సుకుమార్‌కు మహేశ్ మళ్లీ చాన్సిస్తాడా?
on Jul 7, 2020
సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎర్రచందనం దుంగల్ని స్మగుల్డ్ చేసే ట్రక్ డ్రైవర్ పుష్పరాజ్ క్యారెక్టర్లో బన్నీ కనిపించనున్నాడు. వాస్తవానికి ఈ క్యారెక్టర్లో మొదట మహేశ్‌ను ఊహించుకున్నాడు సుకుమార్. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో సుకుమార్‌తో సినిమా చెయ్యట్లేదని మహేశ్ స్వయంగా ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరి కాంబినేషన్లో అదివరకు వచ్చిన '1.. నేనొక్కడినే' మూవీ బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. కానీ సుకుమార్ టేకింగ్, మహేశ్ పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్‌లో ఉన్నాయనే పేరు మాత్రం వచ్చింది. తానే గనుక జడ్జినైతే అన్ని అవార్డులూ మహేశ్‌కే ఇచ్చేస్తానని అప్పట్లో సుకుమార్ భావోద్వేగంతో చెప్పాడు.
ఈ సినిమాని బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ చేస్తున్నాడంటూ ఫీలర్స్ ఇచ్చాడు. "ఆమిర్ ఖాన్ ఈ సినిమా చేస్తున్నాడనే విషయంపై నేనేం చెప్పినా ఎక్కువ చెప్పినట్లవుతుంది. ఆమిర్ అంతటివాడు చేస్తానంటే ఎవరికైనా ఆనందమే. అది ప్రాసెస్‌లో ఉంది. దాని గురించి ఏం చెప్పినా 'వీళ్లు ఎక్కువ చేస్తున్నారు. ఇదేదో పబ్లిసిటీ స్టంట్ లాగుంది' అంటారు. అందుకే దాని సంగతి అలా వదిలేద్దాం" అని అప్పుడు చెప్పాడు సుకుమార్. కానీ అది వాస్తవ రూపం ధరించలేదు. '1' మూవీని హిందీలో ఆమిర్ ఖాన్ కాదు కదా.. ఏ హీరో చెయ్యలేదు.
మహేశ్‌కు బ్లాక్‌బస్టర్ ఇవ్వడమనే బాకీ ఉండిపోయిందని నిన్నటి దాకా చెబుతూ వచ్చిన సుకుమార్‌కు.. ఆ అవకాశం మళ్లీ చేజారిపోయింది. 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్‌తో మహేశ్‌కు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎందుకొచ్చాయో సుకుమార్ ఇంతదాకా చెప్పనే లేదు. 'పుష్ప' మూవీ రిలీజయ్యాక అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి సుకుమార్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి. ఆ సినిమా తర్వాతైనా మహేశ్ అతడికి చాన్స్ ఇస్తాడా? డౌటే.