విజయ్‌తో పూజా హెగ్డే?
on Jan 20, 2021
తెలుగునాట వరుస విజయాలతో ముందుకు సాగుతున్న కథానాయిక.. పూజా హెగ్డే. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములోతో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధేశ్యామ్, అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాలు చేస్తోంది పూజ. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది వేసవిలోనే తెరపైకి రానున్నాయి. అలాగే హిందీలోనూ రెండు సినిమాలు చేస్తోంది మిస్ హెగ్డే.
ఇదిలా ఉంటే.. తాజాగా తమిళంలోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నాయికగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట పూజ. కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా కోలమావు కోకిల (కో కో కోకిల) ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించనున్న సినిమాలో మెయిన్ లీడ్ గా నటించేందుకు అంగీకరించిందట ఈ బుట్టబొమ్మ. త్వరలోనే విజయ్ - నెల్సన్ కాంబినేషన్ మూవీలో పూజ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా, తన తొలి చిత్రమైన 2012 నాటి ముగమూడి (తెలుగులో మాస్క్) తరువాత తమిళనాట పూజా హెగ్డే చేయబోతున్న సినిమా ఇదే కానుండడం విశేషం.