రెండో రోజు 'సుల్తాన్' కంటే 'వైల్డ్ డాగ్' కలెక్షన్ తక్కువ! భారీ లాస్ తప్పదు!!
on Apr 4, 2021
తొలిరోజు డబ్బింగ్ సినిమా 'సుల్తాన్' కంటే కొంచెం మెరుగ్గా ఓపెనింగ్స్ సాధించిన నాగార్జున మూవీ 'వైల్డ్ డాగ్'.. రెండో రోజు వెనకపడి పోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'వైల్డ్ డాగ్' రెండో రోజు కేవలం రూ. 64 లక్షల షేర్ రాబట్టగలిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తొలిరోజు ఈ సినిమాకు రూ. 1.21 కోట్ల షేర్ వచ్చిన విషయం తెలిసిందే. అంటే రెండో రోజు కలెక్షన్లు 50 శాతం పడిపోయాయన్న మాట. మౌత్ టాక్ బాగుండటంతో శని, ఆదివారాల్లో వసూళ్లు పుంజుకుంటాయని ఎక్స్పెక్ట్ చేసిన నిర్మాతలు, బయ్యర్లు, నాగార్జున నిరుత్సాహానికి గురయ్యారు.
ఏరియాల వారీగా చూస్తే తెలంగాణలో రూ. 24 లక్షలు, ఆంధ్రలో రూ. 32 లక్షలు, రాయలసీమలో రూ. 8 లక్షలు మాత్రమే వచ్చాయి. సో.. రెండు రోజులకు వచ్చిన మొత్తం షేర్ రూ. 1.85 కోట్లు! ప్రి బిజినెస్ వాల్యూ రూ. 8.9 కోట్లతో కంపేర్ చేస్తే వచ్చింది సుమారు 21 శాతమే! దీంతో బయ్యర్లలో ఆందోళన నెలకొంది.
మరోవైపు తొలిరోజు రూ. 1.17 కోట్ల షేర్ రాబట్టిన కార్తీ మూవీ 'సుల్తాన్' తెలుగు వెర్షన్.. రెండో రోజు వైల్డ్ డాగ్ కంటే ఒకింత మెరుగ్గా రూ. 72 లక్షల షేర్ వసూలు చేసింది. దీంతో రెండు రోజులకు వచ్చిన మొత్తం షేర్ రూ. 1.89 కోట్లయింది. రెండో రోజు ఈ మూవీ తెలంగాణలో రూ. 25 లక్షలు, ఆంధ్రలో 34 లక్షలు, రాయలసీమలో రూ. 13 లక్షలు రాబట్టింది. అంటే మూడు ఏరియాల్లోనూ 'వైల్డ్ డాగ్' కంటే మెరుగైన ప్రదర్శన చేసింది 'సుల్తాన్'. ప్రి బిజినెస్ వాల్యూ రూ. 6 కోట్లతో కంపేర్ చేస్తే, 31.5 శాతం రికవరీ అయింది.
ఆదివారం వచ్చే కలెక్షన్ల మీదే ఈ రెండు సినిమాలూ ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. సోమవారం నుంచి ఎటు తిరిగీ కలెక్షన్లు భారీ స్థాయిలో పడిపోతాయని తెలుసు. ఆదివారం మెరుగైన వసూళ్లు వస్తే.. ఏ సినిమాకు ఎంత లాస్ వస్తుందో (ప్రాఫిట్స్ ఉండవని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి) ఓ అంచనాకు రావచ్చు.
Also Read