ఆరంభమైంది. దాయాదులైన కురుపాండవుల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన ఈ యుద్ధంలో పాల్గొనడానికి వచ్చిన అర్జునుడు తన శత్రువర్గంగా నిలిచి ఉన్న బంధువులను, గురువులను, మిత్రులను చూసి చలించిపోయాడు. యుద్ధవిరక్తుడయ్యాడు. అతనికి కార్యోన్ముఖుని చేయడానికి సారథియైన కృష్ణుడు ఈ గీతాప్రభోధం చేశాడు. ఈ ప్రభోధం ప్రశ్నోత్తరిగా సాగింది. అర్జునుని సందేహాలకు భగవానుడు బదులిచ్చాడు. ఈ సంభాషణే ఈ భగవద్గీత.

వేదసాహిత్యాన్ని అందరూ చదివి అర్థం చేసుకోలేరు. కనుక వేదసారాన్ని చెప్పేందుకు ఉపనిషత్తులు వచ్చాయి. ఆ ఉపనిషత్తుల సారాంశమే ఈ భగవద్గీత అని భక్తుల విశ్వాసం. ఈ గీతలో కర్మ, భక్తి, జ్ఞానయోగాలనే మూడు జీవనమార్గాలు, భగవంత్ తత్వం, ఆత్మ స్వరూపం ముఖ్యాంశాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ | గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యాహమ్ (నేను గీతనాశ్రయించి ఉన్నాను. గీతయే నాకు ఉత్తమగు నివాసమందిరము మరియు గీతాజ్ఞానము ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను) అని వరహా పురాణంలో విష్ణువు భూదేవితో స్వయంగా వివరించాడు.

701 శ్లోకాల భగవద్గీతలో 677 మాత్రమే కృష్ణార్జున సంవాదం. ఈ సంవదాన్ని 18 అధ్యాయాలుగా విభజించడం జరిగింది. యోగం అని పిలవబడే ఈ అధ్యాయాలలొ మొదటి ఆరింటిని ‘కర్మషట్కం’ అని 7 నుంచి 12 వరకు ఉన్న యోగాలను ‘భక్తి షట్కం’ అని, 13 నుంచి చివరి వరకు ఉన్న యోగాలను ‘జ్ఞాన షట్కం’ అంటారు. ఈ అష్టాదశాధ్యాయాల్లో అనేకమైన ధార్మిక, తాత్త్విక, సామాజిక అంశాలు ప్రబోధింపబడ్డాయి.

కర్తవ్య విమూఢుడైన వ్యక్తికి జ్ఞానం బొధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీట లక్ష్యం అని చెప్పవచ్చు/కోవచ్చును. సందేహాలతో నిండిన వ్యక్తి తనకు చెప్పబడే ప్రబోధాన్నిఅంత సులువుగా అంగీకరించడు. అప్పుడు చెప్పేవ్యక్తి గురుస్థానాన్ని ఆక్రమించి శిష్యవాత్సల్యంతో వివరించాలి. గీతలో శ్రీకృష్ణుడు ఇలా పరమగుహ్యమైన జ్ఞానాన్ని పార్థునికి శిష్యవాత్సల్యంతో అందించాడు. ఆత్మ నిత్యత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని, అంతరాత్మ ప్రబోధ ఆవశ్యకతను గీత వివరించింది. అభ్యాస వైరాగ్యాల ద్వారా, భక్తి, కర్మ, ధ్యాన జ్ఞానమార్గాలలో భగవంతుని చేరవచ్చని గీత చెప్పింది. సత్కర్మలను ఆచరించాలని, కర్మల ప్రతిఫలాన్ని ఆశించరాదని కర్తవ్యబోధ చేసింది.

భగవంతుడు ఆయనను నమ్మినా, నమ్మకున్న ఎవరిని ద్వేశించడు, ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమని చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందు ప్రపంచంలో భగవత్ తత్త్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి గీత ఓఅక కాంతికిరణం. ఒక ఆశాపుంజం. భగవద్గీత నేడు ఒక నిర్వహాణ శాస్త్రగ్రంథంగా నిలిచింది. మేనేజ్మెంట్ శాస్త్రంలో వ్యక్తులను, వనరులను ఎలా నిర్వహించాలో నేర్పుతుంటే, భగవద్గీత ఆత్మ నియంత్రణ, ఆత్మ నిర్వహణను నేర్పుతున్నది. అందుకే విశ్వవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలలో గీతను అత్యుత్తమ మేనేజ్మెంట్ గ్రంథంగా ఆధ్యయనం చేస్తున్నారు. యుద్ధరంగం మధ్య నిలిచిన సంశయాత్మ అర్జునుని భగవానుడు ప్రబోధించిన ఈ గీతను అన్ని ధార్మికవాదాల ఆచార్యులు తమతమ వాదాలకు ఆలంబనగా తీసుకున్నారు. ఆదిశంకరుల నుంచి మధుసూదన సరస్వతి వరకు భగవద్గీతకు భాష్యం సంతరింకాని ఆచార్యుడు లేడు. భగవద్గీత అనూదితం కాని భాష లేదు. అంతటి మహత్తరమైన భగవద్గీతను కేవలం ఆరాధించడం, చదవడంతో ప్రయోజనం లేదు. అర్థం చేసుకుంటేనే జీవితమ సార్థకమవుతుంది. అందుకే ఆదిశంకరులు తమ భజగోవిందంలో ‘భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించినా మోక్షం లభిస్తుందని బోధించారు.

ఆదిశంకరులు, రామానుజులు, శ్రీధర స్వామి, మధుసూదన సరస్వతి, విశ్వనాథ చక్రవర్తి, బలదేవ విద్యాభూషణుల సంస్కృత గీతావ్యాఖ్యానాలు ఎంత పేరు పొందాయో, భారతీయ భాషల్లో దాని అనువాదాలూ అంతే పేరు పొందాయి. హిందీలో గీతా ప్రెస్ 37 కోట్ల పుస్తకాలను ప్రచురించి అమ్మితే అందులో సింహభాగం భారతీయ భాషలోని భగవద్గీతలదే. అలాగే ఏర్పేడులోని శుక్రబ్రహ్మాశ్రమం ప్రచురించిన శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి గీతా మకరందము తెలుసుగులో అతి ఎక్కువగా ప్రచురితమైన గీతా వ్యాఖ్యానం. భగవద్గీత ఎన్నో విషయాల్ని అత్యంత లోతుగా విశ్లేషించి, జీవిత సారాన్ని పూర్తిగా వడబోసిన గ్రంథం. ఆధ్యాత్మికతకు, నిత్య జీవితానికి ముడివేసిన అపురూప గ్రంథం.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories