English | Telugu

'సైరా'లో ఏం ఉందని చూడాలి?

on Sep 16, 2019

 

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'సైరా.. నరసింహారెడ్డి' కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి 2' రికార్డుల్ని బద్దలు కొడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ బిలీవ్ చేసిన 'సాహో'.. ఆ పని చేయలేకపోవడంతో, ఇప్పుడు అందరి దృష్టీ 'సైరా'పై నిలుస్తోంది. టాలీవుడ్‌లో 'బాహుబలి 2' క్రియేట్ చేసిన కలెక్షన్ల బెంచ్ మార్కుని 'సైరా' చెరిపేస్తుందని మెగా ఫ్యాన్స్ ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై 'సైరా' బొమ్మ పడుతుందా.. అని వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు.

రాంచరణ్‌తో 'ధృవ' మూవీ చేసి హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ను చేయనున్నట్లు ప్రకటన రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఒక చారిత్రక పురుషుడు, తొలితరం ఫ్రీడం ఫైటర్ స్టోరీని సురేందర్ రెడ్డి చేతుల్లో పెట్టడం ఏమిటన్నవాళ్లున్నారు. ఇలాంటి కథలకు రాజమౌళి, గుణశేఖర్, క్రిష్ వంటి దర్శకులు సరిగ్గా సరిపోతారనేది చాలామంది అభిప్రాయం. అయితే 'ధృవ' మూవీని తీసిన విధానమే సురేందర్ రెడ్డికి 'సైరా'ను డైరెక్ట్ చేసే అవకాశం లభించేట్లు చేసింది. అప్పటికీ సురేందర్‌కు చిరంజీవి ఒక పరీక్ష పెట్టారు. అది.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్ట్. ఆ స్క్రిప్టును తను ఆశించిన విధంగా సురేందర్ తయారు చేయగలిగితే ముందుకు వెళ్లాలనీ, లేకపోతే మరో కమర్షియల్ సబ్జెక్ట్‌తో సినిమా చెయ్యాలనీ మెగాస్టార్ భావించారు. మొత్తానికి 'ఖైదీ నంబర్ 150' తర్వాత సురేందర్ డైరెక్షన్‌లోనే సినిమా చెయ్యాలని ఆయన డిసైడ్ అయ్యారు.

ఆ పరీక్షలో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు సురేందర్. అప్పటికే పరుచూరి బ్రదర్స్ వంటి సీనియర్ మోస్ట్ రైటర్స్ చిరంజీవి కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్టును రెడీ చేసి పెట్టినప్పటికీ, దానితో సురేందర్ రెడ్డి తృప్తి చెందలేదు. తను స్వయంగా స్టడీ చేసి, ఎంతో మెటీరియల్ సేకరించి దానికి పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టులోని అంశాలను కూడా జోడించి, తను సొంతంగా స్క్రిప్టు రెడీ చేసి, చిరంజీవికి వినిపించాడు. వినడం ఆలస్యం.. సురేందర్‌ను కావలించుకొని, "మనం ఈ సినిమా చేస్తున్నాం" అని చెప్పేశారు మెగాస్టార్.

అలా పట్టాలెక్కింది 'సైరా' ప్రాజెక్ట్. అయితే పేపర్‌పై ఉన్న స్క్రిప్టును ఉన్నదున్నట్లు ఫిల్మింగ్ చెయ్యడం అంత ఈజీ కాదు. అదీ.. చారిత్రక కథకైతే మరీ కష్టం. 19వ శతాబ్దం నాటి వాతావరణాన్ని సృష్టించడానికి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ పడిన కష్టం అంతా ఇంతా కాదని 'సైరా' యూనిట్ చెప్పింది. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడకుండా, సాధ్యమైనంతగా అప్పటి వాతావరణంతో సెట్స్ వేసి, సన్నివేశాలు తియ్యాలని ప్రొడ్యూసర్ రాంచరణ్, డైరెక్టర్ సురేందర్ డిసైడ్ అవడంతో.. ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు రాజీవన్. కత్తి మీద సాము లాంటి ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించారు. సహజ వాతావరణం ఉట్టిపడేలా సెట్స్ వేసి, అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఆ సెట్స్‌లో తను అనుకున్న విధంగా సన్నివేశాలు తీసి మెగాస్టార్ మెప్పు పొందాడు సురేందర్ రెడ్డి.

రాబిన్ హుడ్ అనగానే మనకు గుర్రంపై స్వారీ చేస్తూ, ధనస్సు ఎక్కుపెట్టి బాణాలు వదిలే వీరుడు మనసులో మెదిలినట్లే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైతం గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు. అయితే ఆయన అయుధాలు విల్లంబులు కావు, రెండు కరవాలాలు. వీపున ధరించే ఆ ఖడ్గాలు నరసింహారెడ్డి చేతుల్లోకి వచ్చాయంటే, ఎదుటివాళ్ల తలలు తెగి పడాల్సిందే.

అరవై ఏళ్ల వయసంటే ఉద్యోగం నుంచి రిటైరై, కాలక్షేపం చేసే వయసు. కానీ 64 ఏళ్ల వయసులో గుర్రంపై స్వారీ చేస్తూ, కత్తి యుద్ధం చేయడమంటే మాటలా! ఎంత ఎనర్జీ, ఎంత స్టామినా కావాలి! ఎంతగా దమ్ము పట్టాలి! కానీ మెగాస్టార్ ఆ పని చేశారు. యుద్ధ సన్నివేశాల్లో అతి తక్కువగా మాత్రమే బాడీ డబుల్‌ను.. అంటే డూప్‌ను వాడేందుకు ఒప్పుకొని, దాదాపు అన్ని సన్నివేశాల్నీ తానే వీరోచితంగా చేశారు. ఆ వార్ సీన్స్‌లో చిరంజీవి చెలరేగిన తీరు చూసి, ఆయన స్టామినా చూసి.. డైరెక్టర్, ఫైట్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్ సహా యూనిట్ అంతా సంభ్రమం చెందారంటే.. ఆ సన్నివేశాలు ఎలా వచ్చి ఉంటాయో ఊహించుకోవాల్సిందే. వాటికి సంబంధించిన శాంపిల్స్‌ని మనం టీజర్‌లో చూశాం. మూవీలో పూర్తి స్థాయిలో ఆ వార్ ఎపిసోడ్స్ చూస్తే మతులు పోవడం ఖాయమంటోంది 'సైరా' సైన్యం.

'సైరా'లో ప్రేక్షకుల్ని కట్టిపడేసే సన్నివేశాలు అనేకం ఉన్నాయి. వాటన్నింటిలో క్లైమాక్స్ ఉద్విగ్నభరితంగా, గుండెలు పిండేసేలా ఉంటుంది. కారణం.. అది.. నరసింహారెడ్డిని ఉరితీసే సన్నివేశం కాబట్టి. అలాగే ఇంటర్వెల్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు, కోట ముట్టడి సన్నివేశాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయని యూనిట్ మెంబర్స్ అంటున్నారు.

'సైరా'కు సంబంధించిన అతి కీలక అంశం ఒకటుంది. ఇది కేవలం వార్ ఫిల్మ్ కాదు. ఇది కేవలం స్వాతంత్ర్య సమర గాథ కాదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సమర రంగాన కదం తొక్కే వీర యోధుడు మాత్రమే కాడు. ఆయన ఒక కుటుంబ పెద్దగా కూడా దర్శనమిస్తాడు. భార్యను అమితంగా ప్రేమించే, గౌరవించే ఒక భర్తగా కనిపిస్తాడు. అందుకే ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా ఈ మూవీలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు డైరెక్టర్. చిరంజీవి, నయనతారపై చిత్రీకరించిన సన్నివేశాలు భావోద్వేగంతో కొనసాగి ఆకట్టుకుంటాయి. అంతేనా.. నరసింహారెడ్డిలోని ఒక ప్రేమికుడిని కూడా ఇందులో మనం చూడబోతున్నాం. అందులో భాగంగా చిరంజీవి, తమన్నా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయనేది యూనిట్ సభ్యుల మాట.

ఇక అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవి కిషన్ వంటి స్టార్ యాక్టర్స్ చేసిన పాత్రల గురించి ఇదివరకే మనం పరిచయం చేసుకున్నాం. వాళ్లు చెయ్యడం వల్లే 'సైరా'కు ప్యాన్ ఇండియా లుక్ వచ్చింది. ఫలితమే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుండటం. అన్నట్లు ఒక విషయం చెప్పడం మరిచాను.. ఝాన్సీ లక్ష్మీబాయిగా కొద్దిసేపు కనిపించి ప్రేక్షకుల్లో ఉద్వేగాన్ని రేకెత్తించే పాత్రలో అనుష్క వీర విహారం చేయనున్నది. మూవీ ప్రారంభంలోనూ, ముగింపులోనూ ఆమె కనిపించనున్నది.

ఇన్ని విశేషాలు, విశిష్ఠతలూ ఉన్న 'సైరా.. నరసింహారెడ్డి'ని చూడొద్దనుకొనే సినీ ప్రియులు ఉంటారా? అందుకే అందరూ అంత అత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూడ్డం. ఆ రోజు.. అక్టోబర్ 2.. వచ్చేస్తోంది.. ఈ లోగా ట్రైలర్‌తో సరిపెట్టుకుందాం.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here