'వాల్మీకి'పై విజయ్ దేవరకొండ సానుభూతి
on Sep 20, 2019
వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చెయ్యగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'వాల్మీకి' మూవీ టైటిల్ను చివరి నిమిషంలో 'గద్దలకొండ గణేష్'గా నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అప్పటికే 'వాల్మీకి' పేరుతో ప్రచారం చేసినందువల్ల బయట ఎక్కడా 'గద్దలకొండ గణేష్' పేరుతో పోస్టర్లు కనిపించలేదు. సెన్సార్ సర్టిఫికెట్ కూడా 'వాల్మీకి' పేరుతోటే ఇచ్చినందువల్ల దానినే థియేటర్లలో ప్రదర్శించడం గమనార్హం. బోయ సామాజిక వర్గం వాళ్లు చేసిన ఆందోళనల ఫలితంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆ సినిమా ప్రదర్శన నిలిపివేతకు కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వడంతో మరో దారిలేక నిర్మాతలు 'గద్దలకొండ గణేష్'గా టైటిల్ మారుస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక మాధ్యమల్లో ఆ మేరకు పోస్టర్లు ప్రచారంలోకి తెచ్చారు.
కాగా ఈ టైటిల్ మార్పు విషయమై హీరోలు, దర్శకులు ఓ వైపు మద్దతు తెలుపుతూనే, మరోవైపు సానుభూతి ప్రకటించారు. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ "వాల్మీకి ఇప్పుడు 'గద్దలకొండ గణేష్'. ఒక సినిమాకి ఇలాంటిది జరగడం దురదృష్టకరం. కానీ థియేటర్లు ఫుల్ అవుతాయనీ, సినిమాని జనం ఎంజాయ్ చేస్తారనీ ఆశిస్తున్నా. వరుణ్ తేజ్కూ, హరీశ్ శంకర్ అన్నకూ, అధర్వమురళికీ, పూజా హెగ్డేకీ, మిగతా టీంకు నా శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశాడు. అలాగే డైరెక్టర్లు వంశీ పైడిపల్లి, బాబీ, హీరో సుధీర్ బాబు సైతం ఇదే రకమైన ట్వీట్స్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
