English | Telugu

'విజిల్' వర్సెస్ 'ఖైదీ'

on Oct 22, 2019

 

అక్టోబర్ 27 దీపావళి పర్వదినం. దేశంలోని మిగతా ప్రాంతాలకు మల్లే తెలుగువాళ్లకూ పెద్ద పండగ. బాణసంచా మోతలతో సందడి బాగా కనిపించే పండగ. అలాంటి పండగకు సినిమాలతోనూ సంబరాలు చేసుకోవాలని భావించే సినీ అభిమానులూ ఎక్కువే. ఆశ్చర్యకరంగా ఈ దీపావళికి రెండు పెద్ద తమిళ సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్లు తెలుగునాట ఢీకొంటున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోలెవరూ ఈ దీపావళికి తమ సినిమాలను ప్లాన్ చెయ్యకపోవడంతో, ఇదే అదనుగా ఆ తమిళ సినిమాలు తెలుగు మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో ఒకటి.. రజనీకాంత్ తర్వాత మాస్‌లో అంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ నటించిన 'విజిల్' కాగా, రెండోది.. తెలుగునాట కూడా మార్కెట్ ఉన్న కార్తీ.. టైటిల్ రోల్ చేసిన 'ఖైదీ'.

'విజిల్' మూవీలో విజయ్ డబుల్ రోల్ చేశాడు. తమిళ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా స్వల్పకాలంలోనే ఎదిగిన అట్లీ డైరెక్ట్ చేసిన తమిళ 'బిగిల్' మూవీకి ఇది తెలుగు వెర్షన్. కొన్నేళ్ల క్రితం వరకు రజనీకాంత్, కమల్ హాసన్, విక్రం, సూర్య, విశాల్, కార్తీ వంటి తమిళ హీరోలకు మాత్రమే తెలుగునాట మార్కెట్ ఉండేది. విజయ్‌ను తెలుగు ప్రేక్షకులు పట్టించుకొనేవాళ్లు కాదు. కానీ ఎ.ఆర్. మురుగదాస్ రూపొందించిన 'తుపాకి' మూవీ తెలుగునాట తొలిసారిగా విజయ్ మార్కెట్‌కు గేట్లు తెరిచింది. 

ఆ తర్వాత నుంచి విడుదలవుతూ వచ్చిన విజయ్ సినిమాలు కొద్దో గొప్పో ఇక్కడ కూడా వసూళ్లను సాధిస్తూ వస్తున్నాయి. అట్లీ డైరెక్ట్ చేసిన విజయ్ మునుపటి మూవీ 'మెర్సాల్' తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదలై చెప్పుకోదగ్గ కలెక్షన్లను సాధించింది. ఈ నేపథ్యంలో 'విజిల్' సినిమాపై తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కల్యాణ్‌రాంతో '118' చిత్రాన్ని నిర్మించి, ప్రస్తుతం కీర్తీ సురేశ్ టైటిల్ రోల్ చేస్తున్న 'మిస్ ఇండియా' సినిమాని నిర్మిస్తోన్న మహేశ్ కోనేరు 'విజిల్'ను తెలుగులో విడుదల చేస్తున్నాడు.

ఇప్పటివరకూ విజయ్ సినిమాల్లోనే అత్యధిక థియేటర్లలో తెలుగునాట 'విజిల్' విడుదలవుతోంది. ఒక్క తెలంగాణలోనే 200 పైగా థియేటర్లలో సినిమా రిలీజవుతోందంటే.. విజయ్ మార్కెట్ ఇక్కడ కూడా పెరుగుతోందని అర్థం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమూల థియేటర్లలోనూ ఈ సినిమా రిలీజవుతోంది. దాదాపు 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమాని తమిళ అగ్ర నిర్మాత కలైపులి ఎస్. థాను 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో దశాబ్దం తర్వాత విజయ్, నయనతార జోడీ కట్టారు. 2009లో వచ్చిన 'విల్లు' సినిమా తర్వాత వాళ్లు కలిసి నటించింది 'విజిల్'లోనే. విశేషమేమంటే 'విల్లు'లోనూ విజయ్ డబుల్ రోల్ చెయ్యడం.

ఇక 'ఖైదీ' విషయానికొస్తే.. 2010లో వచ్చిన 'యుగానికి ఒక్కడు' (తమిళంలో 'ఆయిరత్తిల్ ఒరువన్') సినిమా నుంచే తెలుగునాట కార్తీ గుర్తింపుకు నోచుకున్నాడు. లింగుస్వామి డైరెక్ట్ చేసిన 'అవారా' మూవీ కార్తీని తెలుగు ప్రేక్షకులకు సన్నిహితం చేసింది. అందువల్లే నాగార్జున సినిమా 'ఊపిరి'లో ఓ హీరోగా తొలిసారి స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటించే అవకాశం పొంది, తన చలాకీ నటనతో ఆకట్టుకున్నాడు. ఆ మధ్య వచ్చిన డబ్బింగ్ సినిమా 'ఖాకీ' కూడా చెప్పుకోదగ్గ వసూళ్లను సాధించింది. 

ఇప్పుడు 'ఖైదీ'గా అక్టోబర్ 25న 'విజిల్'తో అటు తమిళనాటే కాకుండా, తెలుగునాట కూడా విజయ్‌తో ఢీకొడుతున్నాడు కార్తీ. 'మానగరం' అనే ఒకే సినిమాతో ప్రతిభావంతుడైన డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన 'ఖైదీ'లో హీరోయిన్ లేదు, ఉర్రూతలూగించే పాటలు లేవు, రొమాన్స్ లేదు. కానీ ఒళ్లు గగుర్పాటు కలిగించే యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్స్‌ను డూప్ లేకుండా కార్తీ చేశాడని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు. చెప్పాలంటే ఒక పూర్తిస్థాయి యాక్షన్ మూవీగా 'ఖైదీ' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాకపోతే కూతురి సెంటిమెంట్, భావోద్వేగభరిత సన్నివేశాలు కూడా ఉంటాయి.

'విజిల్' తరహాలోనే తెలుగునాట చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లలో 'ఖైదీ' విడుదలవుతోంది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.కె. రాధామోహన్ తెలుగు హక్కుల్ని పొందగా, తెలంగాణలో పేరుపొందిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ, పలు థియేటర్లను తన అధీనంలో ఉంచుకున్న గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తుండటం గమనార్హం. ఒక విలక్షణ సినిమా అనుభవాన్ని ఇస్తుందని ఇప్పటికే బాగా ప్రచారం పొందిన 'ఖైదీ'తో కార్తీ తెలుగు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

ఇక తెలుగు స్ట్రెయిట్ సినిమాల విషయానికి వస్తే.. రెండు చిన్న సినిమాలు అక్టోబర్ 25న తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. 'బిత్తిరి సత్తి' అనే టీవీ కేరెక్టర్‌తో పాపులర్ అయిన మిమిక్రీ ఆర్టిస్ట్ రవి.. 'తుపాకి రాముడు'గా తొలిసారి హీరో పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో 'బతుకమ్మ' సినిమాతో పేరు ప్రఖ్యాతులు పొందిన సీనియర్ డైరెక్టర్ టి. ప్రభాకర్ డైరెక్ట్ చెయ్యగా, జానపద కళాకారుడు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాతో నవ్వించడంతో పాటు, ఏడిపిస్తానని కూడా బిత్తిరి సత్తి చెపుతున్నాడు.

'తుపాకి రాముడు' సినిమాతో పాటు 'ప్లానింగ్' అనే ఇంకో చిన్న సినిమా కూడా అదే రోజు రిలీజవుతోంది. ఈ సినిమాకి పనిచేసిన తారలు కానీ, డైరెక్టర్ కానీ ప్రేక్షకులకు ఏమాత్రం తెలీనివాళ్లు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25న విడుదలవుతున్న భారీ డబ్బింగ్ సినిమాలకు తెలుగు చిన్న సినిమాలు ఏ కాస్త పోటీ ఇచ్చినా గొప్పేననుకోవాలి.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here